ఉస్మానియా పరిశోధనా దీపం
ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్‌లో కె. రామచంద్రాచార్య (కె. ఆర్. ఆచార్య) జూలై 14, 1934న జన్మించారు. వెనుకబడిన అటవీ ప్రాంతం నుండి చదువు కోసం వరంగల్‌కు వచ్చారు. డిగ్రీ పూర్తి చేయాలనే పట్టుదలతో హైదరాబాద్‌లో గుమస్తా ఉద్యోగంలో చేరారు. కానీ అది తృప్తినివ్వకపోవడంతో దీర్ఘకాలిక సెలవుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. రాజనీతి శాస్త్రంలో చేరి ‘స్వామి రామలింగ తీర్థ బంగారు పథకాన్ని‘ చేజిక్కించుకున్నారు. తర్వాత ఓయూలో రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా చేరి మూడు దశాబ్దాల పై చిలుకు, అధ్యాపక, పరిశోధన రంగాలలో తనదైన ముద్ర వేశారు. 1994లో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ ఆచార్య 5 ఏప్రిల్ 2016న కన్నుమూశారు.
1970లలో రాజనీతిశాస్త్ర విభాగంలో ‘అనుభవపూర్వక పరిశోధన‘కు ఆద్యుడైన ప్రొ॥రషీదుద్దీన్ ఖాన్ శిష్యరికంలో పీ.హెచ్.డీ. పట్టాను ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలో రెండు పరస్పర సిద్ధాంతా లైన లెఫ్ట్, రైట్ను సమాంతర దూరంతో చూసేవారు. 1970-80లలో గ్రామీణ ప్రాంతం నుంచి మొదటి తరం తెలుగు మీడియం విద్యార్థులు రావడం మొదలైంది. కె.ఆర్ ఆచార్య, ప్రొ॥సుభాష్ చంద్రారెడ్డి వారిలో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించి ఎంతగానో ప్రోత్స హించిన ఫలితంగానే చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, పట్టణ ప్రాంత విద్యా ర్థులతో పోటీ పడగలిగారు.
భారతదేశంలో ప్రవర్తనవాద దృక్పథం ఆధారంగా ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుందో ముందే చెప్పగల పరిశోధనా పద్ధతులను ఉపయోగించి చెప్పడంలో ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అందులో కె.ఆర్. ఆచార్య భాగస్వాములు కావడమే కాకుండా విద్యార్థులను తీర్చిదిద్ద డంలో, శిక్షణ ఇవ్వడంలో తనదైన శైలి, ముద్ర చూపారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో 1971 ఒక మైలురాయి.
1971 ముందు, ఆ తర్వాత రాజకీయాలకు గుణాత్మక తేడా వుంది. నెహ్రూ, శాస్త్రిల మరణం, ప్రధానిగా ఇందిరాగాంధీ, హరిత విప్లవం, కా్రంగెస్ చీలిక, బ్యాంకుల జాతీయీకరణ, నక్సలైట్ ఉద్యమం వంటి వాటితో భారత రాజకీయాల్లో మార్పు కనబడుతుంది. అలాంటి క్లిష్ట సమయాలలో జరిగిన ఎన్నికల విశ్లేషణకు కె.ఆర్. ఆచార్య నేతృత్వం వహించారు. పొలిటికల్ సైన్స్ విభాగంలో విధానాల అధ్యయనం కోసం ఒక సెంటర్‌ను (సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్) నెలకొల్పగా, దీనికి ఆచార్య డెరైక్టర్‌గా వ్యవహ రించి ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించారు. ఎన్నికల అధ్యయనంలో భాగంగా తను రాసిన ’క్రిటికల్ ఎలెక్షన్స్’ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.
నా జీవితంలో మరిచిపోని సంఘటన, అదే నా జీవితాన్ని మార్చిన సంఘటన కూడా. 1987లో ఆయన విభాగాధిపతిగా బాధ్యతలు తీసుకున్న రోజే నేను కలవడానికి వెళితే, నా ఎం.ఫిల్ అంశాన్ని ఫైనలైజ్ చేసి ‘రేపు ఫీల్డ్కి వెళ్లి డేటా కలెక్ట్ చేసుకొని రా’ అన్నారు. నేను.. ఎండలు బాగా ఉన్నాయి సార్, నెల రోజుల తర్వాత పోతానంటే, ‘ఇక్కడినుండి ఫో, నిన్ను భగవంతుడు కూడా బాగు చేయలేడు‘ అని గద్దించారు. వెంటనే ‘లేదు సార్, రేపే వెళ్తాను’ అని చెప్పి వెళ్ళాను. దీనివల్ల జరిగింది ఏంటంటే ఎం.ఫిల్ నిర్ణీత కాలంలో పూర్తి చేయడం, యూనివర్సిటీలో లెక్చరర్ పోస్టులు పడడం, నాకు అర్హత వచ్చింది. ఒకవేళ రీసెర్చ్‌ను వాయిదా వేసుకుంటే నేనీరోజు వర్సిటీలో ఉండేవాడిని కాదు.
ప్రొ॥కె.ఆర్.ఆచార్య తెలుగు మీడియం విద్యార్థులకు ఎనలేని సేవచేశారు. తెలుగు అకాడమీ నేతృత్వంలో రాజనీతి శాస్త్రంలో వచ్చిన ‘పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం’, ‘భారత ప్రభుత్వం-రాజకీయాలు’, ‘రాజనీతి సిద్ధాంతం-సంస్థలు’ పుస్తకాలకు రచయి తగా, ఎడిటర్‌గా బాధ్యత తీసుకున్నారు. సులువైన భాషలో, లోతైన విషయ పరిజ్ఞానం కల్గిన పుస్తకాల వల్ల లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. నేటికి ఆ పుస్తకాలను కొన్ని మార్పులతో పునర్ముద్రిస్తుండటం విశేషం.
1980లలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంప నలు మొదలైనాయి. వాటిపైన విశ్లేషణాత్మక వ్యాసా లను ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, సియాసత్ ఉర్దూ పత్రికలకు రాసేవారు. భారత రాజకీయాలపై తను రాసిన దాదాపు ఐదువేల వ్యాసాలు వివిధ పత్రిక లలో అచ్చయ్యాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్ర ప్రదేశ్ టైమ్స్ పత్రికలలో రాసిన వ్యాసాల సమాహా రంగా ‘సమకాలీన రాజకీయాలు’ అనే పుస్తకాన్ని సంకలన వ్యాసాల రూపంలో ఆచార్య తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నాటి ప్రధాని పి.వి. న రసింహారావు చేతుల మీదుగా 1991, నవంబర్ 23న విడుదల చేశారు. ఎందరో విద్యార్థులను తన పరిశోధనా నైపుణ్యంతో తీర్చిదిద్ది స్ఫూర్తినిచ్చిన మా గురువు కె.ఆర్. ఆచార్యకు విద్యార్థుల, పరిశోధకుల పక్షాన ఇదే నా నివాళి.
(నేడు ప్రొఫెసర్ కె. రామచంద్రాచార్య వైకుంఠ సమారాధన సందర్భంగా)
ప్రొ డి. రవీందర్, వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ విభాగం
మొబైల్: 9866047889