KALWAKURTHY lift irrigation scheme
-
బ్లాస్టింగే ముంచిందా?
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌తో పాటు అప్రోచ్ చానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ల వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) పరిధిలోని పంపులు నీట మునిగాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌లోకి నీళ్లు రావడానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంపుహౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అండర్ టన్నెల్ (సొరంగం) పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దాని వల్ల లీకేజీలు, స్లాబ్ క్రాక్‌లు, అద్దాలు పగిలిపోతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతేడాది ఆగస్టు 7న పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్, కేఎల్ఐ ఎస్ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలిపించారు. వారు టన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. కానీ పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. అయితే.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారిని కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా పటేల్ కంపెనీ వారు కోరారు. ప్రస్తుతం పనులు చేపడుతున్న మెగా కంపెనీ ఇటీవల రెగ్యులర్‌గా నిర్వహించిన బ్లాస్టింగ్ల వల్లనే ప్రమాదం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా డీవాటరింగ్ చేస్తేనే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్) గోడల్లో పగుళ్లు అయితే బ్లాస్టింగ్ వల్లనే పంపుహౌస్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటార్ బేస్మెంట్ కూడా పగిలిపోయింది. సర్జ్‌పూల్ షట్టర్లు మూసివేసినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అప్రోచ్ చానల్ గేట్లు మూసినా నీళ్లు వస్తున్నాయి. 95 మీటర్ల మేర పంపులు మునిగిపోయాయి. నీటి తోడివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గితేనే నీటిని తోడటం సాధ్యమవుతుందని తెలుస్తోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3.40 లక్షల ఎకరాలకు సాగుతో పాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లోని సుమారు 3,088 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సరఫరా అవుతుంది. పంపులు నీట మునగడం వల్ల ఈ గ్రామాలన్నింటికీ తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీవాటరింగ్ను వెంటనే ప్రారంభించడంతో పాటు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లోని సర్పంచులకు ఇప్పటికే తాగునీటి కోసం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది. (చదవండి: నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు) -
‘కల్వకుర్తి’పై మీ వివరణేంటి?
ఏపీ ఫిర్యాదుపై స్పందించాలి తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ చేసిన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఏపీ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని మంగళవారం కృష్ణా బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. ఏపీ చేసిన ఫిర్యాదుతోపాటు, సెప్టెంబర్ 8న సామర్ధ్యం పెంచుతూ తెలంగాణ ఇచ్చిన జీవో 141 ప్రతిని లేఖతో జత చేసింది. ఇదిలాఉండగా, కృష్ణా బోర్డుకు ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించిన విషయం తెలిసిందే. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని వాడుకుంటున్నామని, గతంలో నిర్ణయించిన 25 టీఎంసీల నీటితో నిర్ణీత 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కానందునే సామర్ధ్యాన్ని 40 టీఎంసీలకు పెంచామని వివరణ ఇచ్చారు. కల్వకుర్తి ద్వారా 2 టీఎంసీల నీటిని మంచినీటికి, మరో 1.5 టీఎంసీ ప్రవాహంలో ఆవిరైపోయే దృష్ట్యా, మిగిలే 21.5 టీఎంసీలతో కేవలం 2.15 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వొచ్చని, ఈ నేపథ్యంలో నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలంటే 40 టీఎంసీలు అవసరమని వివరించారు. ఇదే వివరాలతో తెలంగాణ బోర్డుకు లేఖ రాసే అవకాశాలున్నాయి. డిసెంబర్ 16న సమావేశం.. కాగా, వచ్చేనెల 16న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిం ది. ఇందులో ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ పరమైన అంశాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలపై చర్చిద్దామని అందు లో స్పష్టం చేసింది. ఇదే సమావేశంలో కల్వకుర్తి అంశాన్ని చర్చించే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. -
కేఎల్ఐ కల నెరవేరుస్తా..
తాగు, సాగునీటి కోసం కల్వకుర్తి ప్రాంత ప్రజలు దశాబ్ధాలుగా పాట్లు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) పూర్తయితే ఈ ప్రాంత ప్రజల సమస్య పరిష్కారం అవుతుందని తెలిసినా నాయకులు అంతగా పట్టించుకోలేదు. నాణ్యమైన నేలలున్నా సాగునీటి సమస్యతో నిరుపయోగంగా మారాయి. స్థానికంగా బతికే పరిస్థితి లేక జనం బతుకుదెరువు కోసం హైదరాబాద్ తదితర పట్టణాలకు వలస వెళ్తున్నారు. వేసవిలో తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్ది దూరం ప్రయాణించి, వ్యవసాయ భూముల నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కల్వకుర్తి పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. కల్వకుర్తి మండలం చుట్టూ ఉన్న దుంధుబి వాగు నుంచి కొంతమంది నాయకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి హైదరాబాద్ లాంటి పట్టణాలను వందల లారీల్లో ఇసుకను తరలించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు ఇంకిపోయింది. దశాబ్ధాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సాక్షి రిపోర్టర్ గా మారి కల్వకుర్తి మండలం ఎల్లికల్, రఘుపతిపేట గ్రామాల్లో పర్యటించారు. చల్లా వంశీచంద్‌రెడ్డి : మల్లేష్ అన్నా బాగున్నవా. ఏం చేస్తున్నవే. మల్లేష్ : బాగున్న సార్. ఏముంది బావి దగ్గర పల్లి చేను వేసిన, దాని బాగోగులు చూసుకుంటున్న. ఎమ్మెల్యే : కరెంట్ బాగొస్తుందా అన్నా మల్లేష్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. వేసిన పంట చేతికందుతుందో లేదోనని భయమైతుంది. ఎమ్మెల్యే : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది. మల్లేష్ : పక్కా టయానికి వచ్చేది, టయానికి పోయేది. ఇప్పుడు కరెంట్ పోతే ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఎమ్మెల్యే : ఏం వెంకట కిష్ణన్న బాగున్నవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎందుకు లేట్ అయ్యింది అనుకున్నవు అన్నా. వెంకటకిష్ణయ్య : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ఎవరు పట్టిచ్చుకున్నరు సారూ. అప్పటి నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పటికీ ప్రాజెక్ట్ పనితీరుపై అతీగతి లేకుండా పోయింది. ఎమ్మెల్యే : మీరెప్పుడు నిలదీయలేదా వారిని. వెంకట కిష్ణయ్య : ఊళ్లోకి వచ్చిన ప్రతిసారీ దాని గురించే అడుగుతున్నం. దాని ప్రయత్నంలోనే ఉన్నామని చెప్పేవారు. ఎమ్మెల్యే : బాలన్నా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? బాలయ్య : సబ్సిడీ కోసం కాగితాలే పైకి పంపలేదంట సార్. అధికారులను అడిగితే మళ్లీ పంపుతం అన్నరు. ఎమ్మెల్యే : రుణం మాఫీ అయ్యిందా లక్ష్మయ్య తాతా. లక్ష్మయ్య : రుణం మాఫీ కాలేదు. నేను తీసుకొని చాలా రోజులు అయ్యింది. అందుకే మాఫీ కాదంట సారూ. నేను బాకీ ఉన్నది *40 వేలే. మాఫీ అయ్యిందని తెలుసుకునేందుకు నెల రోజులు బ్యాంకు, మా గ్రామంలోని రాజకీయ నాయకుల చుట్టు చెప్పులరిగేలా తిరిగిన. ఎవరూ చెప్పలే. తర్వాత లిస్ట్‌లో నా పేరు రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే : పింఛన్ వస్తుందా? జంగయ్య : వస్తలేదు సారూ. అధికారులను అడిగితే, మళ్ల నెల వస్తదంటున్నరు. 2నెలలుగా ఫించన్ రాకపోవడంతో ఇంట్లో తినేందుకు రేషన్ బియ్యం కొనే పరిస్థితి లేదు. పింఛన్ ఇస్తరేమోనని, గ్రామ పంచాయతీ, మండల ఆపీసుల చుట్టు రోజూ తిరుగుతున్న. ఎవరూ పట్టించుకుంటలేరు. చాన మందికి రాలేదు. అందులో నువ్వు ఒక్కదానివి. అందరికి వచ్చినప్పుడు నీకు వస్తయంటున్నరు. ఎమ్మెల్యే : ప్రజలకు ఏం కావాలనే సరైన అవగాహన ప్రభుత్వం, అధికారులకు లేకపోవడంతోనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. ప్రజల తరఫున పోరాడి అర్హులందరికీ ఫించన్ అందేలా చేస్తా. ఎమ్మెల్యే : పిల్లలు ఏం చేస్తున్నారు మల్లయ్య తాతా మల్లయ్య : నాకు రెండెకరాల పొలమే ఉంది. దాన్ని నమ్ముకొని వాళ్లను పోషించిన. కానీ దానిపై ఆధారపడితే బతకలేరుగా అందుకే హైదరాబాద్‌లో పనికి వెళ్లారు. ఎమ్మెల్యే : చదువుకునే వసతులున్నాయా ఊళ్లో చంద్రశేఖర్ : ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే చదువుకుంటే ఉద్యోగం వస్తదనే ఆశలేదు. చాలామంది చిన్నప్పటి నుంచి పనిలో పెట్టారు. నేను కూడా పనిలో పెట్టా. వాళ్లు ప చేసుకొని బతుకుతున్నరు. ఎమ్మెల్యే : ఏం అమ్మమ్మా కూలి పనులకు వెళ్తున్నారా జంగమ్మ : వరినాటు పనులకు వెళ్తున్న నాయనా. కూలికి పోకుంటే ఎవరు బువ్వ పెడతరు. ఎమ్మెల్యే : ఉపాధి పనులు నిలిపేశారు కదా. ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా అక్కా. నారమ్మ : ఉపాధి వచ్చినందుకే ఊళ్లలో కూలిరేట్లు పెంచారు. అంతకుముందు *50 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు *200 వరకు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉపాధి కూలీలను నిలిపేయడం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎమ్మెల్యే : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు అర్ధం చేసుకొని, వారిని ఇబ్బందుల నుంచి గట్టింక్కించాలనే సదుద్దేశ్యంతో ఉపాధి హామీ పనులు ప్రారంబించింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దానిని నిర్వీర్యం చేయాలని చూస్తుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి తాతా. కోటయ్య : అధికారం చేతిలో ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్లు చేస్తే, అది సరైంది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనువైన నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వం నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. అలా కాకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే, అలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఎమ్మెల్యే : గ్రామంలో అంగన్వాడీ కేంద్రం బాగా నడుస్తుందా. కేంద్రంలో పోషక పదార్థాలు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారా. లక్ష్మి : వారంలో 3, 4 రోజులు మాత్రమే తెరుస్తారు. మిగతా రోజులు తెరువరు. కేంద్రం తెరిచిన రోజు, మిగతా సరుకులు పంపిణీ చేయమంటే చేయరు. గ ర్బిణీ, బాలింతలు, చిన్నారులకు అవసరమైన రీతిలో పంపిణీ చేయడం లేదు. ఎమ్మెల్యే : పీహెచ్సీ కేంద్రం పనితీరు ఎలా ఉంది. వైద్యులు సమయానికి వస్తున్నారా. రాములు : మా గ్రామంలో (రఘుపతిపేట) పీహెచ్సీ కేంద్రం ఉందనే మాటే కానీ.. ఎప్పుడూ ఉపయోగపడదు. డాక్టర్లు జెండా పండగనాడు, ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిస్తేనే వస్తారు. ఎమ్మెల్యే : ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయా. శంకరయ్య : ఎప్పుడో అమాస, పున్నానికి వచ్చే డాక్టర్లు, రోగులను పరీక్షించడం వరకే చేస్తరు. మందులు కావాలంటే కల్వకుర్తికి చీటీలు రాసి తెచ్చుకోమంటారు. ఆస్పత్రికి వస్తే పరీక్షిస్తారనే నమ్మకం లేదు. రోగుల సమస్యలు అస్సలు పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, సాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, KALWAKURTHY lift irrigation scheme, irrigation problem, the problem of fluoride -
ప్రాజెక్టులను త్వరగా ముగించండి
అసెంబ్లీలో ప్రస్తావించిన పలువురు సభ్యులు కల్వకుర్తి, రాజీవ్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టుల పూర్తికి వినతి నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలి జీరో అవర్‌లో వివిధ సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యేలు హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని అసెంబ్లీలో సభ్యులంతా ప్రభుత్వాన్ని కోరారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలోని రాజీవ్‌సాగర్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆయా పక్షాల ఎమ్మెల్యేలు పేర్కొన్నా రు. మునుపెన్నడూ లేని విధంగా జీరో అవర్‌లో 27మంది సభ్యులు మాట్లాడారు. తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ పాటలు, పద్యాల రూపంలో కళాకారుల సమస్యలను ఎలుగెత్తారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోయభాషలో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఇక టీఆర్ఎస్ బ్లాక్‌లో కూర్చొని మాట్లాడిన తమ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క స్పీకర్‌ను కోరారు. అధికారపక్షం వైపు ఉండటమే సాక్ష్యం: భట్టి సభలో టీఆర్ఎస్ బ్లాక్‌లో కూర్చొని రెడ్యానాయక్ మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘సభ్యులకు సీట్ల కేటాయింపులు జరగకున్నా బ్లాక్‌ల కేటాయింపు మాత్రం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రెడ్యానాయక్ టీఆర్ఎస్కు కేటాయించిన బ్లాక్‌లో కూర్చున్నారు. దీన్నే సాక్ష్యంగా పరిగణించి పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు చర్యలు తీసుకోవాలి’ అని స్పీకర్‌ను కోరారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘ఇంకా సీట్ల కేటాయింపు జరగలేదు. ఇప్పుడున్న ప్రకారం సీట్లు ఉంచాలా? లేక నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడే 153 సీట్లను ఉంచాలా? అన్న దానిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం చేస్తాం’ అని బదులిచ్చారు. అయితే ప్రతిపక్ష నేతలు అభ్యంతరం చెప్పారు. కోయభాషలో మాట్లాడిన రాజయ్య రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను ప్రస్తావించిన సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వాటిని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కోయ భాషలో మాట్లాడటంతో సభలో నవ్వులు విరిశాయి. ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి సాగుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. దీనిపై బదులిచ్చేందుకు మంత్రి హరీశ్ లేవగానే, మంత్రి సైతం కోయ భాషలో సమాధానం చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో అంతా గొల్లుమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రాజీవ్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. దీనిపై జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. రామజోగులు, దాసరులను కులాలుగా గుర్తించాలి రామజోగుల సమస్యలను ప్రస్తావిస్తూ ‘హరిశ్చంద్ర పద్యనాట కం చెదలు పట్టింది..’ అంటూ టీఆర్ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ పాట ఆలంకించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘రామజోగులు, దాసరులు, బేలజంగాల వంటి కళాకారులను ఆదుకోవాలి. వారి వారసత్వ సంస్కృతిని కాపాడాలి. వారిని ఓ కులంగా గుర్తించాలి’ అని విజ్ఞప్తిచేశారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి కోరారు. బీజేపీ సభ్యుడు రాజాసింగ్ లోథ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో అనేక రాష్ట్రాల వారు చాలా ఏళ్లుగా ఉంటున్నారు. స్థానికులు కాదంటూ కార్డులు ఇవ్వడం లేదు. హిందీ మాట్లాడే వారిపై దాడులు, గుండాగిరీ చేస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి’ అని కోరారు. సభ్యులు ప్రస్తావించిన ఇతర అంశాలు ►బోధన్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీ నం చేసుకోవాలి - జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్ ►ఖమ్మంలో ఎన్ఎస్పీ కెనాల్ పరిధిలో రెండువేల మంది పేదల గుడిసెలను తొల గించారు. ప్రభుత్వం తగిన ఆసరా చూపాలి. పట్టణపేదలకు నివాస స్థలాలు చూపించాలి. - పువ్వాడ అజయ్, కాంగ్రెస్ ►మహబూబ్‌నగర్‌కు మంచినీరు అందడం లేదు.ఈ దృష్ట్యా శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపట్టాలి. మన్నెంకొండను యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి పరచాలి. - శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ ► అదనపు బాధ్యతల వల్ల వాటర్ వర్క్స్ ఎండీ తన కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదు. ఆయన కార్యాలయంలో ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలి. - ముంతాజ్‌ఖాన్, ఎంఐఎం ► ఉప్పల్‌లోని బగాయత్ భూములను అభివృద్ధి పరిచి పేదలకు ఇప్పించేలా ప్రభుత్వం చూడాలి. - ఎన్వీవీఎస్ ప్రభాకర్, బీజేపీ ► దుబ్బాక నియోజకవర్గంలో ఊరకుక్కలను అరికట్టాలి. కోతులు, అడవి పందుల కారణంగా పంటలు నాశనమవుతున్నాయి. రైతులకు సోలార్ పవర్ ఫెన్సింగ్‌ను సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. - సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్ఎస్ ► ఆత్మకూరుమండల పరిధిలోని కాల్వల పనులను పూరిచేయాలి - సునీత, టీఆర్ఎస్ ► ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ నిర్మాణం పూర్తయినా ప్రజలకు సాగునీరు అందించడం లేదు. ఆసిఫ్‌నహర్ కాల్వ పనులను పూర్తి చేయండి. - గ్యాదరి కిశోర్, టీఆర్ఎస్ ► బాల్కొండ నియోజకవర్గ సాగునీటి అవసరాలకు ఎస్సారెస్పీ నుంచి 5 టీఎంసీల నీటిని కేటాయించాలి. -ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ ► దీపం పథకం కింద సబ్సిడీ నిధులను విడుదల చేయాలి. - మోజంఖాన్, ఎంఐఎం ► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచండి. ఉద్యోగ అర్హత వయసునూ పెంచాలి. - రవీంద్రకుమార్, సీపీఐ ► డోర్నకల్‌లోని శ్రీకురవి వీరభద్రస్వామి దేవాలయానికి సంబంధించిన పనులను పూర్తి చేయాలి. - రెడ్యానాయక్, ఎమ్మెల్యే ► ఆర్మూర్ కేంద్రంగా ప్రపంచానికి పసుపును అందిస్తున్నా ఇక్కడ బోర్డుగానీ, శుద్ధి కర్మాగారంగానీ లేవు. కనీస మద్దతు ధర అందడం లేదు. - జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ ► అంబర్‌పేటలోని 6వ నంబర్ చౌరస్తాలో ని ఫ్లైవోవర్‌ని నిర్మాణ పనులు వేగిరం చేయాలి. - జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ► ఖాజీపేట జంక్షన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యాగన్ నిర్మాణ కార్మాగారాన్ని వేగిరం చేయాలి. - వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ ► ఆదిలాబాద్‌లో గిరిజన యూనవర్సిటీని ఏర్పాటు చేయాలి. - రేఖానాయక్, టీఆర్ఎస్ ► వైరా నియోజకవర్గంలోని సాగునీటికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కారించి అక్కడి పంటలకు నీరివ్వాలి. - మదన్‌లాల్, ఎమ్మెల్యే