కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాతోపాటు నాటో దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయి. విదేశాలకు వెళ్లడానికి ఇప్పటిదాకా ఒకే ఒక్క ఆధారంగా నిలిచిన కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలు లేక నిశ్శబ్దం తాండవిస్తోంది. దీంతో అఫ్గాన్ ప్రజలు దేశ సరిహద్దులకు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా మరో దేశానికి వలస వెళ్లి తలదాచుకోవాలని ఆరాట పడుతున్నారు. ఇందుకోసం సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అఫ్గాన్ సరిహద్దులు జనంతో కిటకిటలాడుతున్నాయి.
ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, ఇతర మధ్య ఆసియా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అఫ్గాన్–పాకిస్తాన్ మధ్య కీలక సరిహద్దు తోర్ఖామ్. ప్రస్తుతం ఇక్కడ అఫ్గాన్ భూభాగంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారని, గేటు తెరిచే సమయం కోసం వారంతా వేచి చూస్తున్నారని పాకిస్తాన్ అధికారి ఒకరు చెప్పారు. ఇక అఫ్గాన్–ఇరాన్ నడుమ సరిహద్దు అయిన ఇస్లామ్ ఖాలా బోర్డర్ పోస్టులో వేలాది మంది పడిగాపులు కాస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అఫ్గాన్ ప్రజల పట్ల ఇరాన్ భద్రతా సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారని, సరిహద్దును దాటే విషయంలో గతంలో పోలిస్తే ప్రస్తుతం కొంత వెలుసుబాటు కల్పిస్తున్నారని ఇరాన్లో అడుగుపెట్టిన అఫ్గాన్ వాసి ఒకరు తెలిపారు.
కొత్త ప్రభుత్వం ఎప్పుడు?
అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి అక్కడి పరిపాలనపై పడింది. తాలిబన్లు ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాలిబన్లు 1996లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను ఆక్రమించినప్పుడు గంటల వ్యవధిలోనే లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్‌లో ఏకాభిప్రాయంతోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తాను అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వమేదీ లేదు.
నూతన సర్కారు ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారయ్యిందని, అతి త్వరలో ప్రకటిస్తామని తాలిబన్లు తెలిపారు. తాలిబన్ సీనియర్ నేత ముల్లా హెబతుల్లా అఖూంజాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఆయన కింద ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు దేశాన్ని ముందుకు నడిపిస్తారని తాలిబన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు అనాముల్లా సమాంఘనీ తెలియజేశారు.
పంజ్‌షీర్ తిరుగుబాటుదారులతో
చర్చలు విఫలం
కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌పై తాలిబన్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నయానో భయానో ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. పంజ్‌షీర్ లోయలో అహ్మద్ మసూద్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంగతి తెలి సిందే.
ఇస్లామిక్ ఎమిరేట్‌లో చేరాలంటూ తాలిబన్ నాయకుడు ముల్లా అమీర్‌ఖాన్ ముతాఖీ బుధవారం పంజ్ షీర్ ప్రజలకు ఒక ఆడియో సందేశంలో పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణ జరిగినట్లు తెలి సింది. ఈ ఘర్షణలో 15 మంది తాలిబన్లు హతమయ్యారని, 200 మంది గాయపడ్డారని, 55 మంది తమకు లొంగిపోయారని తిరుగుబాటుదారుల ప్రతినిధి ఫహీం దష్తీ బుధవారం ప్రకటించారు.
ఖతార్ నుంచి సాంకేతిక బృందం రాక
కాబూల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ తాలిబన్లకు పెద్ద సంకటంగా మారింది. ఎయిర్‌పోర్టును నిర్వహించే సామర్థ్యం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే తమ మిత్ర దేశం ఖతార్ సాయాన్ని కోరుతున్నారు. తాలిబన్ల విజ్ఞప్తి మేరకు ఖతార్ ప్రభుత్వం బుధవారం ఒక సాంకేతిక బృందాన్ని ప్రత్యేక విమానంలో కాబూల్‌కు పంపించింది. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు, విమానాల రాకపోకలపై ఈ బృందం తగిన సాయం అందించనుంది.
కశ్మీర్‌కు విముక్తి లభించాలి: అల్–ఖాయిదా
అఫ్గాన్‌ను మళ్లీ చేజిక్కించుకున్న తాలిబన్లకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్–ఖాయిదా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇస్లాం శత్రువుల కబంధ హస్తాల నుంచి కశ్మీర్, సోమాలియా, యెమెన్‌తోపాటు మిగతా ఇస్లామిక్ భూభాగాలకు విముక్తి లభించాలి. ఓ.. అల్లా! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించు’’ అని తన ప్రకటనలో ప్రార్థించింది.