హైకోర్టు జడ్జిలు భయంతో పనిచేస్తున్నారు: సీజేఐ
మద్రాసు హైకోర్టులో పరిస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు తీవ్రంగా వ్యాఖ్యానించారు. అక్కడ కొందరు న్యాయవాదులు చట్టానికి అతీతంగా పనిచేయడంతో జడ్జిలు భయంతో పనిచేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కోర్టు ప్రాంగణంలో కొందరు న్యాయవాదులు ప్రదర్శనగా వచ్చి నినాదాలు చేసిన పరిస్థితిపై సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోర్టుకు వివరించారు. మరికొందరు న్యాయవాదులు తమ కుటుంబ సభ్యులను కోర్టులోకి తీసుకొచ్చి, ఇబ్బంది పెడుతున్నారని, అలాగే జడ్జిలను తిడుతూ పనికిమాలిన ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు.
ఈ మొత్తం పరిస్థితిపై తాను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్తో సుదీర్ఘంగా చర్చించానని, అయితే దీనిపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటివల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని, అందువల్ల ఏవైనా చర్యలు తీసుకునే ముందు కాస్త వేచి చూద్దామని జస్టిస్ దత్తు అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్తో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ దత్తు ఈ మొత్తం పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి మరీ చెయ్యిదాటిపోతోందని, న్యాయమూర్తులను రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని వేణుగోపాల్ చెప్పారు.
తమిళాన్ని కోర్టులో అధికారిక భాషగా చేయాలంటూ న్యాయవాదులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుందని జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రశ్నించారు. మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తులు ప్రతి రోజూ గడ్డు పరిస్థితే ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తాము యువ న్యాయవాదులుగా ఉన్నప్పుడు తమ సీనియర్లు వెళ్లి తమిళ లాయర్లు చేసే వాదనలను వినాల్సిందిగా చెప్పేవారని, అప్పట్లో వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నామని, మద్రాసు హైకోర్టులో ఉన్నత విలువలు పాటించేవారని.. ఇప్పుడు కొత్తగా వచ్చే లాయర్లకు మద్రాసు హైకోర్టుకు వెళ్లి నేర్చుకొమ్మని చెప్పగలమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారత న్యాయ చరిత్రలోనే ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని వ్యాఖ్యానించారు.