Justice HL Dattu
-
సీజేగా జస్టిస్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం
భారత సుప్రీంకోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హెచ్.ఎల్. దత్తు డిసెంబర్ 2వ తేదీన పదవీ విరమణ చేశారు. కొత్త సీజేగా వచ్చిన జస్టిస్ ఠాకూర్ 2017 జనవరి 3వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే, ఆయనకు 13 నెలల పదవీ కాలం మిగిలి ఉంటుంది. -
హైకోర్టు జడ్జిలు భయంతో పనిచేస్తున్నారు: సీజేఐ
మద్రాసు హైకోర్టులో పరిస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు తీవ్రంగా వ్యాఖ్యానించారు. అక్కడ కొందరు న్యాయవాదులు చట్టానికి అతీతంగా పనిచేయడంతో జడ్జిలు భయంతో పనిచేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కోర్టు ప్రాంగణంలో కొందరు న్యాయవాదులు ప్రదర్శనగా వచ్చి నినాదాలు చేసిన పరిస్థితిపై సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోర్టుకు వివరించారు. మరికొందరు న్యాయవాదులు తమ కుటుంబ సభ్యులను కోర్టులోకి తీసుకొచ్చి, ఇబ్బంది పెడుతున్నారని, అలాగే జడ్జిలను తిడుతూ పనికిమాలిన ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. ఈ మొత్తం పరిస్థితిపై తాను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో సుదీర్ఘంగా చర్చించానని, అయితే దీనిపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని, అందువల్ల ఏవైనా చర్యలు తీసుకునే ముందు కాస్త వేచి చూద్దామని జస్టిస్ దత్తు అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్‌తో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ దత్తు ఈ మొత్తం పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి మరీ చెయ్యిదాటిపోతోందని, న్యాయమూర్తులను రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని వేణుగోపాల్ చెప్పారు. తమిళాన్ని కోర్టులో అధికారిక భాషగా చేయాలంటూ న్యాయవాదులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుందని జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రశ్నించారు. మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులు ప్రతి రోజూ గడ్డు పరిస్థితే ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తాము యువ న్యాయవాదులుగా ఉన్నప్పుడు తమ సీనియర్లు వెళ్లి తమిళ లాయర్లు చేసే వాదనలను వినాల్సిందిగా చెప్పేవారని, అప్పట్లో వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నామని, మద్రాసు హైకోర్టులో ఉన్నత విలువలు పాటించేవారని.. ఇప్పుడు కొత్తగా వచ్చే లాయర్లకు మద్రాసు హైకోర్టుకు వెళ్లి నేర్చుకొమ్మని చెప్పగలమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారత న్యాయ చరిత్రలోనే ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు. -
ఏ ప్రాతిపదికన తొలగించారు?
సాక్షి, న్యూఢిల్లీ: కళింగ కులాన్ని బీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ‘మధ్యంతర స్టే’ ఇచ్చింది. కళింగ కులాన్ని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో తాము మెడిసిన్‌లో ప్రవేశాలు కోల్పోయామని, తమకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ఇద్దరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పిటిషనర్‌కు రిజర్వేషన్ పొందే హక్కు, అర్హత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి కళింగ తదితర కులాలను తొలగించడంతో విద్యార్థులు మెడిసిన్‌లో ప్రవేశం పొందలేకపోయారు’ అని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కులాల తొలగింపు రాజ్యాంగబద్ధంగానే జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు స్పందిస్తూ రాష్ట్ర విభజనకు ముందు కళింగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్ వర్తించిందని, అయితే ఇప్పుడు తెలంగాణలో ఆ కులానికి చెందిన వారు లేరని రోహత్గీ తెలిపారు. ‘లేరని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఏదైనా కమిషన్ వేశారా? విభజనకు ముందున్నప్పుడు.. ఇప్పుడు కూడా ఉండాలి కదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. పిటిషనర్ అభ్యర్థన లోని ‘సి’ భాగంపై కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పు(తీర్పు అమలు కాలానికి సంబంధించి)పై ‘మధ్యంతర స్టే’ విధిస్తున్నామని, ఇది పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.