మధ్యాహ్నానికే మహానిమజ్జనం
తొలిసారిగా రికార్డు సమయంలో ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు వైభవోపేతంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ చెంతకు చేరారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.. మరోవైపు భక్త జనుల జయజయ ధ్వానాలు.. బ్యాండు మేళాలు.. యువత కోలాహలం మధ్య ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన ప్రక్రియ తొలిసారిగా రికార్డు సమయంలో పూర్తయ్యింది. ఈసారి బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ఆరు గంటల వ్యవధిలో పూర్తికావడం విశేషం. గురువారం ఉదయం 8.20 గంటలకు పూజాధికాలు ముగించుకుని ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన యాత్ర మొదలైంది.
ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరింది. మధ్యాహ్నం 1.45 గంటలకు క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా భారీ గణనాథుడిని చూసేందుకు వేలాదిగా భక్తజనం తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం
జరగలేదు.
వైభవంగా శోభా యాత్ర..
భాగ్యనగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఎడతెరిపి లేని వర్షంతో ఉదయం కాస్త ఆలస్యంగా నిమజ్జన ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం కాస్త తెరిపినివ్వడంతో నిమజ్జనాలు ఊపందుకుంది. అర్థరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ కొనసాగింది. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జన పర్వాన్ని కొనసాగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్, దిల్సుఖ్నగర్-ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్-ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్-ట్యాంక్‌బండ్, చార్మినార్-హుస్సేన్‌సాగర్, కూకట్పల్లి-లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రధాన మార్గాల్లో కన్నుల పండువగా సాగిన మహానిమజ్జన క్రతువులో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.
సుమారు 388.5 కిలోమీటర్ల మార్గంలో శోభాయాత్ర సాగింది. శోభాయాత్ర మార్గాల్లో 12 వేల సీసీ కెమెరాలు.. 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ వద్ద 23 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి భారీ గణనాథులను గంగ ఒడికి చేర్చారు. నగరంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కొలనుల్లో గురువారం అర్ధరాత్రి వరకు సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు లెక్కగట్టారు. స్వల్ప అపశ్రుతులు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
హోంమంత్రి, డీజీపీ, కమిషనర్ పర్యవేక్షణ
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ అంజనీకుమార్ గురువారం సాయంత్రం ఏరియల్ వ్యూ ద్వారా శోభాయాత్ర మార్గాలను పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్ట్టర్‌లో బయలుదేరిన వీరు నిమజ్జన ఏర్పాట్లు, పరిస్థితుల్ని పరిశీలించారు.
లక్షలు పలికిన లడ్డూలు..
గణపతి లడ్డూల వేలం పాటలో ఎప్పటిలాగానే బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. మేడ్చల్నియోజకవర్గం కీసర ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త కందాడి స్కైలాబ్‌రెడ్డి రూ.14.65 లక్షలకు బాలాపూర్ లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.10.32 లక్షల ధర పలికింది.