K. Haribabu
-
పోలవరం పనులపై బీజేపీ నేతల అసంతృప్తి
రాజమండ్రి : పట్టిసీమ ప్రాజెక్టును ఎంత వేగంగా పూర్తి చేస్తున్నారో.... అంతే వేగంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు సూచించారు. శనివారం పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలసి పరిశీలించారు. అయితే పోలవరం పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టర్ వల్లే పనుల్లో జాప్యం జరుగుతుందని హరిబాబు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌ను డిమాండ్ చేశారు. హరిబాబుతోపాటు బీజేపీ మంత్రులు పి మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పొలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. -
మమ్మల్ని ఆదరిస్తే అభివృద్ధి: హరిబాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజలు ఎన్నుకున్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలెవ్వరూ నోరెత్తకున్నా వారి సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి న్యాయం జరిగే వరకు పోరాడింది తమ పార్టీయేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కె.హరిబాబు చెప్పారు. సీమాంధ్ర నుంచి తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ లేకున్నా ప్రధాని సహా ప్రతి మంత్రినీ నిలదీసి ప్రత్యేక ప్యాకేజీని సాధించామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన హరిబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు లభించిన ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలుకావాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడాలన్నారు. సీమాంధ్రలో బీజేపీని ఎన్నుకుంటేనే మోడీని తమకేమి చేస్తారని అడగడానికి వీలుంటుందన్నారు. సీమాంధ్రలో ఎన్నికల కసరత్తు ప్రారంభించామని, అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పొత్తులపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. ప్రస్తుతం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లు ఎలా గెలవాలన్నదే లక్ష్యమన్నారు. పొత్తున్నా లేకున్నా ఒంటిరిగానే ముందుకు వెళ్తామని వివరించారు. నరేంద్రమోడీ సభలు పెట్టి బీజేపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు ఏమి చేస్తారో చెప్పిస్తామన్నారు. పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ నేడు.. బీజేపీ తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. -
జీవోఎంకు సీమాంధ్ర బీజేపీ నివేదిక
విజయవాడలో పార్టీ నేతల కసరత్తు సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ ఆ ప్రాంత ఉద్యమ కమిటీ ఈసారి మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర నాయకత్వానికి, విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి తమ నివేదికను అందజేయాలని నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేత, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత డాక్టర్ కె. హరిబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీనియర్ నాయకులు ప్రొఫెసర్ శేషగిరిరావు, శాంతారెడ్డి, సోము వీర్రాజు, సురేష్‌రెడ్డి, యడ్లపాటి రఘునాథ్‌బాబు, జె. రంగరాజు తదితరులు పాల్గొన్న ఈ సమావేశానికి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని ఆహ్వానించలేదు. జీవోఎంకు సమర్పించాల్సిన నివేదిక ముసాయిదా తయారీపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో తలెత్తే పది కీలక అంశాలను జిల్లాల వారీగా చర్చించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి నివేదికను పార్టీ కేంద్ర నాయకత్వానికి అందజేస్తామని, వారు సూచించే సవరణలు చేసి జీవోఎంకు నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు. అలాగే.. బీజేపీ తెలంగాణ నేతలు వేరుగా జీవోఎంకు మరో నివేదికను అందజేయనున్నట్లు తెలిసింది. సీమాంధ్ర బీజేపీ నివేదించే అంశాలివీ... - 1953 నాటి రాష్ట్ర విభజన మాదిరి కాకుండా అత్యధికంగా నష్టపోయే రాయలసీమకుప్రత్యేక ప్యాకేజీతో పాటు చట్టబద్ధమైన హక్కులు ఉండేలా చూడాలి. - పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 200 టీఎంసీల గోదావరి జలాలు - సరఫరా చేసేందుకు చట్టబద్ధత కల్పించాలి. బ్రాహ్మణి స్టీల్ ప్రాజెక్టు చిక్కుల్లో పడి -నందున దాన్ని జాతీయం చేసి రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీగా పేరు మార్చి 20 వేల మందికి ఉపాధి దక్కేలా చూడాలి. విశాఖ, గుంతకల్‌లో రైల్వే జోన్లు, నందలూరు -కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి, కృష్ణా జలాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. భద్రా చలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపి పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలోపు పూర్తిచేయాలి. పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.