పాత్రికేయులు పోరాటయోధుల్లా ఉండాలి
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్
ప్రభుత్వంతో పాత్రికేయులకు సంఘర్షణ ఉండాల్సిందే
విశ్వసనీయత కోల్పోతే విలువ ఉండదని వ్యాఖ్య
‘సమకాలీన జర్నలిజంలో నైతిక విలువలు’ అంశంపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులు సత్యం కోసం పోరాటం చేసే యోధులుగా ఉండాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ప్రసాద్ అన్నారు. ‘సమకాలీన జర్న లిజంలో నైతిక విలువలు’ అంశంపై గురు వారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జాతీ య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాత్రికేయులకు సంఘర్షణ వాతావరణం ఉండాల్సిందేనని, అలాంటి వైఖరి లోపించిన రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత విచారక రమైన రోజవుతుందని పేర్కొన్నారు. రామ రాజ్యం ఎలా ఉండా లనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతూ వచ్చిందని చెప్పారు. రామరాజ్యం ఏర్పడేంతవరకు ప్రభుత్వానికి, మీడియాకు మధ్య ఘర్షణ వైఖరి తప్పదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వారితో జర్నలిస్టుల స్నేహపూర్వక సంబంధాలను వ్యక్తి గతంగా తాను వ్యతిరేకిస్తానన్నారు. పాత్రికేయులు సమాజానికి చేస్తున్న సేవను చూసి దేశం గర్వపడుతోందని వ్యాఖ్యానించారు.
ప్రశ్నించడం పాత్రికేయుని విశిష్ట లక్షణం
ఎంతటి సంపన్నులనైనా, శక్తిమంతులనైనా ప్రశ్నించగలగడమనేది జర్నలిస్టులకు ఉండే ప్రత్యేక లక్షణమని, ఈ విశిష్టతను యువ జర్నలిస్టులు మరింతగా సొంతం చేసుకో వాలని జస్టిస్ ప్రసాద్ సూచించారు. ఎవరినైనా సరే ప్రశ్నించగలిగే జర్నలిస్టు ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు. రాజకీయ నాయకులు ఇచ్చిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవడంపై పలు ఫిర్యాదులు ప్రెస్ కౌన్సిల్‌కు అందు తున్నాయని చెప్పారు. ‘హరియాణాలో దళితుల హత్యలను వీధి కుక్కలను రాళ్లతో కొట్టి చంపడం వంటిదని ఓ కేంద్ర మంత్రి చెప్పి నట్లుగా మీడియాలో రావడంతో దేశంలో పెద్ద అలజడి రేగింది. దీనిపై పరిశీలన జరిపితే.. మంత్రి ప్రకటనను మీడియా తప్పుగా అన్వ యించుకున్నట్లు తేలింది’ అని పేర్కొన్నారు.
కోడ్ ఆఫ్ కాండక్ట్ అవసరమే..
జర్నలిస్టులకు కూడా ప్రవర్తన నియమావళి అవసరమని జస్టిస్ ప్రసాద్ అన్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేయడానికి, ప్రజలను బెదిరించి సంపాదించుకోవడానికి కొందరు జర్నలిస్టులు తమ వృత్తిని కవచంగా వాడుకుంటున్నారని ఈ ప్రాంతం నుంచే కొన్ని ఫిర్యాదులు అందాయని చెప్పారు. విశ్వసనీయతను కోల్పోయిన పాత్రికేయు డికి విలువ ఉండదని చెప్పారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సులో ఐజేయూ అధ్యక్షుడు సిన్హా, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్ దూబే, అమర్నాథ్, ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ తదితరులు ప్రసంగించారు. జస్టిస్ ప్రసాద్‌ను టీయూడబ్ల్యూజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.