సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంగా యువతిని తన నుంచి దూరం చేస్తున్నారన్న ఆవేశంతో ఓ యువకుడు మహిళతో పాటు అడ్డు వచ్చిన ఆమె కూతురిపై దాడి చేయడమే కాకుండా ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(31) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని స్రవంతి నగర్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. తమిళనాడుకు చెందిన సౌజన్య(26) తన తల్లి సుజాతతో కలిసి ఇదే ప్రాంతంలో అద్దెకుంటున్నది. శ్రీనివాస్‌రెడ్డి, సౌజన్య ఇద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు.
కొంత కాలంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రేమ పేరుతో సౌజన్య వెంటపడుతున్నాడు. ప్రేమిస్తున్నానని పెళ్ళి చేసుకుంటానని ఆమెను వేధింపులకు గురి చేయసాగాడు. ఆమె ఎప్పటికప్పుడు తిరస్కరిస్తున్నది. ఆగ్రహం పట్టలేని శ్రీనివాస్‌రెడ్డి తాడోపేడో తేల్చుకుందామని పథకం ప్రకారం తన వెంట ఓ స్క్రూ డ్రైవర్ జేబులో పెట్టుకొని శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సౌజన్య ఇంటికి వెళ్ళాడు. అప్పటికి జాబ్ నుంచి సౌజన్య ఇంకా తిరిగి రాలేదు. ఆ సమయంలోనే శ్రీనివాస్‌రెడ్డి ఆమె తల్లి సుజాతతో తమ ప్రేమ విషయం చెప్పి అడ్డు రావద్దంటూ హెచ్చరించాడు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు... ప్లీజ్.. అంటూ సుజాత వేడుకుంది. తండ్రి లేని నా కూతురిని ఆగం చేయవద్దంటూ కాళ్ళావేళ్ళాపడింది. వినిపించుకోని శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రేమకు అడ్డు వస్తుందన్న ఆగ్రహంతో తనతో పాటు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో సుజాతపై దాడి చేశాడు.
సరిగ్గా అదే సమయంలో సౌజన్య ఇంటికి వచ్చి రక్తం కారుతున్న తల్లిని, దాడికి పాల్పడుతున్న శ్రీనివాస్‌రెడ్డిని చూసి భయంతో వణికిపోయింది. మరోసారి తల్లిని పొడిచేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుంది. దీంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఓ వైపు తల్లి రక్తం కారుతూ కిందపడిపోగా గాయాలతో సౌజన్య కూడా అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. వెంటనే వెళ్ళి చికిత్స నిమిత్తం మ్యాక్స్ క్యూర్‌ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.
నిందితుడి కోసం ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. దాడి చేసిన అనంతరం నిందితుడు నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్ళి సమీపంలోని రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి నిందితుడి కాల్‌డేటా తీసుకొని అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా అది నిందితుడి సోదరుడిగా తేలింది. విషయం చెప్పగా తన సోదరుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు.జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment