సీఎల్పీ రేసులో భట్టి!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా జిల్లాకు చెందిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. తెలంగాణ నూతన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించే అవకాశం జిల్లాకు దక్కుతుందనే ప్రచారం టీపీసీసీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే, ఈ పదవికి ఎంపిక చేసే నేతకు సంబంధించి అనేక అంశాలను ఏఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుందని, అందులో భాగంగా కొన్ని అంశాలు భట్టికి సానుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చీఫ్‌విప్, డిప్యూటీస్పీకర్ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన భట్టిని సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అయితే, సీనియార్టీ ప్రాతిపదికన నల్లగొండ జిల్లాకు చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కె.జానారెడ్డి పేరు కూడా వినబడుతోంది. వీరిద్దరిలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.
యువనాయకత్వంతో పాటు సామాజిక కోణం
సీఎల్పీ నేతగా భట్టి పేరు పరిగణనలోకి తీసుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం అనుకూలించే అంశంగా ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను పార్టీ శాసనసభాపక్ష నాయకునిగా చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుందన్నది కాంగ్రెస్‌లోని కొందరు పెద్దల ఆలోచన. దీనికి తోడు టీఆర్ఎస్ ముందునుంచీ దళితుడిని తెలంగాణ తొలిముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చివరకు కేసీఆర్‌ను ఎంపిక చేసిందని, అదే సమయంలో కాంగ్రెస్ పక్షాన దళితుడిని సీఎల్పీ నాయకుడిగా చేస్తే సామాజిక కోణంలో కలిసివస్తుందనే వాదన వినపడుతోంది. దీనికి తోడు అటు అసెంబ్లీ లోపల, బయట భట్టికి మంచి సంబంధాలున్నాయి. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తొలిసారే ప్రభుత్వ చీఫ్‌విప్ పదవిని నిర్వహించారు. ఈ క్రమంలో శాసనసభ్యులందరినీ సమన్వయపరచడంలో సఫలీకృతులయ్యారు. అంతేగాక కీలక సమయంలో అసెంబ్లీ డెప్యూటీస్పీకర్ పదవిని కూడా చేపట్టారు.
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా స్పీకర్ స్థానంలో ఆయన కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూడా భట్టి పూర్తి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దీనికి తోడు యువనాయకుడిగా పార్టీలో ఇప్పటికే మంచి గుర్తింపు పొందారు. ఈకోణంలో ఐదేళ్ల పాటు టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో భట్టి పేరును అధినాయకత్వం సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.