‘పసిడి’ కూతకు విజయం దూరంలో...
కబడ్డీ ఫైనల్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు
ఇంచియాన్: మిగతా క్రీడాంశాల్లో ఫలితాలు ఎలా ఉన్నా.... ఆసియా క్రీడల్లో కచ్చితంగా రెండు స్వర్ణాలు గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న క్రీడాంశం కబడ్డీ. అంచనాలకు అనుగుణంగానే భారత పురుషుల, మహిళల జట్లు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. పురుషుల జట్టు వరుసగా ఏడో స్వర్ణంపై... మహిళల జట్టు వరుసగా రెండో స్వర్ణంపై గురి పెట్టాయి. గురువారం జరిగిన పురుషుల గ్రూప్ ‘ఎ’ సెమీఫైనల్లో భారత్ 36-25తో కొరియాపై గెలిచింది. తొలి అర్ధభాగానికి 14-12 ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో అర్ధభాగంలో మరింత దూకుడుగా ఆడి 22 పాయింట్లు సొంతం చేసుకుంది.
కొరియా 13 పాయింట్లు మాత్రమే గెలవడంతో ఓటమి తప్పలేదు. తొలి భాగంలో ఏడు, రెండో భాగంలో ఒక బోనస్ పాయింట్లు గెలిచిన భారత్ రెండుసార్లు లోనాను నమోదు చేసింది. కేవలం ఐదు బోనస్ పాయింట్లతో సరిపెట్టుకున్న కొరియా ఒక్క లోనా కూడా చేయలేకపోయింది. మహిళల సెమీస్‌లో భారత్ 41-28తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో రెండు జట్ల స్కోరు 14-14తో సమమైంది. అయితే రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చిన భారత్ చకచకా 27 పాయింట్లను కైవసం చేసుకుంది. థాయ్ క్రీడాకారిణిలు 14 పాయింట్లతో సరిపెట్టుకున్నారు. భారత్‌కు మొత్తం 6 బోనస్ పాయింట్లతో పాటు రెండు లోనాలు లభించాయి. థాయ్ 13 బోనస్ పాయింట్లు నెగ్గినా లోనాను మాత్రం నమోదు చేయలేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు ఇరాన్‌తో; మహిళల జట్టు కూడా ఇరాన్‌తోనే తలపడతాయి.
వాలీబాల్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. 5-8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. మహిళల టీమ్ 0-3తో హాంకాంగ్ చేతిలో ఓడి 8వ స్థానంతో సరిపెట్టుకుంది.
టేబుల్ టెన్నిస్: స్టార్ ప్లేయర్ సౌమ్యజిత్ ఘోష్ ప్రిక్వార్టర్స్‌లో 1-4తో స్నిహోక్ పాక్ (కొరియా) చేతిలో; మహిళల విభాగంలో మానికా బాత్రా 0-4తో ఇషికావా కసుమీ (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. అంకితా దాస్ తొలి రౌండ్లో 2-4తో వింగ్ నామ్ (హాంకాంగ్) చేతిలో ఓడింది.
తైక్వాండో: 63 కేజీల క్వార్టర్స్‌లో సౌరవ్ 4-5తో అబాసి అహ్మద్ (అఫ్ఘానిస్థాన్) చేతిలో; 68 కేజీల విభాగంలో శివ్ కుమార్ 7-11తో గాజి ముషాబ్బా (సౌదీ ఆరేబియా) చేతిలో ఓడారు. మహిళల 62 కేజీల విభాగంలో రేఖా రాణి 0-15తో చువాంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో; 67 కేజీల కేటగిరీలో శ్రేయా సింగ్ 6-7తో వోన్జిన్ లీ (కొరియా) చేతిలో ఓటమి చెందారు.