సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌తో పాటు అప్రోచ్ చానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ల వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) పరిధిలోని పంపులు నీట మునిగాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌లోకి నీళ్లు రావడానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంపుహౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే అండర్ టన్నెల్ (సొరంగం) పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్‌ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దాని వల్ల లీకేజీలు, స్లాబ్ క్రాక్‌లు, అద్దాలు పగిలిపోతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతేడాది ఆగస్టు 7న పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్, కేఎల్‌ఐ ఎస్‌ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలిపించారు. వారు టన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్‌ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. కానీ పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారు.
అయితే.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారిని కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా పటేల్ కంపెనీ వారు కోరారు. ప్రస్తుతం పనులు చేపడుతున్న మెగా కంపెనీ ఇటీవల రెగ్యులర్‌గా నిర్వహించిన బ్లాస్టింగ్‌ల వల్లనే ప్రమాదం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా డీవాటరింగ్ చేస్తేనే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్)
గోడల్లో పగుళ్లు
అయితే బ్లాస్టింగ్ వల్లనే పంపుహౌస్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటార్ బేస్‌మెంట్ కూడా పగిలిపోయింది. సర్జ్‌పూల్ షట్టర్లు మూసివేసినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అప్రోచ్ చానల్ గేట్లు మూసినా నీళ్లు వస్తున్నాయి. 95 మీటర్ల మేర పంపులు మునిగిపోయాయి. నీటి తోడివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గితేనే నీటిని తోడటం సాధ్యమవుతుందని తెలుస్తోంది.
సాగు, తాగునీటికి ఇబ్బందులే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3.40 లక్షల ఎకరాలకు సాగుతో పాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లోని సుమారు 3,088 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సరఫరా అవుతుంది. పంపులు నీట మునగడం వల్ల ఈ గ్రామాలన్నింటికీ తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీవాటరింగ్‌ను వెంటనే ప్రారంభించడంతో పాటు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లోని సర్పంచులకు ఇప్పటికే తాగునీటి కోసం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది.
(చదవండి: నీట మునిగిన ‘కేఎల్‌ఐ’ మోటార్లు)
Comments
Please login to add a commentAdd a comment