అపహాస్యం చేసిన వారే ప్రశంసిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక వ్యాసం రాసింది. 331 మంది నిరక్షరాస్యులైన ఎంపీలు ఈ దేశాన్ని ఎలా పరిపాలిస్తారంటూ హేళన చేసింది. అదే పత్రిక ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని ప్రశంసిస్తోంది. ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందంటూ కితాబునిస్తోంది. అదే మన ప్రజాస్వామ్యం గొప్పదనం’’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య పేర్కొన్నారు. ట్రూత్ల్యాబ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మన దేశంలో పరిశోధనలు జరగాలని, ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ట్రూత్ల్యాబ్ సేవలు ఎనలేనివని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగానేకాక ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో క్లిష్టమైన కేసులు ట్రూత్ల్యాబ్ పరిశీలన కోసం వస్తున్నాయని, ఖచ్చితమైన రిపోర్టులు ఇస్తారనే నమ్మకానికి ఇదే నిదర్శనమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావు ప్రశంసించారు. అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ రంగం పురోభివృద్ధికి ప్రభుత్వాలు స్వల్పంగా నిధులు కేటాయించడం శోచనీయమని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ పల్లె రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
2జీ, బొగ్గుకుంభకోణం, వ్యాపం సహా ఎన్నో కేసుల్లో ప్రాథమిక దర్యాప్తు సమయంలో ట్రూత్ల్యాబ్ సహకరించిందని సంస్థ చైర్మన్ పీసీ గాంధీ తెలిపారు. ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తమ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ నూతి రామ్మోహన్రావు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు, సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.