సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతి విషయంలోనూ పలాయన వాదాన్ని అనుసరిస్తున్నారని, తన ప్రభుత్వ వైఫల్యాలను గత బీజేపీ సర్కారుపై నెడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సురేశ్ కుమార్ విమర్శించారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన బీజేపీ ఐటీ విభాగం సమావేశం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
విద్యుత్ సమస్య నుంచి టోల్ వివాదం వరకు...అన్నిటికీ గత బీజేపీ సర్కారే కారణమని ఆరోపించడం ద్వారా ఈ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోజూస్తున్నదని విమర్శించారు. దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో ఎలివేటెడ్ రహదారిని నిర్మించకుండా టోల్ వసూలు చేయరాదని గత బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. మైసూరు రోడ్డులో సైతం టోల్ వసూలు ప్రతిపాదన వచ్చిన ప్పుడు, ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించకుండా వసూళ్లు చేపట్టరాదని తెలియజేసిందని వెల్లడించారు.
బీజేపీ హయాంలో టోల్ ఛార్జీని నిర్ణయించలేదన్నారు. కాగా ప్రాంతీయ భాషలో ప్రాథమిక విద్యా బోధనను తప్పనిసరి చేయడం కుదరదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినందున, అన్ని రాష్ట్రాల్లో మాతృభాషకు విఘాతం ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెచ్చి ఈ విషయంలో చట్ట సవరణకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. అంతకు ముందు సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించిన ఎమ్మెల్సీ రఘునాథ్ మల్కాపుర, నరేంద్ర మోడీ పేరును పల్లె పల్లెకు తీసుకు పోవడంలో ఐటీ విభాగం కార్యకర్తలు చక్కగా పని చేశారని కొనియాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తమ ఫలితాలను సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు
సీఎం పలాయన వాదం బీజేపీ విమర్శలు
Published Sun, May 11 2014 3:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement