ఫిర్యాదుల్ని పరిశీలించరా?
సాక్షి, చెన్నై: ఫిర్యాదు దారులు ఇచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించే సమయం కూడా లేదా..? అని పోలీసులకు హైకోర్టు చురకలు అంటించింది. సెంబరంబాక్కం నీటి విడుదలపై వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి ప్రాథమిక విచారణతో నివేదిక సమర్పణకు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో పెను ప్రళయాన్ని చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం వాసులు చవి చూసిన విషయం తెలిసిందే. అయితే, సెంబరంబాక్కం నీటిని ముందస్తు హెచ్చరిక లేకుండా విడుదల చేయడం, పెద్ద మొతాదులో నీటి విడుదల ఏక కాలంలో జరగడం వెరసి చెన్నైను ముంచేసిందన్నది జగమెరిగిన సత్యం.
ఈ వ్యవహారంపై న్యాయ విచారణకు ప్రతిపక్షాలు పట్టుబడుతూ వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం వివరణతో దాటవేత దోరణి సాగించింది. ఈ పరిస్థితుల్లో వెస్ట్ మాంబళంకు చెందిన ఆర్ముగం అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదల కారణంగానే చెన్నై నీట మునిగిందని, సర్వం కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారని, ఆ నీటి ప్రళయంతో ఇళ్లలోని వస్తువులన్నీ సర్వనాశనం అయ్యాయని తన పిటిషన్లో వివరించారు.
సెంబరంబాక్కం నీటి విడుదల మీద ముందస్తు హెచ్చరికలు చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు సర్వత్రా పరిగణించి ఉన్నారన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్లో చెన్నై పోలీసుల్ని తాను ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదల మీద ముందస్తు ప్రకటన చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించానని, అయితే, ఇంత వరకు వారిలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ పిటిషన్ను న్యాయమూర్తి మాలా లలిత కుమారి పరిగణలోకి తీసుకున్నారు. శుక్రవారం విచారణ సమయంలో పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూనే, పోలీసులకు చురకలు అంటించారు. ఫిర్యాదులు వస్తే ప్రాథమిక విచారణకు కూడా చేయరా..? అని ప్రశ్నించారు. పిటిషనర్ ఫిర్యాదును పరిశీలించి విచారణ చేపట్టాలని, ఆయన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలతో కూడిన ప్రాథమిక నివేదికను ఈనెల పన్నెండో తేదిన కోర్టు ముందు ఉంచాలని ఆదేశించి, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.