fortune tellers
-
Astrologer Amy Tripp: ట్రంపే గెలుస్తారు
వాషింగ్టన్: ట్రంప్, కమలా హారిస్లమధ్య ఓటర్ల మద్దతు కేవలం ఒక శాతం తేడా ఉందన్న వార్తల నడుమ అక్కడి ప్రముఖ జ్యోతిష్యు రాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ చేతి కొస్తాయని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ జూలై 21న రేసు నుంచి తప్పుకుంటారని ఆమె చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ‘సూర్యుడు ట్రంప్‌నకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గెలుపు ట్రంప్‌దే’ అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాదు, ‘‘హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు’’ అంటూ 2020లోనే చెప్పారు. అదీ అక్షరసత్యమైనట్టే కన్పిస్తోంది.ఆగస్టులో అమెరికాలో విపరిణామాలు!అమీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రలాజికల్ రీసెర్చ్ (ఐసార్) నుంచి సర్టిఫైడ్ జ్యోతిష్యురాలు. లైసెన్స్డ్ థెరపిస్ట్ కూడా. నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోకాస్మిక్ రీసెర్చ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్లలో క్రియాశీలకంగా ఉన్నారు. గ్రహచారం తదితరాల ఆధారంగా బైడెన్ జూలై 21న అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారు’’ అని అమీ జూలై 11వ తేదీన చెప్పారు. అది అచ్చంగా అలాగే జరిగింది. ‘‘ఈసారి ట్రంపే గెలుస్తారు. అయితే అధ్యక్షునిగా ఆయన అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చు’’ అమీ చెప్పారు. ఆగస్టులో ప్రచారం, రాజకీయాల్లో విపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు! -
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం.. ఇద్దరి అరెస్ట్
చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత -
ఎరుక చెప్ప వచ్చితిమమ్మా!
‘సోది’ అని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ.. ఇప్పటి కౌన్సెలింగ్‌లు అన్నిటికీ అదే పునాదేమో అనిపిస్తుంది! మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పు కావాలి. ‘భయపడవద్దు, ధైర్యంగా సాగిపో’ అని చెప్పే ఒక శ్రేయోభిలాషి ఉండాలి. ‘సోది’లో అలాంటి అభిలాషే ఉంటుంది. శాస్త్రబద్ధతను పక్కన పెడితే... సోది చెప్పడంలో.. ‘నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నీకు అండగా ౖదైవశక్తి ఉంది, ఆ శక్తి నిన్ను సరైన దారిలోనే నడిపిస్తోంది’ అని ధైర్యం చెప్పడం ఉంటుంది. అలా గత యాభై ఏళ్లుగా కావలి చుట్టుపక్కల ఊళ్లకు సోది చెబుతున్న డెభ్భై ఐదేళ్ల ‘యానాదమ్మ’ కథ ఇది. ‘‘బుజ్జీ! సోది నాంచారి వచ్చిందే. ఇలా రా ఓసారి’’ వినీతను పిలిచింది సరోజనమ్మ. వినీత బయటకు వచ్చేటప్పటికి వరండాలో చాప మీద సోది నాంచారమ్మ కూర్చుని ఉంది. చేటలో బియ్యం, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, డబ్బులు పెట్టి ఉన్నాయి. నాంచారి బియ్యంలో చేయి పెట్టి కలుపుతూ గవ్వల పట్టీకి మొక్కుతోంది. తర్వాత సరోజనమ్మ చేతిని అందుకుంది. ‘‘ఏడుకొండల స్వామి, మాలకొండయ్య స్వామి, బయట అంకమ్మ, బజారు అంకమ్మ, తిరుపతమ్మ, బండ్లమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, సందోలుబళ్లమ్మ, ఈతముక్కల జాలమ్మ, భీమవరపు మునగాలమ్మ, పోలేరమ్మ, నెల్లూరు రంగనాయకుల స్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, సూళ్లూరుపేట చెంగాళమ్మ, కొల్హాపూర్ అమ్మ... ఇలా 101 మంది గ్రామదేవతలను తలచుకుంది. తర్వాత వారందరికీ సోదరుడైన పోతురాజును తలచుకుంది. ‘‘చేతినిండా అన్నం ఉంది. నిండు నూరేళ్లు ఆయుష్షు ఉంది. ధర్మగుణం చాలా ఉందమ్మా నీకు. కఠినత్వం లేదు. కుళ్లు, కుత్సితం లేదు. అన్నం పెట్టే కొమ్మలున్నారు. ఆదరించే బాలలున్నారు. కన్న కొడుకులు కొన్న కోడళ్లు (కన్యాశుల్కం, ఓలి వంటి సంప్రదాయాలు రాజ్యమేలిన రోజులది ఈ మాట).. నీకేం ఫరవాలేదమ్మా. నిండు నూరేళ్లు పూజిస్తారు నిన్ను..’’ అని చెబుతోంది. ‘నా మనుమరాలికి పెళ్లి ఎప్పుడవుతుందో చెప్పడం లేదేంటి’.. సరోజనమ్మ సందేహంగా చూస్తోంది. ‘అనుకున్నవన్నీ అనుకున్నట్లే అవుతాయమ్మ... పెళ్లి కుదిరినంక అంకమ్మ తల్లికి పొంగలి పెడతానని మొక్కుకోవే తల్లి’ నాంచారి కళ్లు మూసుకుని చెప్పుకుపోతోంది. సరోజనమ్మ ముఖం వెలిగిపోయింది. సంతోషంగా మనమరాలు వినీతను చూసింది. ఎరుక నాంచారులు యానాదమ్మలా సోది చెప్పే వాళ్లను ‘ఎరుక నాంచారులు’ అంటారు. సోది బుర్ర మీద తీగను మీటుతూ పాటను లయబద్ధంగా పాడతారు. సోది పాటను కంఠతా పట్టేసి ఉంటారు. చూసి చదవడానికి వాళ్లలో చాలామందికి చదువురాదు. తల్లి నుంచి కూతురు నేర్చుకుంటుంది. ఏళ్లుగా ఈ పరంపర కొనసాగుతోంది. ఇది ఎరుకల వృత్తి. సోది చెప్పి, బుట్టలల్లి జీవనాన్ని సాగిస్తారు. ‘‘దేవుడు మనుషులకు బతకడానికి ఒక్కొక్కరికి ఒక్కో పని ముట్టు ఇచ్చాడు. మాకు మగవాళ్లకు ఈతాకు కోసే కత్తి, ఆడవాళ్లకు సోదిబుర్ర ఇచ్చాడని చెప్పారు మా పెద్దోళ్లు. ఎరుక చెప్పే వాళ్లం కావడంతో మమ్మల్ని ఎరుకల వాళ్లంటారు. ‘ఎరుక వాళ్లు లేని ఊరు ఊరే కాద’న్నాడు ఆ దేవుడు. మా ఇళ్లల్లో మగపిల్లలకు అడవికి పోయి ఈత కోసుకొచ్చి బుట్టలల్లడం నేర్పిస్తారు. ఆడపిల్లలకు బుట్టలల్లడంతోపాటు సోది చెప్పడం కూడా నేర్పిస్తారు’’.. అని చెప్పారు యానాదమ్మ. ఇప్పటికీ అదరణ లభిస్తున్న తన వృత్తి గురించి ఆమె ఎన్నో విషయాలు తెలిపారు. సోదికి వెళ్లే రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి గదిని శుభ్రం చేస్తాం. సోది బుర్రని తుడిచి, పసుపు రాసి కుంకుమ పెడతాం. సోది చెప్పేటప్పుడు దేవత రూపాన్ని బియ్యంలో పెట్టి, ఆకువక్కలు, దక్షిణ పెట్టి దణ్ణం పెట్టాలి. దేవతలందరినీ తలుచుకుని వాక్కు ఇవ్వమని వేడుకుంటాం. ఎవరి ఇలవేల్పు వారికి వాక్కు ఇస్తాడు. సోదిలో మేము ఏం చెప్పామన్నది తర్వాత మాకు గుర్తుండదు. పిల్లలు పుట్టని వాళ్లు, అనారోగ్యం వచ్చినవాళ్లు, ఇంట్లో కలతలు, పెళ్లీడు దాటినా పెళ్లి కుదరకపోవడం.. ఏ కష్టం ఉన్నా మమ్మల్ని పిలుస్తారు. మేము చెప్పినట్లు జరిగితే మళ్లీ పిలిచి భోజనం పెట్టి, చీర, తాంబూలం పెడతారు. అరవై ఏళ్లుగా చెబుతున్నా! మా అమ్మ నా పదమూడో ఏట నేర్పించింది. అరవై ఏళ్లుగా సోది చెబుతున్నాను. మా ఇంట్లో ఇది నాతోనే ఆగిపోయేట్టుంది. నాకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఒక్క కూతురు కూడా సోది చెప్పడం నేర్చుకోలేదు. ‘పాట నేర్పిస్తాను రమ్మంటే, ఈ రోజుల్లో సోది ఎవరు చెప్పించుకుంటారమ్మా’ అన్నారు తప్ప ఒక్కరికీ నేర్చుకోవాలనే బుద్ధి కలగలేదు. కోడళ్లకూ రాదు. అన్నం పెట్టినా పెట్టకపోయినా చేతిలో కళ ఉండాలంటే ఒక్కరూ వినలే. అడవి అడవిలా లేదిప్పుడు! మా పిల్లలు బుట్టలల్లడం నేర్చుకున్నారు. ఫారెస్టోళ్లు అడవంతా దున్నేసి జీడిమామిడి, జామాయిల్, సుబాబుల్ చెట్లు నాటారు. ఈత పుల్ల దొరకడం లేదు. చేతికి వచ్చిన పనిని మర్చిపోకూడదని ఆశ చావక అప్పుడప్పుడూ అడవికి పోతుంటాం. దొరికిన పుల్ల తెచ్చి బుట్టలల్లుతాం. పుల్లా దొరకట్లేదు, బుట్ట అడిగేవాళ్లూ లేరు. ఇప్పుడంతా అల్యూమినియం, ప్లాస్టిక్ బుట్టలే. నా చిన్నప్పుడు బియ్యం వడవేసే సిబ్బి, ఇరస గంపలు, పేడతట్టలు, కోళ్ల ఊతలతో పని ఉండేది. ఇప్పుడు చాలా ఇళ్లల్లో కోళ్లే కనిపించట్లేదు. కొత్త బతుకు బాట! అడవి పోయి పుల్ల దొరక్క పోయే, సోదీ పోయే. ఊళ్లల్లో పందులుంటే జబ్బులొస్తున్నాయని సర్కారోళ్లు చంపేశారు. రోజులు మారిపోతుంటే... మేమూ మారిపోవాల్సిందే. కొత్త బతుకుబాటలేసుకున్నాం. మా తరం వాళ్లు బాతులు పెంచారు. ఇప్పటి కొత్త తరం చదువుకుని ఉద్యోగాలకు పోతున్నారు. నా కొడుకుల్లో పెద్దోడు బస్‌లో కండక్టరు, చిన్నోడు ఆటో నడిపాడు. ఇప్పుడు చికెన్ అమ్ముతున్నాడు. మా ఇల్లొక్కటే కాదు... మా ఎరుకల పాలెం అంతా మారిపోయింది. నేను మాత్రం సోది బుర్రను వదలను’’ అంటున్నారు యానాదమ్మ. అన్నం పుడుతుంది! సముద్రంలో గవ్వలు తెచ్చి, వాటిని గట్టి అట్టలా ఉండే గుడ్డకు కుట్టాలి. పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. అది మా సోది దేవత రూపం. ఇక బుర్ర కోసం... చెట్టునే ఎండిపోయిన సొరకాయ కావాలి. దానికి కింద వైపు చిల్లు పెట్టి గుజ్జు, గింజలు తీసేసి శుభ్రం చేసి ఆరబెట్టాలి. కర్రకు సొరకాయ బుర్ర, వీణతంతిని కడితే అదే సోది బుర్ర. నాలుగైదేళ్లకోసారి పాత బుర్ర తీసేసి కొత్త బుర్రను కట్టాలి. చేతిలో సోదిబుర్ర, నాలుక మీద పాట ఉంటే... కరువులో కూడా అన్నం పుట్టించుకోవచ్చు. –పేరం యానాదమ్మ, సోది నాంచారి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జ్యోతిష్కుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా?
బెంగళూరు: ఇలాంటి విపత్తు ఒకటి వచ్చి మీద పడుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందరూ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులకు ఇప్పుడు కర్ణాటకలో తమ భవిష్యత్తేమిటో తెలియడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజా నిర్ణయం కనుక అమలైతే ఆ రాష్ట్రవ్యాప్తంగా టీవీల్లో ప్రసారమవుతున్న లైవ్ ఆస్ట్రాలజీ కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం కనిపిస్తున్నది. కొద్దిరోజుల కిందట ఓ కార్యక్రమంలో మాట్లాడిన సిద్దరామయ్య టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే లైవ్ జ్యోతిష్య కార్యక్రమాలపై నిషేధం విధించాలని అభిప్రాయపడ్డారు. 'కర్ణాటకలో ప్రతి టీవీ చానెల్ కూడా జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారం చేయాలని భావిస్తున్నది. ఈ కార్యక్రమాలకు బాగా ప్రేక్షకాదరణ ఉన్నట్టు కనిపిస్తున్నది. మా ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలపై నిషేధించడానికి ఇదే సరైన సమయం' అని ఆయన అన్నారు. సిద్దరామయ్య తనను తాను అజ్ఞాతవాదిగా అభివర్ణించుకుంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేకపోవడం. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయనను హేతువాదిగా ప్రశంసిస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తీరు కొంచెం మారినట్టు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దరామయ్య దేవాలయాలకు వెళ్తూ ఉన్నారు. జ్యోతిష్కులను కూడా సంప్రదిస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సిద్దరామయ్య తన భార్య మాత్రమే జ్యోతిష్కులను నమ్ముతుందని, తాను అలాంటి వాటికి వ్యతిరేకమని చెప్పారు. దీంతో ఆయన పాలనలో తమకు ఎలాంటి ఢోకా ఉండదని కర్ణాటకలోని జ్యోతిష్కులు భావించారు. అయితే ఆయన తాజా ప్రకటన మాత్రం వారి భవిష్యత్తును ఊగిసలాటలో పడేసింది. కర్ణాటకలో డజన్ల కొద్దీ న్యూస్, ఎంటర్టైన్మెంట్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లన్నింటిలోనూ ప్రతి రోజూ జ్యోతిష్య కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయంటే కొందరు జ్యోతిష్యులు పెద్ద సెలబ్రిటీలుగా కర్ణాటకలో చెలామణి అవుతున్నారు. కన్నడ కలర్స్ చానెల్లో ప్రసారమయ్యే నరేంద్రబాబు శర్మ 'బృహత్ బ్రహ్మాండ' కార్యక్రమం.. ఆ చానెల్లోనే ప్రసారమయ్యే 'బిగ్‌బాస్-1' తర్వాత అంతటి ప్రజాదరణను సాధించింది. టీవీ చానెళ్లకు లైవ్ ఆస్ట్రాలజీ షోలే ప్రధాన ఆదాయ వనరు అని, ఆ కార్యక్రమాలు ఆగిపోతే కొన్ని చానళ్లు మనుగడ సాగించడం కష్టమని పరిశీలకులు చెప్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాలను నిషేధించాలని, వీటివల్ల సమాజంలో మూఢనమ్మకాలు, మానసిక సమస్యలు ప్రబలుతున్నాయని ఒక వర్గం వారు డిమాండ్ చేస్తుండగా.. ఈ కార్యక్రమాలను సమర్థించే మరో వర్గం వారు మాత్రం తమ వ్యక్తిగత అభీష్టాలలో తలదూర్చడానికి ప్రభుత్వం ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎం సిద్దరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు టీవీల్లో జ్యోతిష్య కార్యక్రమాలు కొనసాగాలా? వద్దా? అనే చర్చకు మరింత ఆజ్యం పోశాయి.