అమల్లోకి ‘న్యాయ నియామకాలు’!
న్యాయ నియామకాల కమిషన్‌పై కేంద్రం నోటిఫికేషన్
కమిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై రేపు ‘సుప్రీం’ విచారణ
న్యూఢిల్లీ: వివాదాస్పద ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్(నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్- ఎన్‌జేఏసీ)’ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ కేంద్రప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో మోదీ సర్కారు తీసుకువచ్చిన ఎన్‌జేఏసీని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు మరో రెండు రోజుల్లో(బుధవారం) సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రానున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇలా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
ఎన్‌జేఏసీకి సోమవారం నుంచి రాజ్యాంగబద్ధత కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్టం(99వ సవరణ చట్టం)తో పాటు ఎన్‌జేఏసీ చట్టాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1993 నుంచి అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దు అయినట్లేనని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, అదేసమయంలో కొలీజియంకు ప్రత్యామ్నాయంగా ఎన్‌జేఏసీ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి సమయం పడుతుందని పేర్కొన్నాయి. ‘మొదట, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గేలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై.. ఎన్జేఏసీలోకి ఇద్దరు ప్రముఖులను నామినేట్ చేయాల్సి ఉంటుంది.
ఆ తరువాత కమిషన్ సభ్యులంతా సమావేశమై ఎన్‌జేఏసీ నియమనిబంధనలను ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆ నియమనిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది’ అని వివరించాయి. ఎన్‌జేఏసీ రూల్స్‌కు సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధంగా ఉందని వెల్లడించాయి. జడ్జీలే జడ్జీలను నియమించే విధానమైన కొలీజియంను పలువురు న్యాయనిపుణులు, రాజకీయవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించగా.. పలువురు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తులు మాత్రం ఆ వ్యవస్థను పూర్తిగా సమర్థించారు.
కొలీజియం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌జేఏసీను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పలువురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి. అయితే, ఏప్రిల్ 7న ఆ పిటిషన్ల విచారణను రాజ్యాంగ ధర్మాసనం ముందుకు పంపిస్తూ.. ఎన్‌జేఏసీ చట్టం అమల్లోకి రాకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 2014, డిసెంబర్ 31న ఎన్‌జేఏసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2003లోనే కొలీజియంను రద్దు చేస్తూ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నాటి ఎన్డీఏ ప్రభుత్వం విఫలయత్నం చేసింది.
ఎన్‌జేఏసీలో..: ఎన్‌జేఏసీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా ఉంటారు. ఇద్దరు అత్యంత సీనియర్లైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉన్న కమిటీ ఆ ఇద్దరు ప్రముఖులను నామినేట్ చేస్తుంది. ఆ ప్రముఖుల్లో ఒకరు కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాల్లో ఏదైనా ఒక వర్గానికి చెంది ఉండాలని చట్టంలో పొందుపర్చారు. వారు మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. వారిని తిరిగి నామినేట్ చేయొచ్చు.