► గుంటూరు జనభేరిలో మోడీ, వెంకయ్య, పవన్‌లపై షర్మిల ధ్వజం
►జగన్ ఒక్కడిని ఎదుర్కోలేక చంద్రబాబు వీళ్లను తెచ్చాడు
►జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే
►విభజన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముంది
►మోడీ మాటలు నమ్మడానికి సీమాంధ్ర ప్రజలు పిచ్చివాళ్లు కాదు
సాక్షి, గుంటూరు: ‘‘టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అందరితో కలసి మహాకూటమిగా ఏర్పాటు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి వెళ్లిపోయినా.. ఆయన కొడుకును కూడా ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఈ చంద్రబాబుకు లేదు. అందుకనే బీజేపీకి చెందిన నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్‌లను మూకుమ్మడిగా తీసుకొచ్చాడు. అయినా ఫరవాలేదు. జోగీజోగీ రాసుకుంటే బూడిదే రాలుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శిం చారు. తిరుపతి సభలో ఈ ముగ్గురూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ వారిని కడిగిపారేశారు. తెలుగు ప్రజలను విడగొట్టిన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముందన్నారు. కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే.. ‘కొబ్బరికాయ ముక్కల్లా విభజించండి’ అని చంద్రబాబు మద్దతు పలికారని, చట్టసభల్లో విభజనకు బీజేపీ బేషరతుగా మద్దతిచ్చిందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు, తాడికొండ, పెదకాకానిలో గురువారం జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
మూడురాష్ట్రాల్లో ఏం చేశారు..?
‘‘చంద్రబాబు మూకుమ్మడిగా తెచ్చిన మోడీ, వెంకయ్య, పవన్ కల్యాణ్.. ఈ జోగులంతా తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టారు. అందరిదీ ఒక్కటే టార్గెట్ జగన్. అందరూ మనస్ఫూర్తిగా జగన్‌ను ఆడిపోసుకున్న తరువాత, ‘సీమాంధ్రను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము.. హైదరాబాద్ లాంటి రాజధానిని మళ్లీ సీమాంధ్రలో కడతాము.. అదిగదిగో చందమామ..’అని మోడీ సీమాంధ్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బీజేపీ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడూ ఇదే వాగ్దానాలు చేసింది. కనీసం ఒక్కో రాష్ట్రానికి రూ. 500 కోట్లయినా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, కనీసం చెప్పుకోదగ్గ మంచి ఆస్పత్రి కూడా లేదు. అలాంటిది మోడీ నిన్న వచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కడతామంటే నమ్మడానికి తెలుగు ప్రజలు అమాయకులనుకుంటున్నారా.. లేక పిచ్చివాళ్లనుకుంటున్నారా..? ఇంకొకరు వెంకయ్యనాయుడు ఈయన సొంత నియోజకవర్గంలో, సొంత వార్డుల్లో ఒక్క వార్డు మెంబరును కూడా గెలిపించుకోలేరు.
పవన్ సేవ చేస్తారట..
ఇంకొకరు ఆయన పక్కనే నిల్చున్నారు, పవన్ కల్యాణ్ అట. ఈ పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం అనే ఓ పార్టీ పెట్టారు. అన్నా తమ్ముడు ఇద్దరూ కలిసి రూ. 70 కోట్లకు ఆ పార్టీని అమ్మేసుకుని మంచం కింద ఆ డబ్బు దాచి పెట్టుకుని కేసులు జరగకుండా మేనేజ్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లు అదే మంచంమీద ఇద్దరూ తొంగున్నారు. ప్రజారాజ్యం పెట్టేటప్పుడు పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ప్రచారం చేశారు, హామీలు కూడా ఇచ్చారు. ప్రజారాజ్యంలో యువసేన అనే దానికి అధ్యక్షునిగా ఉన్నారు.
మరి ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీకే పార్టీని అమ్మేసుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఒక్క సమాధానమైనా చెప్పారా ఈ పవన్ కల్యాణ్. ఈయన సేవ చేస్తారట.. సేవ అనే పేరుతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ పెట్టి.. కోట్ల కొద్దీ విరాళాలు కూడా సేకరించారు. ఆ సంస్థ ఏమైందో, ఆ విరాళాలను ఏం చేశారో ఎప్పుడైనా చెప్పారా? ఎంత మంది ప్రజలకు సేవ చేశారో ఎప్పుడైనా చెప్పారా? అంత హడావుడిగా కోట్ల రూపాయలు సేకరించి స్థాపించిన సంస్థ కదా.. కనీసం ఇప్పుడది బతికి ఉందా, చచ్చిందా.. అదైనా చెప్పారా పవన్ కల్యాణ్ . చెప్పలేదు. ఈ ఐదేళ్ళల్లో ఎవరికీ ఏ సమాధానం చెప్పలేదు. మొన్న ఆడిటోరియంలో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో ప్రజల కోసం ప్రశ్నించడానికే ముందుకు వచ్చానని చెప్పుకున్నాడు ఈ పవన్ కల్యాణ్.
చంద్రబాబుకు అధికారమిస్తే గొయ్యి తవ్వుకున్నట్టే..
వీళ్లందరినీ తెచ్చింది చంద్రబాబు. బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఫలానా గొప్ప పథకాన్ని చేశాను, నేను ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ ఆ పథకాన్ని చేస్తానని చెప్పుకునే ధైర్యం ఈ రోజు చంద్రబాబుకు లేదు. పదేళ్లు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఈ పదేళ్లలో నేను ప్రజలకు వచ్చిన ప్రధాన సమస్యలో ఫలానా పోరాటం చేశాను.. ప్రభుత్వం మెడలు వంచి ఫలానాది సాధించాను.. ఓట్లు వేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంత అసమర్థుడు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కదా అని, అన్ని దొంగ వాగ్దానాలు చేస్తూ తిరుగుతున్నాడు.. ఒక సామెత ఉంది.. పేనుకు పెత్తనం ఇస్తే మొత్తం గొరిగేసినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మొత్తం దోచేస్తాడు. చంద్రబాబు మాటల్లో నిజంలేదు. చంద్రబాబు వాగ్దానాల్లో నిజం లేదు. చంద్రబాబు గుండెల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే.
ఆ ముగ్గురూ జోగులే !: షర్మిల
Published Fri, May 2 2014 2:34 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement