juniors tourny
-
క్వార్టర్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ ఓటమి
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 14 ఏళ్ల అనాహత్ సింగ్ 7–11, 11–6, 8–11, 8–11తో ఫెరూజ్ అబూల్కెర్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అనాహత్ రెండో రౌండ్లో 11–1, 11–3, 11–4తో మేరీ వాన్ రీత్ (బెల్జియం)పై, మూడో రౌండ్లో 11–5, 11–4, 11–8తో ఎమ్మా బార్ట్లే (ఇంగ్లండ్)పై గెలిచింది. -
చిలీ పర్యటన అజేయం..
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు చిలీ పర్యటనను అజేయంగా ముగించింది. సీనియర్ చిలీ జట్టుతో సాంటియాగోలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలుపొందింది. బ్యూటీ డుంగ్‌డుంగ్ (6వ ని.లో, 26వ ని.లో) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. చిలీ తరఫున 40వ నిమిషంలో ఫ్రాన్సిస్కా టాలా ఏకైక గోల్ సాధించింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. మరోవైపు అర్జెంటీనా పర్యటనలో ఉన్న భారత సీనియర్ మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. అర్జెంటీనా ‘బి’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున సలీమా (6వ ని.లో), గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
అదిరిన భారత బాక్సర్ల పంచ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత బాక్సర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా జర్మనీలో జరిగిన బ్లాక్ ఫారెస్ట్ కప్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం ఏడు పతకాలు గెల్చుకొని టోర్నమెంట్లో ఉత్తమ జట్టు అవార్డును సొంతం చేసుకున్నారు. భారత్ నెగ్గిన ఏడు పతకాల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, లాత్వియా, హంగేరి, లిథువేనియా, మంగోలియా, గ్రీస్, పోలాండ్ దేశాలు కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ తరఫున 13 మంది బాక్సర్లు బరిలోకి దిగారు. భారత్ తరఫున తమన్నా (48 కేజీలు), అంజు (50 కేజీలు), నేహా (54 కేజీలు), అంబేషోరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. ఫైనల్లో ఓడిన తన్ను (52 కేజీలు), ఆశ్రేయ (63 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. -
సత్తా చాటిన ఆంధ్రజట్టు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న 7వ మహిళా జాతీయ జూనియర్స్ టోర్నీ రెండో మ్యాచ్‌లో విదర్భపై ఆంధ్ర హాకీ జట్టు ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విదర్భతో తలపడి 15–0 తేడాతో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. ఆంధ్ర జట్టులో అనంత క్రీడాకారిణి మహేశ్వరి 6 గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. క్రీడాకారిణులు మేరీ–5, స్పందన–2, భవాని–1, జ్యోతి–1 గోల్స్‌తో అలరించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ క్రీడాకారులను, హాకీ కోచ్ అనిల్‌కుమార్‌ను అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఆదివారం ఆంధ్ర జట్టు పాండిచ్చేరితో తలపడనుందని కోచ్ అనిల్‌కుమార్ తెలిపారు.