వాటాకు మించి వాడుతున్నారు.. జాగ్రత్త
కృష్ణా జలాల కేటాయింపులపై తెలంగాణ, ఏపీలకు బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో కేటాయింపులకు మించి వినియోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర ఛటర్జీ లేఖ రాశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకునేందుకు 31 టీఎంసీలకు అనుమతి ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు 33.05 టీఎంసీలు వినియోగం చేసిందని, 2.05 టీఎంసీలు అదనంగా వినియోగించుకుందని తెలిపారు.
తెలంగాణ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 8.94 టీఎంసీల కేటాయింపులుంటే 11.59 టీఎంసీలు వాడారని, 2.65 టీఎంసీల అదనంగా వినియోగించుకున్నారని, అలాగే కల్వకుర్తి ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేకున్నా 2.659 టీఎంసీల నీరు వాడారని దృష్టికి తెచ్చారు. అదనపు వినియోగాలపై తదనుగుణ చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.