జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా? | CM Siddaramaiah wants to ban astrology shows on TV, future of fortune tellers in Karnataka bleak | Sakshi
Sakshi News home page

జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా?

Published Fri, Dec 11 2015 2:21 PM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా?

జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా?

బెంగళూరు: ఇలాంటి విపత్తు ఒకటి వచ్చి మీద పడుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందరూ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులకు ఇప్పుడు కర్ణాటకలో తమ భవిష్యత్తేమిటో తెలియడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజా నిర్ణయం కనుక అమలైతే ఆ రాష్ట్రవ్యాప్తంగా టీవీల్లో ప్రసారమవుతున్న లైవ్‌ ఆస్ట్రాలజీ కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం కనిపిస్తున్నది. కొద్దిరోజుల కిందట ఓ కార్యక్రమంలో మాట్లాడిన సిద్దరామయ్య టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే లైవ్ జ్యోతిష్య కార్యక్రమాలపై నిషేధం విధించాలని అభిప్రాయపడ్డారు. 'కర్ణాటకలో ప్రతి టీవీ చానెల్ కూడా జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారం చేయాలని భావిస్తున్నది. ఈ కార్యక్రమాలకు బాగా ప్రేక్షకాదరణ ఉన్నట్టు కనిపిస్తున్నది. మా ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలపై నిషేధించడానికి ఇదే సరైన సమయం' అని ఆయన అన్నారు.   

సిద్దరామయ్య తనను తాను అజ్ఞాతవాదిగా అభివర్ణించుకుంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేకపోవడం. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయనను హేతువాదిగా ప్రశంసిస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తీరు కొంచెం మారినట్టు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దరామయ్య దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు. జ్యోతిష్కులను కూడా సంప్రదిస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సిద్దరామయ్య తన భార్య మాత్రమే జ్యోతిష్కులను నమ్ముతుందని, తాను అలాంటి వాటికి వ్యతిరేకమని చెప్పారు. దీంతో ఆయన పాలనలో తమకు ఎలాంటి ఢోకా ఉండదని కర్ణాటకలోని జ్యోతిష్కులు భావించారు. అయితే ఆయన తాజా ప్రకటన మాత్రం వారి భవిష్యత్తును ఊగిసలాటలో పడేసింది.

కర్ణాటకలో డజన్ల కొద్దీ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లన్నింటిలోనూ ప్రతి రోజూ జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయంటే కొందరు జ్యోతిష్యులు పెద్ద సెలబ్రిటీలుగా కర్ణాటకలో చెలామణి అవుతున్నారు. కన్నడ కలర్స్ చానెల్‌లో ప్రసారమయ్యే నరేంద్రబాబు శర్మ 'బృహత్ బ్రహ్మాండ' కార్యక్రమం.. ఆ చానెల్‌లోనే ప్రసారమయ్యే 'బిగ్‌బాస్‌-1' తర్వాత అంతటి ప్రజాదరణను సాధించింది. టీవీ  చానెళ్లకు లైవ్ ఆస్ట్రాలజీ షోలే ప్రధాన ఆదాయ వనరు అని, ఆ కార్యక్రమాలు ఆగిపోతే కొన్ని చానళ్లు మనుగడ సాగించడం కష్టమని పరిశీలకులు చెప్తున్నారు.

మరోవైపు ఈ కార్యక్రమాలను నిషేధించాలని, వీటివల్ల సమాజంలో మూఢనమ్మకాలు, మానసిక సమస్యలు ప్రబలుతున్నాయని ఒక వర్గం వారు డిమాండ్ చేస్తుండగా.. ఈ  కార్యక్రమాలను సమర్థించే మరో వర్గం వారు మాత్రం తమ వ్యక్తిగత అభీష్టాలలో తలదూర్చడానికి ప్రభుత్వం ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎం సిద్దరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు టీవీల్లో జ్యోతిష్య కార్యక్రమాలు కొనసాగాలా? వద్దా? అనే చర్చకు మరింత ఆజ్యం పోశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement