jublilee hills police station
-
జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో ఈ దారుణం వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలోని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ను బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. -
‘ఆంధ్రజ్యోతి’పై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని తప్పుడు వార్తను ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కె.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగులుతుందని నిరాధారమైన వార్తలు ప్రచురించిందన్నారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో కల్పిత వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. గత 15 రోజుల్లో విద్యుత్‌పై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు వచ్చాయన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తూ ప్రజల అభిమానం పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇలాంటి కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు. దీని వెనుక పెద్దల కుట్ర ఉందని ఆరోపించారు. అసత్య వార్తలు ప్రచురించిన సదరు దినపత్రికపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రేమను అంగీకరించలేదని స్క్రూ డ్రైవర్‌తో దాడి
సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంగా యువతిని తన నుంచి దూరం చేస్తున్నారన్న ఆవేశంతో ఓ యువకుడు మహిళతో పాటు అడ్డు వచ్చిన ఆమె కూతురిపై దాడి చేయడమే కాకుండా ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(31) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని స్రవంతి నగర్లో ఇద్దరు స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. తమిళనాడుకు చెందిన సౌజన్య(26) తన తల్లి సుజాతతో కలిసి ఇదే ప్రాంతంలో అద్దెకుంటున్నది. శ్రీనివాస్‌రెడ్డి, సౌజన్య ఇద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. కొంత కాలంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రేమ పేరుతో సౌజన్య వెంటపడుతున్నాడు. ప్రేమిస్తున్నానని పెళ్ళి చేసుకుంటానని ఆమెను వేధింపులకు గురి చేయసాగాడు. ఆమె ఎప్పటికప్పుడు తిరస్కరిస్తున్నది. ఆగ్రహం పట్టలేని శ్రీనివాస్‌రెడ్డి తాడోపేడో తేల్చుకుందామని పథకం ప్రకారం తన వెంట ఓ స్క్రూ డ్రైవర్ జేబులో పెట్టుకొని శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సౌజన్య ఇంటికి వెళ్ళాడు. అప్పటికి జాబ్ నుంచి సౌజన్య ఇంకా తిరిగి రాలేదు. ఆ సమయంలోనే శ్రీనివాస్‌రెడ్డి ఆమె తల్లి సుజాతతో తమ ప్రేమ విషయం చెప్పి అడ్డు రావద్దంటూ హెచ్చరించాడు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు... ప్లీజ్.. అంటూ సుజాత వేడుకుంది. తండ్రి లేని నా కూతురిని ఆగం చేయవద్దంటూ కాళ్ళావేళ్ళాపడింది. వినిపించుకోని శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రేమకు అడ్డు వస్తుందన్న ఆగ్రహంతో తనతో పాటు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో సుజాతపై దాడి చేశాడు. సరిగ్గా అదే సమయంలో సౌజన్య ఇంటికి వచ్చి రక్తం కారుతున్న తల్లిని, దాడికి పాల్పడుతున్న శ్రీనివాస్‌రెడ్డిని చూసి భయంతో వణికిపోయింది. మరోసారి తల్లిని పొడిచేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుంది. దీంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఓ వైపు తల్లి రక్తం కారుతూ కిందపడిపోగా గాయాలతో సౌజన్య కూడా అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. వెంటనే వెళ్ళి చికిత్స నిమిత్తం మ్యాక్స్ క్యూర్‌ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితుడి కోసం ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. దాడి చేసిన అనంతరం నిందితుడు నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్ళి సమీపంలోని రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ ఎస్ఐ సుధీర్‌రెడ్డి నిందితుడి కాల్‌డేటా తీసుకొని అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా అది నిందితుడి సోదరుడిగా తేలింది. విషయం చెప్పగా తన సోదరుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు.జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దిన పత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌తో పాటు ఆ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సోమవారం క్రిమినల్ కేసు నమోదు అయింది. తనది కాని ‘వాయిస్’ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్లో పదే పదే ప్రసారం చేస్తూ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, అసత్య ప్రచారం చేస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా అనంతరం పోలీసులు ఇవాళ... సెక్షన్లు 171సి, 171జీ, 171ఎఫ్, 469,505(2) కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. కాగా టీడీపీకి అమ్ముడుపోయిన వేమూరి రాధాకృష్ణ తన వాయిస్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేయడంతో పాటు ఆంధ్రజ్యోతి దిన పత్రికలోనూ ప్రచురించి తన పరువు తీశారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణపై ఐపీసీ సెక్షన్ 120 (బి), సెక్షన్ 153 (ఏ), 171(సి) 171(హెచ్), 420, 123,125 రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ఈ నెల 5వ తేదీన తనదికాని వాయిస్‌తో ఏబీఎన్ ఛానల్లో ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు అన్నట్లుగా ప్రసారం చేసి తనతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని, శనివారం కూడా ఈ అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ చర్చావేదికలో పాల్గొన్నవారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఆధారాలు లేకుండా ప్రసారం చేసిన అంశంపైన తన వాయిస్‌ను డబ్బింగ్ చేసిన విధానంపై తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కుట్ర వెనక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించి తప్పుడు ప్రచారం చేశారని, తెలుగు ప్రజల మనోభావాలు దీని వల్ల దెబ్బతిన్నాయని ఆయన పేర్కొంటూ ఈ నెల 5,6 తేదీల్లో ఆ చానల్లో తనపై వచ్చిన ప్రసారాల ఆడియో టేపులను, ఈనెల 7న ఆంద్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు జత చేశారు. చదవండి...: వారిద్దరిపై కేసు నమోదు చేయండి ఆంధ్రజ్యోతి వశీకరణ వార్తలు పట్టించుకోవద్దు! ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే! -
రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో హై కోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. జూబీహిల్స్‌లోని కో - ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఏడు ఒపెన్ ప్లాట్లను, ప్లాట్లుగా చేసి అమ్మేసిన కేసులో రేవంత్ రెడ్డిపై చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా జూబ్లీహిల్స్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హై కోర్టు న్యాయవాది రామారావు, రేవంత్ రెడ్డిపై, జూబ్లీహిల్స్ పోలీసులపై నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై సెక్షన్ 166 ఏ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి వివరాలను కోర్టుకు నివేదించాల్సిందిగా కమిషనర్‌ను అభ్యర్ధించారు. -
'పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అన్నారే..'
హైదరాబాద్: 'లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్ లు నన్ను కలిశారు. వాళ్ల బ్యానర్ లో నేను ఐదు సినిమాల చేసేలా ఒప్పందం చేసుకుందామన్నారు. ప్రత్యేకంగా తనకో సినిమా చేసిపెట్టాలని ముత్యాల రామ్ దాస్ అడిగారు. ఆ తర్వాతగానీ వాళ్ల ఉద్దేశం ఏంటో నాకు తెలిసిరాలేదు. నాతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని నాపై రుద్దే ప్రయత్నం చేశారు. వాళ్ల నష్టాలకు నన్ను బాధ్యుణ్ని చేయాలని చూశారు. లోఫర్ సినిమా ప్రమోషన్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అని, మమ్మల్ని చూసుకుంటారని ఏదేదో మాట్లాడారు. కేవలం పూరి జగన్నాథ్ వల్లే లోఫర్ నైజాం హక్కులను రూ.7.5 కోట్లకు కొన్నామని సుధీర్ చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ సినిమా నైజాం హక్కులు రూ.3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. దీన్ని బట్టే ఆ ముగ్గురూ ఎంత డ్రామా ఆడారో అర్థం అవుతుంది. బ్లాక్ మెయిల్ చేసి తప్పుడు లెక్కలు చూపారని తెలుస్తోంది' అంటూ డిస్ట్రిబ్యూటర్లతో నెలకొన్న వివాదంపై సుదీర్ఘవివరణ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాత సి. కల్యాణ్ అంటే తనకెంతో గౌరవమని, అతని కోసం ఎన్ని సినిమాలైనా చేస్తానుగానీ, అలాంటి తప్పుడు మనుషుల కోసం చేయనని సదరు డిస్ట్రిబ్యూటర్లను ఉద్దేశించి పూరి వ్యాఖ్యానించారు. 'నేను కూడా చాలా సినిమాలు నిర్మించాను. విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంబంధించి బయ్యర్లు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. ప్లాప్ అయిన సినిమాలకు మాత్రం నేను అన్ని క్లియర్ చేశా' అని నిర్మాణరంగంలో తానెంత నిజాయితీతో వ్యవహరిస్తున్నది చెప్పుకొచ్చారు పూరి. లోఫర్ సినిమాకు తాను దర్శకుడిని మాత్రమేనని, నష్టాలకు తనను బాధ్యుడ్ని చేయటం సరికాదని ఆయన వాపోయారు. లోఫర్ కోసం నా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నానని, వరుణ్ తేజ్ మంచి భవిష్యత్ ఉన్న హీరోఅని అన్నారు. అంతకుముందు.. దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత చిల్లర కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడిచేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవమారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.