
చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్ గణపతి..!
హైదరాబాద్: భారీగా వర్షం కురుస్తున్నా.. భాగ్యనగరంలో గణేష్ శోభాయత్ర వైభవంగా జరుగుతోంది. ప్రజల ఆటపాటలు, భజన కోలాటాలతో మహా గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో సజావుగా ఈ వేడుక కొనసాగుతోంది.
హుస్సేన్ సాగర్‌కు తరలుతున్న గణనాథులతో, ప్రజల ఆటపాటలతో నగరం సందడిగా మారిపోయింది. ఎటుచూసినా కోలాహలమే కనిపిస్తోంది. ఇక చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా ముందుగానే ఖైరతాబాద్ మహగణపతిని నిమజ్జనం పూర్తయింది. అత్యంత కోలాహలం నడుమ ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాగా.. భారీ క్రేన్ సాయంతో గణనాథుడిని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకను చాలామంది ప్రత్యక్షంగా తిలకించారు. గత ఏడాది వరకు అన్ని వినాయకుల నిమజ్జనం పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే.
రికార్డు సమయంలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనోత్సవం ముగియడం విశేషం. ఉదయం 8 గంటలకు శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు ఈసారి ఆరు గంటల్లోనే నిమజ్జనం పూర్తిచేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
సాయంత్రంలోగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దాదాపు గురువారం 30వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. హుస్సేన్ సాగర్ సహా నగరంలో పదిచోట్ల నిమజ్జనోత్సవాలు జరగనున్నాయి. దాదాపు 100 మార్గాల నుంచి గణనాథులు తరలివస్తున్నారు. 225 కిలోమీటర్ల మేర శోభాయాత్రల జరగనున్నట్టు భావిస్తున్నారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో 20వేల ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
గణేష్ నిమజ్జనోత్సవంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్‌బండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా 30వేలమంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.