KALWAKURTHY project
-
బ్లాస్టింగే ముంచిందా?
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌తో పాటు అప్రోచ్ చానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ల వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) పరిధిలోని పంపులు నీట మునిగాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌లోకి నీళ్లు రావడానికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంపుహౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అండర్ టన్నెల్ (సొరంగం) పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దాని వల్ల లీకేజీలు, స్లాబ్ క్రాక్‌లు, అద్దాలు పగిలిపోతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మేలో కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతేడాది ఆగస్టు 7న పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్, కేఎల్ఐ ఎస్ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలిపించారు. వారు టన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. కానీ పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. అయితే.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారిని కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా పటేల్ కంపెనీ వారు కోరారు. ప్రస్తుతం పనులు చేపడుతున్న మెగా కంపెనీ ఇటీవల రెగ్యులర్‌గా నిర్వహించిన బ్లాస్టింగ్ల వల్లనే ప్రమాదం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా డీవాటరింగ్ చేస్తేనే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్) గోడల్లో పగుళ్లు అయితే బ్లాస్టింగ్ వల్లనే పంపుహౌస్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటార్ బేస్మెంట్ కూడా పగిలిపోయింది. సర్జ్‌పూల్ షట్టర్లు మూసివేసినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అప్రోచ్ చానల్ గేట్లు మూసినా నీళ్లు వస్తున్నాయి. 95 మీటర్ల మేర పంపులు మునిగిపోయాయి. నీటి తోడివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గితేనే నీటిని తోడటం సాధ్యమవుతుందని తెలుస్తోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3.40 లక్షల ఎకరాలకు సాగుతో పాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లోని సుమారు 3,088 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సరఫరా అవుతుంది. పంపులు నీట మునగడం వల్ల ఈ గ్రామాలన్నింటికీ తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీవాటరింగ్ను వెంటనే ప్రారంభించడంతో పాటు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాల్లోని సర్పంచులకు ఇప్పటికే తాగునీటి కోసం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది. (చదవండి: నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు) -
కల్వకుర్తి ఆయకట్టుకు పాలమూరు నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల సద్వినియోగం లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి కింద నిర్ణయించిన ఆయకట్టుకు పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్ల ద్వారా నీటిని అందించేలా ప్రణాళిక రచిస్తోంది. కల్వకుర్తి కింద కనీసంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు పాలమూరులోని ఏదుల, వట్టెం రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వడం ద్వారా స్థిరీకరణ చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ రెండు రిజర్వాయర్లు సిద్ధమైనందున కల్వకుర్తి కాల్వలకు వీటి నుంచి లింక్ కాల్వలు తవ్వే అవకాశాలపై ప్రస్తుతం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ముగిసిన అనంతరం నీటి సరఫరాకు శ్రీకారం చుట్టనుంది. మరింత నిల్వ..ఆయకట్టుకు భరోసా కల్వకుర్తి కింద నిజానికి మొదట 2.50 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించినా, తదనంతరం ఆయకట్టును 4.35 లక్షల ఎకరాలకు పెంచారు. నీటి కేటాయింపులు సైతం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. ఈ నీటిని శ్రీశైలం నుంచి వరద ఉన్న రోజుల్లోనే ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే కల్వకుర్తి పథకంలో మొత్తంగా 3.40 టీఎంసీల సామర్థ్యం ఉన్న మూడు రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వరద రోజుల్లో నీటి నిల్వ చేసే అవకాశం లేదు. ఈ దృష్ట్యానే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వడం కత్తిమీద సాములా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కల్వకుర్తి ఆయకట్టు పరిధిలోనే నిర్మించిన పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్ల ద్వారా నీటిని పంపిణీ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే తెరపైకి తెచ్చారు. అయితే పాలమూరు–రంగారెడ్డిలోని తొలి రిజర్వాయర్, పంప్‌హౌజ్ ఉన్న నార్లాపూర్ పూర్తి కాకపోవడంతో ఈ ప్రయత్నం ముందుకు పోలేదు. అయితే నార్లాపూర్ దిగువన 6.55 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయ్యాయి. దీంతో పాటే దిగువన ఉండే 16.58 టీఎంసీల సామర్థ్యం ఉండే వట్టెం రిజర్వాయర్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. ఈ రెండు రిజర్వాయర్లకు దగ్గరి నుంచి కల్వకుర్తి కాల్వలు వెళుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కల్వకుర్తి కాల్వలను మొదట ఏదుల రిజర్వాయర్‌తో అనుసంధానించి, దీన్ని నింపుతూ, ఈ రిజర్వాయర్ ద్వారానే కల్వకుర్తిలో భాగంగా ఉండే బుద్ధారం, ఘణపురంల కింది ఆయకట్టుకు సాగునీటిని పారించే అవకాశాలున్నాయని ఇంజనీర్లు అంచనా వేశారు. దీనికోసం 25 కిలోమీటర్ల మేర లింక్ కాల్వలు తవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనిద్వారా 40వేల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ లింక్ కెనాల్ కోసం సర్వే చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ఫలించాలంటే పాలమూరులో ముంపునకు గురవుతున్న ఓ గ్రామంలో సహాయ పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ గ్రామ ఆర్అండ్ఆర్ ప్రక్రియ వేగిరం చేయాలని రెండ్రోజుల కిందే జిల్లా మంత్రులు అధికారులకు ఆదేశాలిచ్చారు. వట్టెం రిజర్వాయర్ కింద... వట్టెం రిజర్వాయర్ కింద 2–4 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వితే కల్వకుర్తి కింద మరో 60 వేల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డిలోని మొదటి పంప్‌హౌస్ పనులు ఆలస్యమైనా, ఈ విధంగానే లబ్ధి తీసుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అయితే, వచ్చే ఏడాదికి ఈ ప్రతిపాదనను పట్టాలెక్కించే అవకాశం ఉందని ప్రాజెక్టుల అధికారులు చెప్పారు. -
కమీషన్ల కాకతీయగా మార్చేశారు
తలకొండపల్లి(కల్వకుర్తి): మిషన్ కాకతీయ.. కమీషన్ల కాకతీయగా మారిందని, కల్వకుర్తి ప్రాజెక్టు వలన ప్రజలకు ఒరిగిందేమీలేదని, నల్లగొండకు నీళ్లు, కల్వకుర్తికి కన్నీళ్లే మిగిలాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ధ్వజమెత్తారు. మంగళవారం మండల పరిధిలోని చంద్రధనలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారించేందుకు మలిదశ ఉద్యమం చేపడతామన్నారు. లక్ష్మీదేవి రిజర్వాయర్ పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కనీసం రైతు కుటుంబాలను పరామర్శించలేదు ఇటీవల కురిసిన భారీ వర్షానికి నిండిన చెరువులు, తెగిన కుంటలను ఆచారి పరిశీలించారు. నల్లచెరువుతో పాటు, తెగిన గొల్లకుంట, మోత్కుకుంట, సాయిరెడ్డికుంట, మోదోనికుంట, పెద్దకుంటలను ఆచారి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం కనీసం వారిని పలుకరించిన పాపాన పోలేదని.. పైగా ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు రైతులే కాదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ. 790 కోట్లు అందజేస్తే నయాపైపా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. సకాలంలో బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట పొలాలకు సాగునీరందించేందుకు రూపొందించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం చెరువులు నింపే పథకంగా మార్చిందని ఎద్దేవా చేశారు. 1993లో ఎడ్లబండి ద్వారా ఉద్యమాలు చేపట్టామని.. అదేవిధంగా జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు సాగునీరు పారించేందుకు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన చెప్పారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తయితే కల్వకుర్తి, చేవెళ్ల, షాద్‌నగర్, పరిగి మండలాలకు సాగునీరు వచ్చే అవకాశముందని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టుల పనులు చేట్టలేదని దుయ్యబట్టారు. లక్ష్మీదేవి ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపాదికన చేపట్టి ఈ ప్రాంత రైతంగానికి మేలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, సూర్యనాయక్, రమేష్, మహేష్, హరికృష్ణ, శ్రీకాంత్, చంటి, తిరుపతి, రాజు, శ్రీశైలం, ఉదయ్, శేఖర్, నర్సింహగౌడ్, మనోహర్, హరికాంత్, తదితరులు పాల్గొన్నారు. -
వాటాకు మించి వాడుతున్నారు.. జాగ్రత్త
కృష్ణా జలాల కేటాయింపులపై తెలంగాణ, ఏపీలకు బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో కేటాయింపులకు మించి వినియోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర ఛటర్జీ లేఖ రాశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకునేందుకు 31 టీఎంసీలకు అనుమతి ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు 33.05 టీఎంసీలు వినియోగం చేసిందని, 2.05 టీఎంసీలు అదనంగా వినియోగించుకుందని తెలిపారు. తెలంగాణ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 8.94 టీఎంసీల కేటాయింపులుంటే 11.59 టీఎంసీలు వాడారని, 2.65 టీఎంసీల అదనంగా వినియోగించుకున్నారని, అలాగే కల్వకుర్తి ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేకున్నా 2.659 టీఎంసీల నీరు వాడారని దృష్టికి తెచ్చారు. అదనపు వినియోగాలపై తదనుగుణ చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు. -
జూపల్లిని బర్తరఫ్ చేయాలి: నాగం
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ప్రాజెక్టులో అ క్రమాలు, అవకతవకలపై విచారణ జరిపిం చి మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈపీసీ టెండర్లలో జరిగిన అవినీ తిపైనా విచారణ జరిపించాలన్నారు. 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదిక, ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నా రు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... కల్వకుర్తి ఐదు లిఫ్టుల్లో ఒక్క దానికే నీళ్లు వదిలి పాలమూరుకు స్వర్ణయుగమంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ ఏడాది 3 నెలల కింద నీరు విడుదల చేసినా కనీసం మొక్కజొన్న, ఆరుతడి పంటలకు ఉపయోగపడేవన్నారు.కల్వకుర్తి కోసం రెండేళ్లలో రూ.245కోట్లు మాత్రమే ఖర్చు చేసి హరీశ్‌రావు రూ.2వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొవడం దారుణమన్నారు. -
'మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కల్వకుర్తి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించి మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దనరెడ్డి డిమాండ్ చేశారు. ఈపీసీ టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. దీనికి సంబంధించి 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను, ఆ తర్వాత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నారు. కల్వకుర్తి అయిదు లిఫ్ట్‌లలో ఒక్క దానికి నీళ్లు వదిలి పాలమూరుకు స్వర్ణయుగమంటూ టీఆర్ఎస్ ప్రచారం చేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవన్నారు. కనీసం ఈ ఏడాది మూడు నెలల కిందట విడుదల చేస్తే కనీసం మొక్కజొన్న, ఆరుతడి పంటలకు ఉపయోగపడి ఉండేదన్నారు. కల్వకుర్తి కోసం రెండేళ్లలో రూ. 245 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మంత్రి హరీష్‌రావు 2వేల కోట్లు ఖర్చుచేశామనడం దారుణమన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నపుడు పాలమూరు కోసం, కల్వకుర్తి ప్రాజెక్టు కోసం కేసీఆర్ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. కల్వకుర్తి సామర్థ్యం కుదించారని, కాల్వల వెడల్పు తగ్గించారని,. టన్నెల్ 9 మీటర్లు ఉండాల్సి ఉండగా దానిని దానిని మంత్రి జూపల్లి 6.85 మీటర్లకే కుదించారని ఆరోపించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.10-15 వేల కోట్లు ఖర్చు చేస్తే 33 ప్రాజెక్టులు పూర్తయి 42 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండగా, సీఎం కేసీఆర్ కోటి ఎకరాల పాట పాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ పాత్ర నామమాత్రం, శూన్యమని, జాప్యానికి మాత్రవం సీఎందే బాధ్యత అన్నారు. -
ప్రాజెక్టుల నిర్ణీత ఆయకట్టుకు నీరు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజె క్టుల కింద ఖరీఫ్ నాటికి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో 1.20 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సూచించారు. పంప్‌హౌస్ ల నిర్మాణం, భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కల్వకుర్తి మూడో దశ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న గామన్ ఇండియా కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని, సబ్ కాంట్రాక్టర్‌తో పనులు చేయించే అవకాశాలను పరిశీలించాలన్నారు. సోమవారం పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. కల్వకుర్తి కింద భూసేకరణకు రూ.9 కోట్ల ప్రతిపాదనలను పంపాలన్నారు.