kachiguda- yeshwantpur train
-
పట్టాలెక్కిన యశ్వంతపూర్ వందేభారత్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణకు మూడో వందేభారత్ రైలుగా కేటాయించిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ రైలు పట్టాలెక్కింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్‌కు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. వందేభారత్ రైలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చిందని, మోదీ దీన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి 55 కి.మీ. చొప్పున కొత్త లైన్లు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను రూ.2,300 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాజిపేటలో వ్యాగన్ తయారీ కర్మాగారం అందుబాటులోకి వస్తోందని, అక్కడ భవిష్యత్తులో రైల్వేకు అవసరమైన ఇతర పరికరాలు కూడా తయారవుతాయని వివరించారు. మంగళవారం ఉదయం నుంచి.. సాధారణ ప్రయాణికులు లేకుండా తొలిరోజు బెంగుళూరు వెళ్లిన రైలు, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అక్కడి నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరనుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరనుంది. -
నేడు కాచిగూడ-యశ్వంత్‌పూర్ ట్రై వీక్లీ ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: కాచిగూడ-యశ్వంత్ పూర్ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ శనివారం రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ప్రారంభించనున్నారు. ఇది మధ్యాహ్నం 12.30 కు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 1.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరిగి 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. మార్చి 3 నుంచి ఈ ట్రైన్ రెగ్యులర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. యశ్వంత్‌పూర్-కాచిగూడ ట్రై వీక్లీ ప్రతి సోమ, బుధ,శుక్ర వారాల్లో మధ్యాహ్నం 2.30 గంటల కు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మంగళ,గురు,శని వారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఇది హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుత్తి,డోన్, కర్నూల్,గద్వాల్, శ్రీరాంనగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల,షాద్‌నగర్ స్టేషన్లలో ఆగుతుంది. కాగా, యశ్వంత్‌పూర్-జబల్పూర్ వీక్లీ, యశ్వంత్‌పూర్-లక్నో వీక్లీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్లను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో తెలిపారు.