K Siddaramaiah
-
బాహుబలి 2 చూశాక సీఎం సంచలన నిర్ణయం
భారీమొత్తంలో డబ్బులు వెచ్చించి మరీ బాహుబలి 2 సినిమాను చూసి వచ్చిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని మల్టిప్లెక్సెస్, సినిమా హాలులో ఒక్కో వ్యక్తి నుంచి తీసుకునే టిక్కెట్ గరిష్ట ధరలు 200 రూపాయలకు మించకూడదని మంగళవారం నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన వెలువరిచింది. అన్ని భాషల్లోని సినిమాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిబంధనలు మల్టిప్లెక్సెస్ ల్లో గోల్డ్ క్లాస్ స్క్రీన్, గోల్డ్ క్లాస్ సీట్లకు వర్తించవని తెలిసింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్ మూవీ హాల్స్ ను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ నిర్ణయం వెలువరచడానికి ఒక్క రోజు ముందే సిద్ధరామయ్య వేల రూపాయలకు పైగా వెచ్చించి తన కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి-2 సినిమా చూశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది. మార్చి 15న తన బడ్జెట్ స్పీచ్ లో సిద్ధరామయ్య సినిమా టిక్కెట్ రేట్ల నియంత్రణపై నిర్ణయాన్ని ప్రకటించారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ మూవీలను ఆదుకోవడానికి అడ్మిషన్ ఫీజులను నిర్ణయించడం అవసరమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. నాన్-కన్నడ మూవీలకు ప్రజలు ఎక్కువగా వెచ్చిస్తున్నారని, భారీ మొత్తంలో వసూలు చేస్తున్న టిక్కెట్ ధరలతో వారు త్వరగా తమ పెట్టుబడులను రికవరీ చేసుకుంటున్నారని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సా.రా గోవింద్ తెలిపారు. భారీగా వచ్చే ఒక్క మూవీతో 40 కన్నడ మూవీలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. -
జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా?
బెంగళూరు: ఇలాంటి విపత్తు ఒకటి వచ్చి మీద పడుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందరూ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులకు ఇప్పుడు కర్ణాటకలో తమ భవిష్యత్తేమిటో తెలియడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజా నిర్ణయం కనుక అమలైతే ఆ రాష్ట్రవ్యాప్తంగా టీవీల్లో ప్రసారమవుతున్న లైవ్ ఆస్ట్రాలజీ కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం కనిపిస్తున్నది. కొద్దిరోజుల కిందట ఓ కార్యక్రమంలో మాట్లాడిన సిద్దరామయ్య టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే లైవ్ జ్యోతిష్య కార్యక్రమాలపై నిషేధం విధించాలని అభిప్రాయపడ్డారు. 'కర్ణాటకలో ప్రతి టీవీ చానెల్ కూడా జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారం చేయాలని భావిస్తున్నది. ఈ కార్యక్రమాలకు బాగా ప్రేక్షకాదరణ ఉన్నట్టు కనిపిస్తున్నది. మా ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలపై నిషేధించడానికి ఇదే సరైన సమయం' అని ఆయన అన్నారు. సిద్దరామయ్య తనను తాను అజ్ఞాతవాదిగా అభివర్ణించుకుంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేకపోవడం. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయనను హేతువాదిగా ప్రశంసిస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తీరు కొంచెం మారినట్టు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దరామయ్య దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు. జ్యోతిష్కులను కూడా సంప్రదిస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సిద్దరామయ్య తన భార్య మాత్రమే జ్యోతిష్కులను నమ్ముతుందని, తాను అలాంటి వాటికి వ్యతిరేకమని చెప్పారు. దీంతో ఆయన పాలనలో తమకు ఎలాంటి ఢోకా ఉండదని కర్ణాటకలోని జ్యోతిష్కులు భావించారు. అయితే ఆయన తాజా ప్రకటన మాత్రం వారి భవిష్యత్తును ఊగిసలాటలో పడేసింది. కర్ణాటకలో డజన్ల కొద్దీ న్యూస్, ఎంటర్టైన్మెంట్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లన్నింటిలోనూ ప్రతి రోజూ జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయంటే కొందరు జ్యోతిష్యులు పెద్ద సెలబ్రిటీలుగా కర్ణాటకలో చెలామణి అవుతున్నారు. కన్నడ కలర్స్ చానెల్లో ప్రసారమయ్యే నరేంద్రబాబు శర్మ 'బృహత్ బ్రహ్మాండ' కార్యక్రమం.. ఆ చానెల్లోనే ప్రసారమయ్యే 'బిగ్బాస్-1' తర్వాత అంతటి ప్రజాదరణను సాధించింది. టీవీ చానెళ్లకు లైవ్ ఆస్ట్రాలజీ షోలే ప్రధాన ఆదాయ వనరు అని, ఆ కార్యక్రమాలు ఆగిపోతే కొన్ని చానళ్లు మనుగడ సాగించడం కష్టమని పరిశీలకులు చెప్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాలను నిషేధించాలని, వీటివల్ల సమాజంలో మూఢనమ్మకాలు, మానసిక సమస్యలు ప్రబలుతున్నాయని ఒక వర్గం వారు డిమాండ్ చేస్తుండగా.. ఈ కార్యక్రమాలను సమర్థించే మరో వర్గం వారు మాత్రం తమ వ్యక్తిగత అభీష్టాలలో తలదూర్చడానికి ప్రభుత్వం ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎం సిద్దరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు టీవీల్లో జ్యోతిష్య కార్యక్రమాలు కొనసాగాలా? వద్దా? అనే చర్చకు మరింత ఆజ్యం పోశాయి.