జూన్ 12న కర్ణాటక బంద్
బెంగళూరు: ప్రభుత్వ కర్మాగారాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రైతుల రుణాల మాఫీ తదితర ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 12న కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం కన్నడ సంఘాల సమాఖ్య నాయకులు వాటాళ్ నాగరాజ్, సా.రా.గోవింద్, కేఆర్.కుమార్, గిరీశ్గౌడ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి రుణ మాఫీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కర్మాగారాలను ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కర్మాగారాలను మూత వేయటం ద్వారా ప్రైవేట్ వారికి ఆస్తులు విక్రయించే కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. అలాగే మేకదాటు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని మైసూరు బ్యాంకు సర్కిల్ నుంచి రామనగర జిల్లా మేకదాటు వరకు ర్యాలీని చేపట్టనున్నట్లు చెప్పారు. కాసరగోడులో కన్నడ నేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా జూన్ 8న సరిహద్దు ప్రాంతంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ అన్ని డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ జూన్ 12న కర్ణాటక బంద్‌ను చేపడుతున్నామని తెలిపారు.