‘ఒకే ఎన్నిక’ కోసం పిటిషన్లపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల నుంచి రెండు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం వాదనలు ముగియగానే వీటిపై నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈసీ నిర్ణయంపై వైఎస్సార్సీపీ నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, కరణం ధర్మశ్రీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడి, పి.సుధాకర్‌రెడ్డి వాదించారు. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి మొత్తం జిల్లాను ఒక నియోజక వర్గంగా పరిగణించి, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సీటును కేటాయించారని, అయితే కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల విషయంలో మాత్రం మొత్తం జిల్లాను ఒక నియోజకవర్గంగానే పరిగణించి రెండు సీట్లు కేటాయించారన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు నిర్వహించేటప్పుడు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని, ఒకే ఎన్నిక నిర్వహించాల్సి ఉందన్నారు.
ఈలోగా పనివేళలు ముగియడంతో హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, చిత్తూరు జిల్లాలో రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడితే, ఈసీ మాత్రం ఒక స్థానానికే ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించిందని, ఖాళీ అయిన రెండు స్థానాలకూ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ బుధవారానికి వాయిదా పడింది.