బీసీసీఐ సీఈఓగా రాహుల్ జోహ్రి
ముంబై: బీసీసీఐ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా మీడియా ప్రొఫెషనల్ రాహుల్ జోహ్రి నియమితులయ్యారు. బోర్డులో జవాబుదారితనం పెరగాలంటే నాన్ క్రికెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ వ్యక్తి ఉండాలని జస్టిస్ లోథా కమిటీ చేసిన ప్రతిపాదనల్లో భాగంగా బీసీసీఐ ఈ నియామకం చేపట్టింది. మీడియా పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం ఉన్న జోహ్రి... డిస్కవరి నెట్‌వర్క్స్‌లో 15 ఏళ్లుగా వివిధ హోదాలలో పని చేశారు. ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించడంతో పాటు గత ఎనిమిదేళ్లుగా దక్షిణాసియా విభాగానికి జనరల్ మేనేజర్‌గా పని చేశారు.
జూన్ 1న కొత్త బాధ్యతలు స్వీకరించే జోహ్రి... తన నివేదికలను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు అందజేస్తారని బీసీసీఐ వెల్లడించింది. సీఈఓగా తీసుకునే వ్యక్తితో ఐదేళ్ల పాటు ఒప్పందం ఉండాలని లోథా కమిటీ సూచించినా... బోర్డు మాత్రం జోహ్రి పదవీకాలం ఎంతనేది చెప్పలేదు. గతంలో బీసీసీఐ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏఓ)గా, క్రికెట్ అభివృద్ధి జనరల్ మేనేజర్‌గా వ్యవహరించిన రత్నాకర్ శెట్టి.. ప్రస్తుతం ఐపీఎల్ సీఈఓగా పని చేస్తున్నారు.