‘సోది’ అని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ.. ఇప్పటి కౌన్సెలింగ్‌లు అన్నిటికీ అదే పునాదేమో అనిపిస్తుంది! మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పు కావాలి. ‘భయపడవద్దు, ధైర్యంగా సాగిపో’ అని చెప్పే ఒక శ్రేయోభిలాషి ఉండాలి. ‘సోది’లో అలాంటి అభిలాషే ఉంటుంది. శాస్త్రబద్ధతను పక్కన పెడితే... సోది చెప్పడంలో.. ‘నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నీకు అండగా ౖదైవశక్తి ఉంది, ఆ శక్తి నిన్ను సరైన దారిలోనే నడిపిస్తోంది’ అని ధైర్యం చెప్పడం ఉంటుంది. అలా గత యాభై ఏళ్లుగా కావలి చుట్టుపక్కల ఊళ్లకు సోది చెబుతున్న డెభ్భై ఐదేళ్ల ‘యానాదమ్మ’ కథ ఇది.
‘‘బుజ్జీ! సోది నాంచారి వచ్చిందే. ఇలా రా ఓసారి’’ వినీతను పిలిచింది సరోజనమ్మ. వినీత బయటకు వచ్చేటప్పటికి వరండాలో చాప మీద సోది నాంచారమ్మ కూర్చుని ఉంది. చేటలో బియ్యం, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, డబ్బులు పెట్టి ఉన్నాయి. నాంచారి బియ్యంలో చేయి పెట్టి కలుపుతూ గవ్వల పట్టీకి మొక్కుతోంది. తర్వాత సరోజనమ్మ చేతిని అందుకుంది.
‘‘ఏడుకొండల స్వామి, మాలకొండయ్య స్వామి, బయట అంకమ్మ, బజారు అంకమ్మ, తిరుపతమ్మ, బండ్లమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, సందోలుబళ్లమ్మ, ఈతముక్కల జాలమ్మ, భీమవరపు మునగాలమ్మ, పోలేరమ్మ, నెల్లూరు రంగనాయకుల స్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, సూళ్లూరుపేట చెంగాళమ్మ, కొల్హాపూర్ అమ్మ... ఇలా 101 మంది గ్రామదేవతలను తలచుకుంది. తర్వాత వారందరికీ సోదరుడైన పోతురాజును తలచుకుంది.
‘‘చేతినిండా అన్నం ఉంది. నిండు నూరేళ్లు ఆయుష్షు ఉంది. ధర్మగుణం చాలా ఉందమ్మా నీకు. కఠినత్వం లేదు. కుళ్లు, కుత్సితం లేదు. అన్నం పెట్టే కొమ్మలున్నారు. ఆదరించే బాలలున్నారు. కన్న కొడుకులు కొన్న కోడళ్లు (కన్యాశుల్కం, ఓలి వంటి సంప్రదాయాలు రాజ్యమేలిన రోజులది ఈ మాట).. నీకేం ఫరవాలేదమ్మా. నిండు నూరేళ్లు పూజిస్తారు నిన్ను..’’ అని చెబుతోంది.
‘నా మనుమరాలికి పెళ్లి ఎప్పుడవుతుందో చెప్పడం లేదేంటి’.. సరోజనమ్మ సందేహంగా చూస్తోంది. ‘అనుకున్నవన్నీ అనుకున్నట్లే అవుతాయమ్మ... పెళ్లి కుదిరినంక అంకమ్మ తల్లికి పొంగలి పెడతానని మొక్కుకోవే తల్లి’ నాంచారి కళ్లు మూసుకుని చెప్పుకుపోతోంది. సరోజనమ్మ ముఖం వెలిగిపోయింది. సంతోషంగా మనమరాలు వినీతను చూసింది.
ఎరుక నాంచారులు
యానాదమ్మలా సోది చెప్పే వాళ్లను ‘ఎరుక నాంచారులు’ అంటారు. సోది బుర్ర మీద తీగను మీటుతూ పాటను లయబద్ధంగా పాడతారు. సోది పాటను కంఠతా పట్టేసి ఉంటారు. చూసి చదవడానికి వాళ్లలో చాలామందికి చదువురాదు. తల్లి నుంచి కూతురు నేర్చుకుంటుంది. ఏళ్లుగా ఈ పరంపర కొనసాగుతోంది. ఇది ఎరుకల వృత్తి. సోది చెప్పి, బుట్టలల్లి జీవనాన్ని సాగిస్తారు.
‘‘దేవుడు మనుషులకు బతకడానికి ఒక్కొక్కరికి ఒక్కో పని ముట్టు ఇచ్చాడు. మాకు మగవాళ్లకు ఈతాకు కోసే కత్తి, ఆడవాళ్లకు సోదిబుర్ర ఇచ్చాడని చెప్పారు మా పెద్దోళ్లు. ఎరుక చెప్పే వాళ్లం కావడంతో మమ్మల్ని ఎరుకల వాళ్లంటారు. ‘ఎరుక వాళ్లు లేని ఊరు ఊరే కాద’న్నాడు ఆ దేవుడు. మా ఇళ్లల్లో మగపిల్లలకు అడవికి పోయి ఈత కోసుకొచ్చి బుట్టలల్లడం నేర్పిస్తారు. ఆడపిల్లలకు బుట్టలల్లడంతోపాటు సోది చెప్పడం కూడా నేర్పిస్తారు’’.. అని చెప్పారు యానాదమ్మ. ఇప్పటికీ అదరణ లభిస్తున్న తన వృత్తి గురించి ఆమె ఎన్నో విషయాలు తెలిపారు.
సోదికి వెళ్లే రోజు
ఉదయమే నిద్రలేచి స్నానం చేసి గదిని శుభ్రం చేస్తాం. సోది బుర్రని తుడిచి, పసుపు రాసి కుంకుమ పెడతాం. సోది చెప్పేటప్పుడు దేవత రూపాన్ని బియ్యంలో పెట్టి, ఆకువక్కలు, దక్షిణ పెట్టి దణ్ణం పెట్టాలి. దేవతలందరినీ తలుచుకుని వాక్కు ఇవ్వమని వేడుకుంటాం. ఎవరి ఇలవేల్పు వారికి వాక్కు ఇస్తాడు. సోదిలో మేము ఏం చెప్పామన్నది తర్వాత మాకు గుర్తుండదు. పిల్లలు పుట్టని వాళ్లు, అనారోగ్యం వచ్చినవాళ్లు, ఇంట్లో కలతలు, పెళ్లీడు దాటినా పెళ్లి కుదరకపోవడం.. ఏ కష్టం ఉన్నా మమ్మల్ని పిలుస్తారు. మేము చెప్పినట్లు జరిగితే మళ్లీ పిలిచి భోజనం పెట్టి, చీర, తాంబూలం పెడతారు.
అరవై ఏళ్లుగా చెబుతున్నా!
మా అమ్మ నా పదమూడో ఏట నేర్పించింది. అరవై ఏళ్లుగా సోది చెబుతున్నాను. మా ఇంట్లో ఇది నాతోనే ఆగిపోయేట్టుంది. నాకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఒక్క కూతురు కూడా సోది చెప్పడం నేర్చుకోలేదు. ‘పాట నేర్పిస్తాను రమ్మంటే, ఈ రోజుల్లో సోది ఎవరు చెప్పించుకుంటారమ్మా’ అన్నారు తప్ప ఒక్కరికీ నేర్చుకోవాలనే బుద్ధి కలగలేదు. కోడళ్లకూ రాదు. అన్నం పెట్టినా పెట్టకపోయినా చేతిలో కళ ఉండాలంటే ఒక్కరూ వినలే.
అడవి అడవిలా లేదిప్పుడు!
మా పిల్లలు బుట్టలల్లడం నేర్చుకున్నారు. ఫారెస్టోళ్లు అడవంతా దున్నేసి జీడిమామిడి, జామాయిల్, సుబాబుల్ చెట్లు నాటారు. ఈత పుల్ల దొరకడం లేదు. చేతికి వచ్చిన పనిని మర్చిపోకూడదని ఆశ చావక అప్పుడప్పుడూ అడవికి పోతుంటాం. దొరికిన పుల్ల తెచ్చి బుట్టలల్లుతాం. పుల్లా దొరకట్లేదు, బుట్ట అడిగేవాళ్లూ లేరు. ఇప్పుడంతా అల్యూమినియం, ప్లాస్టిక్ బుట్టలే. నా చిన్నప్పుడు బియ్యం వడవేసే సిబ్బి, ఇరస గంపలు, పేడతట్టలు, కోళ్ల ఊతలతో పని ఉండేది. ఇప్పుడు చాలా ఇళ్లల్లో కోళ్లే కనిపించట్లేదు.
కొత్త బతుకు బాట!
అడవి పోయి పుల్ల దొరక్క పోయే, సోదీ పోయే. ఊళ్లల్లో పందులుంటే జబ్బులొస్తున్నాయని సర్కారోళ్లు చంపేశారు. రోజులు మారిపోతుంటే... మేమూ మారిపోవాల్సిందే. కొత్త బతుకుబాటలేసుకున్నాం. మా తరం వాళ్లు బాతులు పెంచారు. ఇప్పటి కొత్త తరం చదువుకుని ఉద్యోగాలకు పోతున్నారు. నా కొడుకుల్లో పెద్దోడు బస్‌లో కండక్టరు, చిన్నోడు ఆటో నడిపాడు. ఇప్పుడు చికెన్ అమ్ముతున్నాడు. మా ఇల్లొక్కటే కాదు... మా ఎరుకల పాలెం అంతా మారిపోయింది. నేను మాత్రం సోది బుర్రను వదలను’’ అంటున్నారు యానాదమ్మ.
అన్నం పుడుతుంది!
సముద్రంలో గవ్వలు తెచ్చి, వాటిని గట్టి అట్టలా ఉండే గుడ్డకు కుట్టాలి. పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. అది మా సోది దేవత రూపం. ఇక బుర్ర కోసం... చెట్టునే ఎండిపోయిన సొరకాయ కావాలి. దానికి కింద వైపు చిల్లు పెట్టి గుజ్జు, గింజలు తీసేసి శుభ్రం చేసి ఆరబెట్టాలి. కర్రకు సొరకాయ బుర్ర, వీణతంతిని కడితే అదే సోది బుర్ర. నాలుగైదేళ్లకోసారి పాత బుర్ర తీసేసి కొత్త బుర్రను కట్టాలి. చేతిలో సోదిబుర్ర, నాలుక మీద పాట ఉంటే... కరువులో కూడా అన్నం పుట్టించుకోవచ్చు. –పేరం యానాదమ్మ, సోది నాంచారి
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment