అవసరం అయితే చంద్రబాబును విచారిస్తాం
రాజమండ్రి: అవసరమని భావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా విచారిస్తామని గోదావరి పుష్కర తొక్కిసలాట ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్ స్పష్టం చేసింది. పుష్కర తొక్కిసలాటపై నిన్న రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో కమిషన్ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
ఈ దుర్ఘటనలో 30మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పుష్కరాలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ, ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్లో కాకుండా పుష్కర ఘాట్లో పుణ్య స్నానం ఆచరించడం, భక్తులను రెండున్నర గంటల పాటు ఆపేయడం... ఇవన్నీ తొక్కిసలాటకు కారణమనే విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.