ఆధార్ అనుసంధానాన్ని 15లోపు పూర్తిచేయాలి
ఒంగోలు టౌన్ : పట్టాదారు పాస్‌పుస్తకాలకు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల 15వ తేదీలోపు 100 శాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టాదారు పాస్‌పుస్తకాలకు ఆధార్ అనుసంధానం కాకుంటే భవిష్యత్తులో రైతులు నష్టపోతారన్నారు.
ఈ విషయమై విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టాదారు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులంతా ఆధార్‌ను అనుసంధానం చేయించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 83 శాతం ఆధార్ అనుసంధానం పూర్తయిందని, మిగిలిన 17 శాతాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేసి 100 శాతానికి చేరుకోవాలని జేసీ కోరారు. పట్టాదారు పాస్‌పుస్తకాలను ఒకరి నుంచి మరొకరి పేరుకు మార్చుకునేందుకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) స్పెషల్ డ్రైవ్‌కు అంగీకరించారన్నారు.
ఈ నెల 19లోపు సమీపంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి మార్చుకోవాలని సూచించారు. దీనిపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తహశీల్దార్లను జేసీ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్ఐసీ డీఐవో మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.