
సాక్షి, హైదరాబాద్: తుది విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు 439, జెడ్పీటీసీ సీట్లకు 79 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 14న జరగనున్న తుదిదశ ఎన్నికలకు గురువారంతో నామినేషన్ల సమర్పణ ముగియనుంది. నామినేషన్ల దాఖలు తొలిరోజు (మంగళవారం) జెడ్పీటీసీలకు.. టీఆర్‌ఎస్ 24, కాంగ్రెస్ 16, బీజేపీ 12, సీపీఐ 7, సీపీఎం 4, ఇండిపెండెంట్ 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీలకు టీఆర్‌ఎస్ 158, కాంగ్రెస్ 135, బీజేపీ 52, సీపీఐ 12, సీపీఎం 5, టీడీపీ 4, గుర్తింపు పొందిన, ఎస్‌ఈసీ వద్ద రిజిష్టరైన పార్టీలు 3, ఇండిపెండెంట్ 70 మంది నామినేషన్లు వేశారు. ఈ మూడో విడతలో భాగంగా 1,738 ఎంపీటీసీలకు, 161 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమర్పణ ముగిశాక, శుక్రవారం సాయంత్రం 5 వరకు పరిశీలన, ఆ తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు.
ఈ నెల 6, 10ల్లో జరిగే మొదటి, రెండు విడతల ఎన్నికలతో కలిపి, 3 విడతల్లో పడిన ఓట్లను మే 27న ఉదయం 8 తర్వాత లెక్కించి, అది ముగియగానే ఫలితాలను ప్రకటించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఒక్కరోజే నల్లగొండ జిల్లాలో రూ.64 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. వివిధ జిల్లాల్లో రూ.73,661 విలువైన మద్యాన్ని జప్తు చేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ.76.40 లక్షల నగదు, రూ.17.50 లక్షల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సమర్పించే వ్యయ ఖాతాలను కనీసం 3 సార్లు వ్యయ పరిశీలకులు తనిఖీ చేయాలన్న గత ఆదేశాలను కనీసం ఒక్కసారి పరిశీలించేలా ఎస్‌ఈసీ బుధవారం సవరించింది.