
మమ్మల్ని ఆదరిస్తే అభివృద్ధి: హరిబాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజలు ఎన్నుకున్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలెవ్వరూ నోరెత్తకున్నా వారి సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి న్యాయం జరిగే వరకు పోరాడింది తమ పార్టీయేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కె.హరిబాబు చెప్పారు. సీమాంధ్ర నుంచి తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ లేకున్నా ప్రధాని సహా ప్రతి మంత్రినీ నిలదీసి ప్రత్యేక ప్యాకేజీని సాధించామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన హరిబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్రకు లభించిన ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలుకావాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడాలన్నారు. సీమాంధ్రలో బీజేపీని ఎన్నుకుంటేనే మోడీని తమకేమి చేస్తారని అడగడానికి వీలుంటుందన్నారు. సీమాంధ్రలో ఎన్నికల కసరత్తు ప్రారంభించామని, అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పొత్తులపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. ప్రస్తుతం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లు ఎలా గెలవాలన్నదే లక్ష్యమన్నారు. పొత్తున్నా లేకున్నా ఒంటిరిగానే ముందుకు వెళ్తామని వివరించారు. నరేంద్రమోడీ సభలు పెట్టి బీజేపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు ఏమి చేస్తారో చెప్పిస్తామన్నారు.
పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ నేడు..
బీజేపీ తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.