మున్సి‘పోల్స్’ కోలాహలం
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో మూడున్నరేళ్ల ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలు అనివారం కావడంతో జిల్లాలో కోలాహలం మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్ మినహా జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది.
ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తోంది. నాయకులు అభ్యర్థుల ఎంపికపై తలమునకలవుతున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ అభ్యర్థులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించవచ్చనే చర్చ జరుగుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆశావహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విభజన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడం.. వైఎస్ఆర్సీపీ ఊపు మీద ఉండటంతో అభ్యర్థుల్లో పోటీ అధికమైంది.
అయితే కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజన గుబులు వెంటాడుతోంది. సమైక్యవాదులు ఆ పార్టీని మట్టికరిపించేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతం కూడా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది. విభజనకు ఆయన కూడా కారణం కావడంతో ఓటమి భయం నెలకొంది.
ఇక బీజేపీ, సీపీఐ పార్టీలు నామమాత్రం కాగా.. కొన్ని ప్రాంతాల్లో సీపీఎం తన బలాన్ని పదిలం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొత్తంగా సహకార, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన వైఎస్ఆర్సీపీ.. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వు కావడంతో నేతలు తమ సతీమణులను బరిలో నిలిపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.