ఢిల్లీ నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వీ రమణ ప్రమాణ స్వీకారం!
ఢిల్లీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన డి మురుగేశన్ జూన్ లో పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను నియమించారు. గత జూన్ నుంచి జస్టిస్ బదార్ దుర్రేజ్ ఆహ్మద్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు.
రాజ్ నివాస్ లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తోపాటు మంత్రివర్గ సభ్యులు, సీనియర్ న్యాయమూర్తులు, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఇతర ఆధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ రమణ 2000 సంవత్సరంలో జూన్ 27న నియమితులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఫిబ్రవరి 1983 సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు చేసుకున్న రమణ కేంద్ర, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, సుప్రీం కోర్టులో పలు హోదాల్లో సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో 1957 సంవత్సరంలో ఆగస్టు 27న జన్మించారు.