హౌస్‌ఫుల్
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతోంది. దీంతో సెంట్రల్ జైలు హౌస్‌ఫుల్‌గా మారుతోంది. ఇక్కడి అధికారులు, సిబ్బంది రోజురోజుకు పెరుగుతున్న ఖైదీల సంఖ్యను చూసి తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా కడప కేంద్ర కారాగారంలో వెయ్యి మంది ఖైదీలు ఉండేందుకు అవకాశం ఉంది. కానీ, మంగళవారం ఖైదీల వివరాలను గమనిస్తే పరిమితికి మించి ఉన్నారు. మొత్తం 1491 మంది కేంద్ర కారాగారంలో ఉన్నారు.
వీరిని పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్‌తోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు మొత్తం కలిపి 181 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర కారాగారంలో 577 మంది పురుష జీవిత ఖైదీలు, 53 మంది మహిళా జీవిత ఖైదీలు ఉన్నారు. 842 మంది రిమాండ్ పురుష ఖైదీలు ఉన్నారు. 15 మంది రిమాండ్ మహిళా ఖైదీలు ఉన్నారు. మిగిలిన వారు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు రిమాండ్‌లో ఉన్నారు. జీవిత ఖైదీలకన్నా రిమాండ్ ఖైదీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా 842 మంది రిమాండ్ ఖైదీలలో కేవలం ఎర్రచందనం కూలీలే 540మంది ఉండడం విశేషం.
వీరందరికీ బ్యారక్‌లలో, బ్లాక్‌లలో సౌకర్యం కల్పించడం జైలు అధికారులకు తలనొప్పిగా మారింది. వాటర్ ట్యాంకు ఉన్నా మంచినీటి కొరత కూడా ఉంది. నెల రోజుల నుంచి ఈ సంఖ్య ఇంచుమించు కొనసాగుతోంది. ఇరవై రోజుల కిందట చిత్తూరు జిల్లా నుంచి ఒకేసారి 200 మందికిపైగా ఎర్రచందనం కూలీలను రిమాండుకు తరలించడంతో వారిని ఇక్కడ ఉంచేందుకు అవకాశం లేక జైలు అధికారులు తమ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. దీంతో కొంతమంది రిమాండ్ ఖైదీలను ఆయా ప్రాంతాల్లోని జైళ్లకే తరలిస్తున్నారు.