టీడీపీ.. మునుగుతున్న పడవ
అనంతపురం :‘తెలంగాణలో డజన్ల కొద్ది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టారు. హైదరాబాద్ నగర ఎన్నికల్లో భంగపాటు. ఏపీలో ఎన్నికల ముందు ఇచ్చిన ఉత్తుత్తి హామీలు అమలు సాధ్యం కావడం లేదు. భవిష్యత్తు అనుకున్న లోకేష్ అన్ని విధాలా వైఫల్యం చెందారు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ దుష్ర్పచారం చేస్తున్నార’ని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. శంకరనారాయణ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీలో చేరుతున్నట్లు కొన్ని పత్రికల పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయన్నారు. రెండేళ్లుగా తమ ఎమ్మెల్యేలలో ఒక్కరుకూడా ఆ పార్టీ వైపు చూడలేదన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అధ్వాన పాలనపై ఆ పార్టీ ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజాప్రతినిధులమని గర్వంగా చెప్పుకునేవారన్నారు. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల విషయం పక్కనబెట్టి, ముందుగా తహ పార్టీని కాపాడుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తామంతా పని చేస్తామని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.
టీడీపీ భంగపాటుకు గురయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.శంకరనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ వారి మనోస్థైర్యం దెబ్బతీయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి కొన్ని చానళ్లు, పత్రికలు వంత పాడుతున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల బలం ఉందని, తమ పార్టీని చీల్చేందుకు టీడీపీకి సాధ్యం కాద న్నారు. తెలంగాణలో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ ఇక్కడ తమ ఉనికిని కాపాడుకునే య త్నంలోనే మైండ్‌గేమ్ ఆడుతున్నారన్నారు. అయినా మునుగుతున్న పడవలోకి ఎవరు ఎక్కుతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కుయుక్తులు మాని రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, లేదా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
టీడీపీలో చేరే ఖర్మ పట్టలేదు కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా
ప్రజల కోసం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఖర్మ తమకు పట్టలేదని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తెలిపారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ జట్టు ఖాళీ అవుతోంది. దీంతో చంద్రబాబు ఇక్కడ మైండ్‌గేమ్ ఆడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ప్రజల మద్ధతుతో గెలిచి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి క్యూ కట్టడం, హైదరాబాద్ నగర ఎన్నికల్లో భంగపాటుకు గురై దిక్కుతోచక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీడీపీ చేరుతున్నారని దుష్ర్పచారం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ పార్టీ వీడే ప్రసక్తేలేదు. ముఖ్యమంత్రి మైండ్‌గేమ్‌ను పక్కనపెట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.