kallu chidambaram
-
Kallu Chidambaram: మెల్ల కన్ను లేదు, స్మార్ట్‌గా ఉండేవాడు కానీ..
‘కళ్లు’ చిత్రంలో నటించి ఇంటి పేరు కొల్లూరును కళ్లుగా మార్చేసుకుని, కళ్లు చిదంబరంగా మారిపోయారు. పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే, నాటకాలు వేయిస్తూ, సినిమాలలో నటించారు. తుది శ్వాస వరకు తన జీవితాన్ని నాటక రంగానికి, సేవా కార్యక్రమాలకు, పర్యావరణ పరిరక్షణ కోసమే వినియోగించారు. తండ్రి గురించి రెండో కుమారుడు కొల్లూరు సాయి రాఘవ రామకృష్ణుడు అనేక విషయాలు పంచుకున్నారు. ‘కళ్లు’ చిత్రంలో నటించిన నాన్న కొల్లూరి చిదంబరరావు ‘కళ్లు చిదంబరం’ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. నాన్నగారు ఆగస్టు 8, 1948లో నాగుబాయమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు విజయనగరంలో జన్మించారు. తాతగారు స్కూల్ హెడ్ మాస్టర్. నాన్నగారికి ఒక అన్న, నలుగురు అక్కయ్యలు ఉన్నారు. నాన్నగారే అందరికంటె చిన్నవారు. విజయనగరం మునిసిపల్ హైస్కూల్లో ఎస్. ఎస్. ఎల్. సి, విశాఖపట్నంలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. నాన్నగారికి మేం నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అక్క, అన్నయ్య తరవాత నేను, చెల్లి కవల పిల్లలం. తల్లిదండ్రుల ఆశీస్సులతో అందరం హాయిగా ఉన్నాం. మా అందరికీ నాన్నగారి మీద భయంతో కూడిన గౌరవం ఉంది. నాన్నగారిని ప్రతి రోజు ఏదో ఒక దేవాలయానికి తీసుకువెళ్లేవాడిని. నాన్నగారికి నాటకాలు వేయటం కంటె, చూడటంలోనే ఆసక్తి ఎక్కువ. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, కళాకారులను ప్రోత్సహించారు. విశ్రాంతి లేకపోవటం వల్లే... ప్రముఖ సినిమటోగ్రాఫర్ ఎం. వి. రఘు గారి దర్శకత్వంలో ‘కళ్లు’ చిత్రంలో 1987 డిసెంబర్లో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి, మొదటి చిత్రానికే ఎన్టిఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు. ఆ సంవత్సరమే ‘మద్రాస్ కళాసాగర్ అవార్డ్’ కూడా అందుకున్నారు. పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగికి అంత పేరు రావడంతో, డిపార్ట్మెంట్ నాన్నను ప్రోత్సహించింది. అందరూ అనుకున్నట్లు నాన్నగారికి చిన్నప్పటి నుంచి మెల్ల కన్ను లేదు. చాలా స్మార్ట్‌గా ఉండేవారు. పన్నెండు సంవత్సరాల పాటు నిద్రాహారాలు లేకుండా నాటకాలు నిర్వహిస్తూండటంతో ఒక నరం పక్కకు వెళ్లి, మెల్ల కన్ను ఏర్పడింది. ఆ లోపమే నాన్నగారిని సినీ రంగానికి పరిచయమయ్యేలా చేసింది. నాటకం చూశారు.. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నాటకాన్ని చూసి, సినిమాగా తీయటం కోసం, సినిమా డైరెక్టర్ అండ్ టీమ్ వస్తారని తెలిసి, ‘నాటకం నాటకంలా ఉండాలే కాని, సినిమాగా తీయకూడదని, నాటకంలో నటించన’ని నాన్న పట్టుబట్టారు. ‘మీ కోసం కాకపోయినా, మా కోసమైనా రండి’ అని అందరూ అడగటంతో, అయిష్టంతోనే ఆ నాటకం వేశారు. డైరెక్టర్ రఘుగారు అందరినీ వదిలేసి, నాన్నగారిని ఎంపిక చేయటంతో, నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. ‘ఆ ఒక్క సినిమా చేసి ఆపేద్దాం’ అనుకున్నారు. కాని చెవిలోపువ్వు, ఆర్తనాదం, ముద్దుల మావయ్య... ఇలా 300 చిత్రాలలో నటించారు. భయపడ్డాం... కళ్లు సినిమా షూటింగ్ వైజాగ్‌లోనే జరగటం వల్ల ఒక్కో రోజు ఆ మేకప్‌తోనే ఇంటికి వచ్చేవారు. ఒక రోజున... రక్తం కారుతున్న మేకప్‌తోనే ఇంటికి వచ్చారు. మాకు భయం వేసింది. అప్పుడు నా వయసు పదేళ్లు. ఆ సీన్లో నాన్నగారు, కుక్కని పట్టుకుని, ‘కళ్ళు లేని కబోదిని రామా (నాటకం అంతా కళ్ళు ఉంటాయి. లే నట్లు నటిస్తారు), దయగల వారు ధర్మం చేసుకోండి రామా, లేకపోతే కుక్క బతుకు తప్పదు రామా’ అని కుక్క వైపు చూపిస్తూ అడుక్కుంటారు. ఆ డైలాగు మాకు చాలా ఇష్టం. మానేద్దాం అనుకున్నారు.. సినిమాలలో బిజీ కావటంతో, చేస్తున్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు. మా మేనత్త గారి సలహా మేరకు ఆ ఆలోచన మానుకుని, పాతికేళ్లు వైజాగ్ నుంచి హైదరాబాద్ ప్రయాణించారు. అప్పుడప్పుడు రిజర్వేషన్ లేక, అప్పటికప్పుడు టికెట్ తీసుకుని, టీటీ చుట్టూ సీట్ కోసం తిరిగేవారు. ‘అనవసరంగా ఎందుకు కష్టపడుతున్నారు నాన్నా మీరు’ అనేవాళ్లం. ‘నా కోసం కాదురా, సమాజం కోసం, పరిశ్రమ కోసం’ అనేవారు. కుటుంబ జీవితం మిస్ కాకుండా, ఆఫీస్ విడవకుండా సినిమాలలో నటించారు. పారితోషికం ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. మంచి పేరు సంపాదించారు. నాన్నే ఉండాలన్నారు వర్మ... ‘గోవిందా గోవిందా’ సినిమాలో ‘నేను ఈ నటుడితో నటించను’ అని శ్రీదేవి అన్నారట. అప్పుడు వర్మగారు, ‘ఈయన అసిస్టెంట్ ఇంజినీర్, నంది అవార్డు అందుకున్న నటుడు, ఆయన ఉంటేనే ఈ రోజు నేను డైరెక్ట్ చేస్తాను’ అనటంతో శ్రీదేవి ఒప్పుకున్నారట. ‘అమ్మోరు’ సినిమా విడుదలయ్యాక అందరూ నాన్నను ‘అమ్మోరు తల్లీ’ అని పిలిచేవారు. ఐసియూలో ఉండి కూడా.. విశాఖ కళాకారులకి ఏదో ఒకటి చేయాలనే తపనతో చివరి రోజుల్లో సినిమాలు వదిలిపెట్టి, ‘కళలు వేరైనా కళాకారులు ఒక్కటే’ అనే నినాదంతో ‘సకల కళాకారుల సమాఖ్య’ స్థాపించి కళాకారులను ప్రోత్సహించారు. 2013 మే నెలలో ఊపిరితిత్తుల సమస్య రావటంతో ఇంటికే పరిమితమయ్యారు. రెండున్నర సంవత్సరాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మీదే ఉంటూ, వైజాగ్‌లో అన్ని కార్యక్రమాలకు వెళ్లేవారు. ఐసియులో ఉండి కూడా, ‘రాఘవేంద్ర మహత్యం’ నాటకం వేయించినప్పుడు, ‘అనారోగ్యంతో ఉండి కూడా ఇంత చక్కగా వేయించారు’ అని అందరూ ఆశ్చర్యపోయారు. 2015 అక్టోబర్ 19న నవ్వు ముఖంతోనే కాలం చేశారు. ‘ఇచ్చిన మాట తప్పకూడదు. డబ్బు పోయినా పరవాలేదు, పరువు పోకూడదు. రేపు అనేది ఉండదు. ఈ రోజే చేసేయాలి’ అని నాన్నగారు చెప్పిన మాటలను ఇప్పటికీ రోజూ గుర్తు చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు ఆచరిస్తున్నాం. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
నడిచే ఉద్యమం
జీవన కాలమ్ కొందరు పరిమితమైన ఆవరణలో పవిత్రమైన కలువ పువ్వులాగ దర్శనమిస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ మంచితనంతో, సౌహార్దంతో అలంకరిస్తారు. వేళ మించి పోగానే గంభీరంగా శలవు తీసుకుంటారు. ఆ కలువ పువ్వు పేరు- కళ్లు చిదంబరం. కళ్లు చిదంబరానికీ నాకూ బంధుత్వముంది. దాదాపు 34 సంవత్సరాల కిందట- మిత్రు డు రఘు నా కళ్లు నాటికను చిత్రంగా తీయాలని తలపెట్టి నప్పుడు- అందులో భాగమ యిన విశాఖ నటుడు చిదం బరం. చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరం. కాని ఆనాడు కళ్లు సినీమాలో నటించి మొదటి చిత్రం లోనే నంది అవార్డ్డుని తీసుకుని ఇంటి పేరుని నా రచన పేరుని చేసుకున్న మంచి నటుడు చిదంబరం. నాలాగే అతనూ విజయనగరంలో పుట్టాడు. అదీ మా బంధు త్వం. విచిత్రమేమిటంటే చిదంబరం పాత్ర నా నాటి కలో లేదు. లేని పాత్రని సృష్టించిన ఘనత రఘుదయితే దానికి ప్రాణం పోసి ఆ పాత్ర కారణంగా తన ఇంటి పేరునే చేసుకున్న ఘనత చిదంబరానిది. అంతేకాదు- ఉత్తరాంధ్ర యాసకు ప్రాచుర్యాన్నీ, ఒక పదునునీ తీసు కొచ్చిన ఘనత చిదంబరానిది. సరిగ్గా 45 సంవత్సరాల కిందట ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో విజయ వాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో కళ్లు నాటికను ప్రదర్శించిన ప్పుడు-పోటీ సమాజాలలోని నటులు- పోటీ ప్రమే యం లేకుండా నన్ను తమ చేతుల మీద ఎత్తుకుని ఊరేగించారు. అలా ఊరేగించిన వారిలో ఎమ్.వి.రఘు, జంధ్యాల వంటి వారెందరో ఉన్నారు. ఓ రచయిత కృషికి అది గొప్ప బహుమతి. తర్వాత సినీమా. చిదంబరం విలక్షణమయిన నటుడు. నార్మన్ విస్డమ్ లాగ అతని ముఖమే పెద్ద కేరికేచర్. కేరికేచర్లో ఒక లాభం ఉంది. ఒక నష్టం ఉంది. ప్రేక్షకులను కొట్ట వచ్చినట్టు ఆకర్షిస్తుంది. (కేరికేచర్‌తో ఒక పాత్రను చిర స్మరణీయం చేసిన సృష్టికర్త కె.వి.రెడ్డి, నటించిన నటుడు రేలంగి. పాత్ర మాయాబజారులో ఉత్తరుడు.) ఆయితే దర్శకుడు దానినే వాడుకుంటే- అదే దృశ్యం ఎప్పుడూ అలాగే కనిపిస్త్తుంది. ఇది మొనాటినీ. చర్విత చర్వణం అయిపోతుంది. ఇది నటుడి పరిణతికి పరిమితమైన ప్రయోజనం. రొటీన్. తెలివయిన నటుడు అర్థం చేసుకుని అధిగమి స్తాడు. ఇది సవాలు. తన నటనా జీవితంలో ఆయా చిత్రాలలో టైప్ కాస్టింగ్ చేసిన ఎన్నో సందర్భాలను అధిగమించి తనదైన ముద్రని వేసుకున్నారు చిదంబరం. చంటి, అమ్మోరు, పెళ్లి పందిరి, గోవింద గోవింద ఇందుకు నిదర్శనాలు. శుభలేఖ సినీమాలో చిదంబరం పెళ్లిచూపు లకు వస్తాడు. మెల్లకన్ను. అతను పక్కన నిలబడిన అత్తగారిని చూస్తున్నాడు- తదేకంగా. పెళ్లి పెద్ద ఇబ్బంది పడిపో యాడు. బాబూ, పెళ్లి కూతురు ఇటువేపు ఉంది బాబూ అన్నాడు చెప్పలేక చెప్పలేక. తండ్రి ఇబ్బందిగా మా వాడు పెళ్లి కూతురునే చూస్త్తున్నాడండీ అన్నాడు. ఈ సీను ఊహిస్తూ ఓ రోజంతా నవ్వుకున్నాం నేనూ, కె.విశ్వనాథ్‌గారూ. తీరా ఈ సీను చిత్రంలో ఉందో లేదో నాకు గుర్తులేదు. కాని మిత్రుడు చిదంబరంతో మాట్లాడి నప్పుడు తరుచు నాకీ సీను గుర్తొస్తుంది. అయితే ఇది కేవలం చిదంబరం వ్యక్తిత్వంలో ఒక పార్శ్వం. గొప్ప ఉద్యమకారుడు. ఎప్పుడూ సాటి నటుల గురించి, తనతో ప్రయాణం చేసే సోదర కళాకా రుల గురించీ తాపత్ర యపడే మనిషి. విశాఖలో సకల కళాకారుల సమాఖ్యని ప్రారంభించాడు. పేద కళాకారు లకు ఆర్థిక సహాయాన్ని అందించాడు. చదువు చెప్పిం చుకోలేని పేద కళాకారుల పిల్లలకు జీతాలు, పుస్తకాలు వంటివి సమకూర్చే ఏర్పాట్లు చేశాడు. అన్నిటికంటే విశేషమైన ఉపకారం- ఈ ప్రాంతంలో ఏ కళాకారుడు కన్నుమూసినా-అంతరాలతో ప్రమేయం లేకుండా వెంటనే సమాఖ్య ఖాతాలోంచి రెండువేల రూపాయలు ఆ కుటుంబానికి చేరుతుంది. చివరి రోజుల్లో ఆరోగ్యం బొత్తిగా చెడింది. పక్కనే ఆక్సిజన్ సిలెండర్ పెట్టుకుని ముక్కుకి గొట్టం పెట్టు కుంటే తప్ప కూర్చోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలోనూ సభ లను నిర్వహించాడు! ఆ మధ్య- విశాఖ కళాకారులకు మాత్రమే సన్ని హితుడైన మరో ఉద్యమకారుడు- అతి మామూలు మనిషి- కష్టంలో కొండంత మనస్సుతో నిలవగలిగిన ఒక వ్యక్తి- మొక్కల మోహన్ కన్నుమూశాడు. మా అందరికీ ఆప్తుడు. చిదంబరం పేరు పేరునా అందరికీ ఫోన్ చేశాడు. నాకయితే అరడజను సార్లు ఫోన్ చేశాడు. అంత నిస్సహాయత లోనూ- వచ్చి సభను నిర్వహించాడు. తాను రాలేని సభలను- రాకపోయినా- నిర్వహించిన సందర్భాలు నాకు తెలుసు. మంచితనం మీదా, స్నేహం మీదా, సౌహార్ద్రం మీదా, పక్కవాడికి చెయ్యగల సహాయం మీదా కొం డంత నమ్మకంగల వ్యక్తి. మొన్న చెన్నైలో ఉన్న నాకు విశాఖ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి కళ్లు చిదంబరం గారు ఆసుపత్రిలో చేరారు అన్నారు. అప్పటి నుంచీ ఆయనకి ఫోన్ చేస్తున్నాను. మధ్యాహ్నానికి వారి అబ్బాయి పలికాడు. నాన్నగారు వెళ్లిపోయారు- అదీ వార్త. కొందరు పరిమితమైన ఆవరణలో పవిత్రమైన కలువపువ్వులాగ దర్శనమిస్తారు. తమచుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ మంచితనంతో, సౌహార్ద్రంతో అలంక రిస్తారు. వేళ మించిపోగానే గంభీరంగా సెలవు తీసుకుం టారు-నిస్సహాయంగా కాదు. తృప్తిగా, హుందాగా, గర్వంగా. కారణం- తమ ఉనికిని, తమ సౌజన్యాన్ని పంచిన ఆవరణ వారి చుట్టూ వెలుగుతూంటుంది. ఆ కలువ పువ్వు పేరు- కళ్లు చిదంబరం. గొల్లపూడి మారుతీరావు -
శాశ్వత నిద్రలోకి ‘కళ్లు’
-
అదే ఆయన జీవితానికి టర్నింగ్ పాయింట్
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర మాండలికంతో తెలుగు తెరపై హాస్య గుళికలు రంగరించిన కళ్లు చిదంబరం మృతి పట్ల పలువురు సినీ, సాహితీప్రియులు, కళారంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిదంబరం తన అద్భుతమైన నటనతో సినీ పరిశ్రమలో విశాఖకు ఖ్యాతి తెచ్చారని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. నాటక రంగంలో ఎన్నో వ్యయప్రయాసలను భరించి, చేసిన కృషి చిత్రరంగప్రవేశం తర్వాత కొంత ఊరట కలిగించినా రంగస్థల కళాకారులకు మాత్రం నాటక రంగం ఇచ్చిన తృప్తి సినిమా రంగం ఇవ్వలేదని అడిగిన వారందరికీ చిదంబరం చెబుతుండేవారని ఆయన సన్నిహితులు అంటున్నారు. రంగస్థలంపై ప్రదర్శన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రత్యక్ష అభినందనలు, ఆశీస్సులు, చప్పట్లు కళాకారుడికిచ్చే ఆనందం వెలకట్టలేనిదని, ఆ సంతృప్తి సినిమా ఇవ్వదని ఆయన చెబుతుండేవారు.14 ఏళ్ల పాటు సాంస్కృతిక రంగంలో సేవలందించి, తరువాత వెండితెరపై మెరిసి, ప్రశాంత, ఆధ్యాత్మిక, కళాత్మక జీవితం గడిపి తుదిశ్వాస విడిచిన కళ్లు చిదంబరం గురించి ఆయన సన్నిహితులు ఇలా స్పందించారు. సాహిత్యగ్రంథ పోషకుడు విశాఖ కళారంగంతోపాటు సాహిత్యరంగాన్ని ఆయన పోషించారు. గత మార్చి నెలలో వేమగంటి వాసుదేవరావు రచించిన ‘శ్రీరాగవేంద్రస్వామి మహోత్మ్యం’గ్రంథాన్ని కళ్లు చిదంబరం సొంత నిధులతో ముద్రించి ఆవిష్కరించారు. దీంతో రచయిత వాసుదేవరావు కళ్లు చిదంబరం తల్లిదండ్రులకు ఆ గ్రంథాన్ని అంకితం చేశారు. ప్రముఖ రంగస్థల నటుడు మీసాల రామలింగేశ్వర స్వామి రచించిన గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. సకల కళాకారుల సమాచార దీపికను ఆయన సొంత నిధులతో ముద్రించి కళాకారులకు అందించారు. విశాఖ సాహితీ సంస్థ ద్వారా అనేక గ్రంథాలను ఆవిష్కరించారు. కళారంగానికి ఆయన లేని లోటు తీరనిది. - కావలిపాటి నారాయణరావు, కార్యదర్శి, విశాఖ సాహితి ఆయన కోసమే పాత్ర క్రియేట్ చేశా... చిదంబరం నాతో కొన్ని నాటకాలు వేశారు. తనికెళ్ళ భరణి రచించిన రైలుబండి, ఛల్చల్ గుర్రం నాటికల్లో బాగా నటించారు. దీంతో మా నాటకరంగం కళ్లు సినిమాలో ఆయన్ను రికమెండ్ చేసింది. ఆ సినిమాకు కో-డెరైక్టర్‌గా చేసినప్పుడు కళ్ళు చిదంబరం కోసం క్యారెక్టర్‌ను క్రియేట్ చేశా. సంభాషణలు నడిమింటి నరసింగరావు రాశారు. అదే ఆయన జీవితానికి టర్నింగ్ పాయింట్. - ఎల్.సత్యానంద్, స్టార్‌మేకర్ సినీ దర్శకుడు కుటుంబ సన్నిహితుడు కళ్లు చిదంబరం లేకపోవడం కళారంగానికే కాకుండా వ్యక్తిగతంగా నాకు ఎంతో లోటు. ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. మేము 2003లో స్థాపించిన క్రియేటివ్ కామెడీ క్లబ్‌కు ఆయన గౌరవ అద్యక్షుడు. ఈ సంస్థకు ఎంతో సహకారం అందించారు. ఎందరో పేద కళాకారులకు అండగా నిలిచిన వ్యక్తి. కళాకారుల కోసం స్థాపించిన సకల కళాకారుల సంస్థ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవడం వల్ల పూర్తిస్థాయిలో దాని ద్వారా సేవలందలేదు. - మేడా మస్తాన్ రెడ్డి, క్రియేటివ్ కామెడీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విశాఖ కళారంగానికి తీరని లోటు విశాఖ కళాకారులకు, సినీ పరిశ్రమకు, తెలుగు నాటకరంగానికి కళ్ళు చిదంబరం మృతి తీరని లోటు. హాస్యనటనలో ఆయన లేని లోటును భర్తీ చేయలేనిది. మా తండ్రిగారు బి.ఎస్.చలం గారి పేరుతో ప్రతి ఏటా నిర్వహించే నాటక ప్రదర్శనలకు ఆయన వచ్చి కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవారు. ప్రస్తుతం కళాకుటుంబాన్ని వదిలిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. - బి. చిన్నికృష్ణ, సినీ దర్శకుడు ప్రముఖుల నివాళి అక్కయ్యపాలెం : సినీనటుడు కళ్లు చిదంబరం పార్ధివదేహాన్ని అబిద్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో పలువురు సినీ, రంగస్థల, రాజకీయ, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తైనాల విజయకుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ ఆలీ, 32వ వార్డు అధ్యక్షుడు కె.విబాబా, సినీ నటులు మిశ్రో, కాశీ విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, సకల కళాకారుల సమాఖ్య ప్రతినిధి భాదంగీర్ సాయి, విశాఖ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు కొసనా, శివజ్యోతి, లెబెన్‌షిల్ఫే సరస్వతి, లోక్‌సత్తా నాయకులు వేణుగోపాల్, మూర్తి, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధి ఎ.ఎం.ప్రసాద్, కుటుంబ సన్నిహితులు వెంకటేష్, వేణుగోపాల్, వంశీ, విజయ తదితరులు నివాళులు అర్పించారు. విశాఖ-కల్చరల్ : విశాఖ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు రొక్కం కామేశ్వరరావు కళ్లు చిదంబరం మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడుతూ హాస్యానికి నిర్వచనం చిదంబరమన్నారు. కార్యదర్శి శ్యామ్‌సుందర్, దర్శక నటులు గొండేల సూర్యానారాయణ, కవి అప్పలరాజు, కేదార్మాస్టార్లు చిదంబరం భౌతికకాయానికి నివాళులర్పించారు. -
శాశ్వత నిద్రలోకి ‘కళ్లు’
విశాఖ-కల్చరల్: ఉత్తరాంధ్ర మాండలికంలో ‘‘ఓలమ్మోలమ్మో నేనేటి సేసేది’’ లాంటి డైలాగులతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన కళ్లు చిదంబరం (70) ఇకలేరు. కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరంలో 1945 అక్టోబర్ 10న జన్మించిన కొల్లూరు చిదంబరం విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. 36వ ఏట ఒక కన్ను మెల్లకన్నుగా మారడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తికాలం నాటక, సినిమా రంగాలకు అంకితమయ్యారు. 1989లో ఎం.వి.రఘు దర్శకత్వంలో వచ్చిన కళ్లు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అందులో అంధుని పాత్రలో మెప్పించారు. దీంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చిదంబరం 300 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ హాస్యపాత్రలే. కళ్లు, అమ్మోరు చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. జంబలకిడిపంబ, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, మనీ, గోవింద గోవింద, పెళ్లిచేసుకుందాం, ఒట్టేసి చెబుతున్నా, సీతయ్య, మృగరాజు, శ్వేతనాగు, కొండవీటి దొంగ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. చిదంబరం మృతితో తెలుగు చిత్రసీమ మరో మంచి హాస్యనటుడిని కోల్పోయిందని సహనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరో తరగతి నుంచే.. విజయనగరం మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతుండగానే ‘కోయదొర’ అనే విచిత్ర వేషధారణ వేశారు. ఆ తర్వాత 1962 సంవత్సరం ‘బ్రహ్మచారులు’ నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం చేసి 36 నాటికలు, నాటకాల్లో నటించారు.నాటకరంగంపై మక్కువతో దాదాపు 14 ఏళ్లపాటు సాంస్కృతిక కార్యకలాపాల్లో అవిశ్రాంతంగా పాల్గొన్నారు. దీనివల్ల ఒక కంటి నరం దెబ్బతినడంతో 36 ఏళ్ల వరకూ సవ్యంగానే ఉన్న ఆ కన్ను పూర్తి మెల్లకన్నుగా మారిపోయింది. అలా అయినా బాధపడకుండా యథాతథంగా నాటకాలు వేశారు. వాణి ఆర్ట్స్ అసోసియేషన్ పేరుతో నాటికలు, నాటకాల పోటీల్లో పాల్గొన్నారు. వెండితెరపై మెరిసిన ఆ ‘కళ్లు’ ఎటువైపు చూస్తున్నాడో తెలియని తన మెల్లకన్నుతోనే వెండితెరపై చిదంబరం హాస్యగుళికలు చల్లారు. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నాటకాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రఘు ప్రయత్నిస్తున్న సందర్భంలో.. ఆ సినిమాలో నటించాలని చిదంబరాన్ని ప్రముఖ దర్శకుడు ఎల్.సత్యానంద్ కోరారు. దీనికి చిదంబరం అంగీకారం తెలిపారు. కళ్లు సినిమా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకోవడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. చిదంబరానికి నంది పురస్కారం, కళాసాగర (మద్రాస్) పురస్కారం లభించాయి. అప్పటి నుంచి చిదంబరం జీవితం మలుపు తిరిగింది. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర, ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో అమాయకంగా మేకను కొనేవాడి పాత్ర ఆయన హాస్యగుళికల్లో మచ్చుకు కొన్ని. ఇక నాటకరంగంలో భజంత్రీలుతో తన ప్రస్థానం మొదలు పెట్టారు. తోలుబొమ్మలాట, ట్రీట్మెంట్, పండగొచ్చింది, చల్‌చల్ గుర్రం, రైలుబండి, సిప్పొచ్చింది, గప్చిప్, ఎవ్వనిచే జనించు, వశీకరణం వంటి నాటికల్లో నటించారు. ప్రొఫైల్ అసలు పేరు: కొల్లూరు చిదంబరం జననం: అక్టోబర్ 10 1945 సొంతవూరు: విజయనగరం తండ్రి: కొల్లూరు వెంకట సుబ్బారావు,టీచర్ తల్లి: నాగభాయమ్మ, గృహిణి విద్యార్హత: ఎస్ఎస్ఎల్సీ, (విజయనగరం మున్సిపల్ హైస్కూల్) పాలిటెక్నికల్ సివిల్ విశాఖపట్నం వృత్తి: విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుటుంబం: భార్య, నలుగురు పిల్లలు (ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు) రంగస్థల ప్రవేశం: 1958 సంవత్సరంలో 6వ తరగతిలో ‘కోయదొర’ విచిత్ర వేషధారణ. తొలిచిత్రం: గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నటించిన చిత్రాలు: 300 చిత్రాలు కళాకారులకు సేవ.. నాటకరంగ కళాకారుల కోసం 2009లో విశాఖలో 1,180 మంది కళాకారులతో ‘సకల కళాకారుల సమాఖ్య’ అనే సంస్థను స్థాపించి చిదంబరం పలు సేవలందించారు. కళలు వేరైనా కళాకారులంతా ఒకటే అని భావించి సాహిత్యం, సంగీతం, వాయిద్యం, నాట్యం, మ్యూజిక్, మిమిక్రీ, హరికథ, బుర్రకథ, చిత్రలేఖనం కళాకారులను సభ్యులుగా చేర్చుకుని వారిలో ఐకమత్యం తీసుకురాగలిగారు. పేద కళాకారులకు పింఛను, వారి పిల్లలకు ఉచితంగా స్టేషనరీ, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రూ. 10,000 చొప్పున ప్రోత్సాహకం, కళాకారుడెవరైనా చనిపోతే.. గంటలోనే తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 2,000 వారి కుటుంబానికి అందజేయడం. గుర్తింపు కార్డు చూపించిన కళాకారులకు మెడికల్ షాపుల్లో 15 శాతం డిస్కౌంట్, ల్యాబొరేటరీలో 20 శాతం డిస్కౌంట్, పబ్లిక్ స్కూళ్లలో 20 శాతం డిస్కౌంట్లు కల్పించి పేద కళాకారుల హృదయాల్లో చిరస్మరణీయంగా చిదంబరం నిలిచిపోయారు. విశాఖలో ఎక్కువకాలం నివసించిన ఆయన.. అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆ ప్రాంతంపై ఎనలేని మక్కువ చూపారు. -
లవ్ యూ డాడీ.. మిస్ యూ
-
హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత
-
హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత
విశాఖపట్నం: ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించారు. ఆయన 'కళ్లు' చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందారు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. కళ్లు, అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపెందిరి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు తదితర చిత్రాల్లో నటించారు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.