kadapa centre
-
కడప ఆకాశవాణికి మొబైల్ యాప్‌లో చోటు
సాక్షి, కడప : ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలను ఇక మొబైల్ యాప్‌లో వినవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆకాశవాణి ప్రసారాలు వినేందుకు ప్రసార భారతి మొబైల్ యాప్‌ను రూపొందించింది. తొలి విడతగా ఈనెల 17న మన ఆకాశవాణి కడప కేంద్రం కంటే ఎంతో వెనుక ప్రారంభమైన రేడియో కేంద్రాలకు ఈ యాప్ సౌకర్యం కల్పించింది. ఆకాశవాణి కడప కేంద్రానికి ఈ సౌకర్యం కల్పించపోవడం గమనించిన జిల్లా సాహితీవేత్తలు, కళాకారులు ఆశ్చర్యపోయారు. ‘సాక్షి’ దినతిపత్రిక జిల్లా సంచికలో ఈనెల 18న ‘అయ్యో ఆకాశవాణి’ శీర్షికన ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రచురించింది. స్థానిక అధికారుల దృష్టి కి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు స్థానికుల నిరసనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మొబైల్ యాప్‌లో ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలకు కూడా చోటు కల్పించారు. ఈనెల 22వ తేది సాయంత్రం నుంచి ఈ ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా శ్రోతలు వింటున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినందుకు కడప శ్రోతలు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని కడప కేంద్రం ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా వినవచ్చు. యాప్ సౌకర్యం ఇలా గుగూల్ ప్లే స్టోర్‌లో న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారభారతి లైవ్ యాప్ అని టైప్ చేసి సెర్చి చేస్తే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్చేశాక స్క్రీన్ పైభాగాన కనిపించే రేడియోబొమ్మను క్లిక్ చేయాలి. అన్ని స్టేషన్ల ట్యాబ్‌లు కనిపిస్తాయి. వాటిలో ఇష్టమైన కేంద్రాలను ఫేవరేట్ కేంద్రాలుగా ఒక క్రమంలో అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌తో తెలుగు వారు ఎక్కడున్నా మన కేంద్రం రేడియో ప్రసారాలను వినవచ్చు. అరచేతిలోని మొబైల్లో ఆకాశవాణి ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఆంగ్లం, హిందీ భాషల్లో వార్తలు, దూర దర్శన్ ఛానళ్ల కార్యక్రమాలను కూడా వినవచ్చు. -
హౌస్‌ఫుల్
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతోంది. దీంతో సెంట్రల్ జైలు హౌస్‌ఫుల్‌గా మారుతోంది. ఇక్కడి అధికారులు, సిబ్బంది రోజురోజుకు పెరుగుతున్న ఖైదీల సంఖ్యను చూసి తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా కడప కేంద్ర కారాగారంలో వెయ్యి మంది ఖైదీలు ఉండేందుకు అవకాశం ఉంది. కానీ, మంగళవారం ఖైదీల వివరాలను గమనిస్తే పరిమితికి మించి ఉన్నారు. మొత్తం 1491 మంది కేంద్ర కారాగారంలో ఉన్నారు. వీరిని పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్‌తోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు మొత్తం కలిపి 181 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర కారాగారంలో 577 మంది పురుష జీవిత ఖైదీలు, 53 మంది మహిళా జీవిత ఖైదీలు ఉన్నారు. 842 మంది రిమాండ్ పురుష ఖైదీలు ఉన్నారు. 15 మంది రిమాండ్ మహిళా ఖైదీలు ఉన్నారు. మిగిలిన వారు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు రిమాండ్‌లో ఉన్నారు. జీవిత ఖైదీలకన్నా రిమాండ్ ఖైదీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా 842 మంది రిమాండ్ ఖైదీలలో కేవలం ఎర్రచందనం కూలీలే 540మంది ఉండడం విశేషం. వీరందరికీ బ్యారక్‌లలో, బ్లాక్‌లలో సౌకర్యం కల్పించడం జైలు అధికారులకు తలనొప్పిగా మారింది. వాటర్ ట్యాంకు ఉన్నా మంచినీటి కొరత కూడా ఉంది. నెల రోజుల నుంచి ఈ సంఖ్య ఇంచుమించు కొనసాగుతోంది. ఇరవై రోజుల కిందట చిత్తూరు జిల్లా నుంచి ఒకేసారి 200 మందికిపైగా ఎర్రచందనం కూలీలను రిమాండుకు తరలించడంతో వారిని ఇక్కడ ఉంచేందుకు అవకాశం లేక జైలు అధికారులు తమ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. దీంతో కొంతమంది రిమాండ్ ఖైదీలను ఆయా ప్రాంతాల్లోని జైళ్లకే తరలిస్తున్నారు. -
సేమ్... షేమ్!
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కేంద్ర కారాగారంలో రోజుకో సంఘటన వెలుగుచూస్తోంది.. ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పించినా సెల్ఫోన్లు లభ్యమవుతున్నాయి. తీవ్రవాదులుగా అభియోగం మోపబడి శిక్షను అనుభవిస్తున్న వారి వద్దనే సెల్ఫోన్లు లభ్యమవుతున్నాయంటే కొందరు అధికారుల, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఏ మేరకుఉందో తెలుస్తోంది. కేంద్ర కారాగారం బయట, లోపల అధికారుల పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్నప్పటికీ ఖైదీలకు సెల్ ఫోన్లు ఎలా అందుతున్నాయో ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో కిలోల కొద్ది గంజాయి బయట నుంచి విసిరేస్తే వార్డన్లు పట్టుకున్నారు. ఆ గంజాయి ఎలా వచ్చిందనేది ఇప్పటి వరకు నిగ్గుతేల్చలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆకుల నరసింహ ఖైదీలను ఆశ్రమ వాసులుగా పిలుస్తూ గౌరవ ప్రదంగా చూస్తూ వారిలోసత్ప్రవర్తనకు కృషి చే శారు. కేంద్ర కారాగారం లోపల, బయట కూరగాయలు, ఆకుకూరల తోటలను పెంచారు. కొందరు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని సెల్ఫోన్లను వాడుతూ ఆ తోటలలో భద్రపరుచుకునే వారు. తర్వాత కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌గా వచ్చిన డాక్టర్ ఇండ్ల శ్రీనివాసరావు హయాంలో సెల్ఫోన్లు విపరీతంగా వాడుతున్నారనే సమాచారం బయటికి పొక్కింది. ఆ సమయంలో పతాక శీర్షికన సెల్ఫోన్ల వ్యవహారంపై, గంజాయి విసరడంపై కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సెల్ఫోన్ల ద్వారాగానీ, ల్యాండ్‌లైన్ ద్వారాగానీ ఖైదీలు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో మరలా సెల్ఫోన్లు లభ్యం కావడం అనేది చర్చనీయాంశమైంది. ఐఎస్ఐ తీవ్రవాదుల వద్ద సెల్ఫోన్లు లభ్యం కడప కేంద్ర కారాగారం నుంచి వరంగల్ కేంద్ర కారాగారానికి ఈనెల 29వ తేదీన భారీ బందోబస్తు మధ్య ఐదుగురు ఐఎస్ఐ తీవ్రవాదులను తరలించారు. వీరిలో జహీర్, సలీం, విశ్వాస్, రియాజ్, రియాద్ ఉన్నారు. వీరిని కడపకేంద్ర కారాగారం వద్ద తనిఖీ చేసి పంపించారు. అయినప్పటికీ వరంగల్ కేంద్ర కారాగారానికి చేరుకునే సమయానికి ఐదుగురి వద్ద ఐదు సెల్ఫోన్లు లభ్యం కావడం గమనార్హం. కట్టుదిట్టమైన చర్యలకు ప్రయత్నిస్తున్నాం కడప కేంద్ర కారాగారంలో ఫోన్ సౌకర్యాన్ని ఖైదీలకు కల్పించడం వల్ల సెల్ఫోన్లు లభ్యమయ్యే వ్యవహారాన్ని తగ్గించగలిగాం. ఐఎస్ఐ తీవ్రవాదులను వరంగల్‌కు తరలించగా అక్కడి తనిఖీలలో సెల్ఫోన్లు లభించాయని సమాచారం వచ్చింది. సెల్ఫోన్ల నిరోధానికి తమవంతు బాధ్యతగా కృషి చేస్తున్నాం. సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. - గోవిందరాజులు, కేంద్ర కారాగార సూపరింటెండెంట్