Junior Golf
-
102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...
న్యూఢిల్లీ: వయోభేదం లేకుండా... సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా... జాతీయ, అంతర్జాతీయస్థాయి హోదా పట్టించుకోకుండా... కరోనా మహమ్మారిని ఓడించడానికి... ఈ పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా భారత క్రీడాకారులందరూ చేయూతనిస్తున్నారు. ఇటీవల తెలంగాణకు చెందిన 15 ఏళ్ల షూటర్ ఇషాసింగ్ తాను దాచుకున్న రూ. 30 వేలను ప్రధాన మంత్రి సహాయనిధికి అందజేయగా... గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల భారత జూనియర్ గోల్ఫ్ క్రీడాకారుడు అర్జున్ భాటి వినూత్న పద్ధతిలో వితరణ మొత్తాన్ని సేకరించాడు. జూనియర్‌స్థాయిలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అర్జున్ భాటి క్రీడాకారుడిగా గత ఎనిమిదేళ్లలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 150 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాను గెల్చుకున్న 102 ట్రోఫీలను 102 వ్యక్తులకు విక్రయించాడు. ఈ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 4 లక్షల 30 వేలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు అర్జున్ అమ్మమ్మ తన ఏడాది పెన్షన్ మొత్తాన్ని (రూ. 2,06,148) పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం విశేషం. -
చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు!
లాస్ వెగాస్: సంపన్నుల క్రీడగా చెలామణి అవుతున్న గోల్ఫ్ లో అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలుడు సత్తా చాటాడు. భారత గోల్ఫ్ క్రీడాకారుడు శుభమ్ జగ్లాన్(10) క్రీడా ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు. రెండు వారాల వ్యవధిలో రెండు ప్రపంచ టైటిళ్లు గెలిచి సత్తా చాటాడు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఐజేజీఏ వరల్డ్స్ స్టార్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్ లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు కాలిఫోర్నియాలో జరిగిన వెలక్క్ రిసార్ట్ ఫౌంటెయిన్ కోర్స్ టోర్నిలోనూ విజయకేతనం ఎగురవేశాడు. హర్యానా గ్రామీణ ప్రాంతానికి చెందిన శుభమ్ జగ్లాన్ తండ్రి పాలు అమ్ముకుని జీవిస్తుంటాడు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన శుభమ్ గోల్ఫ్ క్రీడలో రెండు వారాల్లోనే అరుదైన టైటిళ్లు సాధించడం విశేషం. తన విజయాల పట్ల శుభమ్ సంతోషం వ్యక్తం చేశాడు. తనను అభినందిస్తుంటే గొప్పగా ఉందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజాయితీగా కష్టపడి ఈ విజయాలు సాధించానని, తనకు అడ్డదారులు లేవని పేర్కొన్నాడు. తన తండ్రి చాలా నిరాబండర జీవితం గడుపుతాడని వెల్లడించాడు.