కాంగ్రెస్కు కాయకల్ప చికిత్స
నేడు పార్టీ నేతలు రఘువీర, బొత్స, కేవీపీ, సీఆర్సీ రాక
కడప అగ్రికల్చర్ : రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారింది. దీంతో జిల్లాలో పార్టీ ఉనికి కష్టంగా మారింది. ఈ తరుణంలో పార్టీకి జవసత్వాలు నింపేందుకు కాయకల్ప చికిత్సకు పార్టీ రాష్ట్ర నేతలు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నగరంలోని ఇందిరా భవన్లో జిల్లాలోని పార్టీ ప్రతినిధులతో, శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతోనూ, రాష్ట్ర నేతలు ప్రతినిధులతో, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యవర్గంతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత విడివిడిగా నియోజకవర్గాల నాయకులను పార్టీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల, ద్వితీయ శ్రేణి నాయకుల బాగోగులు చూడని రాష్ట్ర నేతలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ సమీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తనను విస్మరించిందని అధ్యక్షుడు మాకం అశోక్ కుమార్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ కూడా పార్టీ వీడారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వీరశివ, వరద రాజులరెడ్డి, శివరామకృష్ణయ్య పార్టీని వీడి టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు పార్టీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు.
పార్టీలో ప్రముఖులుగా ఉన్న వారెవరూ లేకపోవడంతో పార్టీకి కళ తప్పింది. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రనేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీచేసిన వారికి నయాపైసా కూడా ఇవ్వకపోవడంతో పోటీలో ఉన్న తాము పరువు పోతుందని పార్టీ కోసం వైదొలగకుండా పోటీచేసినందుకు అప్పులు మిగిలాయని కొందరు బాహటంగా విమర్శిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని ఈ సమీక్షలో చర్చించి నేతలను నిలదీస్తామని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.