చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధికుక్కలు
చిలకలూరిపేట రూరల్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న కలేషావలీ అనే ఐదేళ్ల బాలుడిపై బుధవారం సాయంత్రం నాలుగు వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుణ్ని సుమారు 30 అడుగుల దూరం ఈడ్చుకెళ్లగా, స్థానికులు చూసి వెంటపడడంతో వదిలేశాయి.
ఈ ఘటనలో బాలుడి తలపై తీవ్ర గాయాలు కాగా, చేతులు, కాళ్లు, తొడ భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాలుణ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.