ప్రాజెక్టుల నిర్ణీత ఆయకట్టుకు నీరు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజె క్టుల కింద ఖరీఫ్ నాటికి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో 1.20 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సూచించారు.
పంప్‌హౌస్ ల నిర్మాణం, భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కల్వకుర్తి మూడో దశ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న గామన్ ఇండియా కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని, సబ్ కాంట్రాక్టర్‌తో పనులు చేయించే అవకాశాలను పరిశీలించాలన్నారు. సోమవారం పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. కల్వకుర్తి కింద భూసేకరణకు రూ.9 కోట్ల ప్రతిపాదనలను పంపాలన్నారు.