అదే ఆయన జీవితానికి టర్నింగ్ పాయింట్
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర మాండలికంతో తెలుగు తెరపై హాస్య గుళికలు రంగరించిన కళ్లు చిదంబరం మృతి పట్ల పలువురు సినీ, సాహితీప్రియులు, కళారంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిదంబరం తన అద్భుతమైన నటనతో సినీ పరిశ్రమలో విశాఖకు ఖ్యాతి తెచ్చారని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. నాటక రంగంలో ఎన్నో వ్యయప్రయాసలను భరించి, చేసిన కృషి చిత్రరంగప్రవేశం తర్వాత కొంత ఊరట కలిగించినా రంగస్థల కళాకారులకు మాత్రం నాటక రంగం ఇచ్చిన తృప్తి సినిమా రంగం ఇవ్వలేదని అడిగిన వారందరికీ చిదంబరం చెబుతుండేవారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
రంగస్థలంపై ప్రదర్శన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రత్యక్ష అభినందనలు, ఆశీస్సులు, చప్పట్లు కళాకారుడికిచ్చే ఆనందం వెలకట్టలేనిదని, ఆ సంతృప్తి సినిమా ఇవ్వదని ఆయన చెబుతుండేవారు.14 ఏళ్ల పాటు సాంస్కృతిక రంగంలో సేవలందించి, తరువాత వెండితెరపై మెరిసి, ప్రశాంత, ఆధ్యాత్మిక, కళాత్మక జీవితం గడిపి తుదిశ్వాస విడిచిన కళ్లు చిదంబరం గురించి ఆయన సన్నిహితులు ఇలా స్పందించారు.
సాహిత్యగ్రంథ పోషకుడు
విశాఖ కళారంగంతోపాటు సాహిత్యరంగాన్ని ఆయన పోషించారు. గత మార్చి నెలలో వేమగంటి వాసుదేవరావు రచించిన ‘శ్రీరాగవేంద్రస్వామి మహోత్మ్యం’గ్రంథాన్ని కళ్లు చిదంబరం సొంత నిధులతో ముద్రించి ఆవిష్కరించారు. దీంతో రచయిత వాసుదేవరావు కళ్లు చిదంబరం తల్లిదండ్రులకు ఆ గ్రంథాన్ని అంకితం చేశారు.
ప్రముఖ రంగస్థల నటుడు మీసాల రామలింగేశ్వర స్వామి రచించిన గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. సకల కళాకారుల సమాచార దీపికను ఆయన సొంత నిధులతో ముద్రించి కళాకారులకు అందించారు. విశాఖ సాహితీ సంస్థ ద్వారా అనేక గ్రంథాలను ఆవిష్కరించారు. కళారంగానికి ఆయన లేని లోటు తీరనిది.
- కావలిపాటి నారాయణరావు, కార్యదర్శి, విశాఖ సాహితి
ఆయన కోసమే పాత్ర క్రియేట్ చేశా...
చిదంబరం నాతో కొన్ని నాటకాలు వేశారు. తనికెళ్ళ భరణి రచించిన రైలుబండి, ఛల్‌చల్ గుర్రం నాటికల్లో బాగా నటించారు. దీంతో మా నాటకరంగం కళ్లు సినిమాలో ఆయన్ను రికమెండ్ చేసింది. ఆ సినిమాకు కో-డెరైక్టర్‌గా చేసినప్పుడు కళ్ళు చిదంబరం కోసం క్యారెక్టర్‌ను క్రియేట్ చేశా. సంభాషణలు నడిమింటి నరసింగరావు రాశారు. అదే ఆయన జీవితానికి టర్నింగ్ పాయింట్.
- ఎల్.సత్యానంద్, స్టార్‌మేకర్ సినీ దర్శకుడు
కుటుంబ సన్నిహితుడు
కళ్లు చిదంబరం లేకపోవడం కళారంగానికే కాకుండా వ్యక్తిగతంగా నాకు ఎంతో లోటు. ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. మేము 2003లో స్థాపించిన క్రియేటివ్ కామెడీ క్లబ్‌కు ఆయన గౌరవ అద్యక్షుడు. ఈ సంస్థకు ఎంతో సహకారం అందించారు. ఎందరో పేద కళాకారులకు అండగా నిలిచిన వ్యక్తి. కళాకారుల కోసం స్థాపించిన సకల కళాకారుల సంస్థ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవడం వల్ల పూర్తిస్థాయిలో దాని ద్వారా సేవలందలేదు.
- మేడా మస్తాన్ రెడ్డి, క్రియేటివ్ కామెడీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు
విశాఖ కళారంగానికి తీరని లోటు
విశాఖ కళాకారులకు, సినీ పరిశ్రమకు, తెలుగు నాటకరంగానికి కళ్ళు చిదంబరం మృతి తీరని లోటు. హాస్యనటనలో ఆయన లేని లోటును భర్తీ చేయలేనిది. మా తండ్రిగారు బి.ఎస్.చలం గారి పేరుతో ప్రతి ఏటా నిర్వహించే నాటక ప్రదర్శనలకు ఆయన వచ్చి కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవారు. ప్రస్తుతం కళాకుటుంబాన్ని వదిలిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.
- బి. చిన్నికృష్ణ, సినీ దర్శకుడు
ప్రముఖుల నివాళి
అక్కయ్యపాలెం : సినీనటుడు కళ్లు చిదంబరం పార్ధివదేహాన్ని అబిద్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో పలువురు సినీ, రంగస్థల, రాజకీయ, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తైనాల విజయకుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ ఆలీ, 32వ వార్డు అధ్యక్షుడు కె.విబాబా, సినీ నటులు మిశ్రో, కాశీ విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, సకల కళాకారుల సమాఖ్య ప్రతినిధి భాదంగీర్ సాయి, విశాఖ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు కొసనా, శివజ్యోతి, లెబెన్‌షిల్ఫే సరస్వతి, లోక్‌సత్తా నాయకులు వేణుగోపాల్, మూర్తి, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధి ఎ.ఎం.ప్రసాద్, కుటుంబ సన్నిహితులు వెంకటేష్, వేణుగోపాల్, వంశీ, విజయ తదితరులు నివాళులు అర్పించారు.
విశాఖ-కల్చరల్ : విశాఖ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు రొక్కం కామేశ్వరరావు కళ్లు చిదంబరం మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడుతూ హాస్యానికి నిర్వచనం చిదంబరమన్నారు. కార్యదర్శి శ్యామ్‌సుందర్, దర్శక నటులు గొండేల సూర్యానారాయణ, కవి అప్పలరాజు, కేదార్‌మాస్టార్‌లు చిదంబరం భౌతికకాయానికి నివాళులర్పించారు.