సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారానికి వేళైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లా, మండల స్థాయిల్లో ఎన్నికల ప్రచారంతో వేడి పుట్టించేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలతో, ఆ పార్టీలు అధికారికంగా పోటీకి నిలిపే అభ్యర్థులతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న తొలి విడత ఎన్నికల నేపథ్యంలో, ఆ విడతలో బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించనున్నారు. అలాగే గుర్తులు కూడా కేటాయిస్తారు. తొలి విడత ప్రచారం మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడత ప్రచారం నేపథ్యంలో ఎస్‌ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా జిల్లా ఎన్నికల అధికారులు, జనరల్ అబ్జర్వర్ల విచారణ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై ప్రకటన చేయాలని స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే...
అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా... ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ దొరికినా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఈ అక్రమ పద్ధతుల్లో గెలిచిన వారిని పదవి నుంచి తొలగించడంతోపాటు ఆరేళ్లు ఎలాంటి పదవులకు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార, చర్చా వేదికలుగా ఉపయోగించడం, ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక అధికారులకు కల్పించారు. అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదటి వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తుల్లో మొదటి గుర్తును, రెండో అభ్యర్థికి రెండో గుర్తును కేటాయిస్తారు. ఒకవేళ బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటే నామినేషన్ సంఖ్య ఆధారంగా గుర్తులను కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
వేలం వేస్తే వేటే...
ఏకగ్రీవాల కోసం వేలం వేసి ఓటర్లను కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, అభివృద్ధి సాధన కోసం అంటూ ఆయా పోస్టులను వేలం వేస్తే జైలు, జరిమానా, అనర్హత వేటు వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉంది. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించకుండా విచారణ చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఎస్‌ఈసీ పేర్కొంది. గతంలో ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులే ప్రకటించేవారు. కానీ ఈ సారి ఏకగ్రీవమైనట్లుగా దరఖాస్తు చేసుకోవాలని, దాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అధికారి లేదా జనరల్ పరిశీలకులు విచారణ చేసి, ఆ తర్వాత జిల్లా కలెక్టరే ప్రకటిస్తారంది. విచారణలో అనైతిక వ్యవహారాలు, డబ్బు ప్రభావం వంటివి బయటకు వస్తే... రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment