కళ్యాణలోవని కాపాడుకుందాం
భవన నిర్మాణాన్ని సౌందర్యవంతం చేయటానికి వాడే గ్రానైట్ ప్రజల జీవనాధారాలను, అవసరాలను, సంస్కృతిని, పర్యావరణాన్ని కొల్ల గొట్టే విధ్వంసంలో ఉంటోందని కల్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతాల పర్యటన మొహంమీద చరిచి మరీ చెప్పింది. విశాఖపట్నానికి 68 కిలోమీటర్ల దూరంలో దేముని కొండ సోమాలమ్మకొండకు మధ్య 1975లో కల్యాణలోవ రిజర్వాయర్ నిర్మించారు. ఒకవైపు ఆ రిజర్యాయర్‌కు ఎగువన సౌందర్యభరితంగా కనిపించే పరీవాహక ప్రాంతపు ప్రజాజీవనం, మరొకవైపు దిగువన 5 వేల ఎకరాల ఆయకట్టు ప్రాంత సన్నకారు సాగుదార్ల జీవనం, నాలుగైదేళ్లుగా క్వారీల ప్రవేశంతో కల్లోలకడలిగా మారిపోయింది. అక్కడి ప్రజల పోరాటస్వరాలని సమన్వయం చేస్తున్న పి.ఎస్. అజయ్ కుమార్ పిలుపు మేరకు సామాజిక సాహిత్య కార్యకర్తలం అక్టోబర్ 18, 19 తేదీల్లో రిజర్వాయర్ పరిసరాలు, కొత్తకోట, జెడ్. జోగిం పేట, రొచ్చుపణుకు, అజయ్ పురం గ్రామాలు చూసి, ప్రజల అభిప్రాయాలు విన్న తరువాత సమస్య తీవ్రత, విస్తృతి తెలుసుకున్నాం.
మూడు గ్రానైట్ మైనింగ్ కంపెనీలు కల్యాణలోవ రిజర్వాయర్ పరీవాహక గ్రామాలలో తవ్వకాలు చేపట్టాయి. రెవెన్యూ అధికారులతో వచ్చి ఇంటికి ఒక ఉద్యోగం, భూములకు పట్టాలు, రోడ్లు, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ నిర్మాణమనే ఆశలు చూపించి, బెదిరించి, అంగీ కార పత్రాలు రాయించుకొని ఏదీ నెరవేర్చకుం డానే వాటిపని అవి చేసుకుపోతున్నాయి. జెడ్.జోగింపేటకు కిలోమీటర్ లోపలే ఉన్న సోమాలమ్మకొండ మీద 2016 నుండి, పొట్టిమెట్ట కొండ మీద 2018 నుండి గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ రెంటి మధ్య అజయ్ పురం వుంది. ఆ ఊళ్లో ఇళ్లు బ్లాస్టింగ్‌కు అదిరి బీటలు వారాయి. బాంబుల శబ్దాలకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఊటలు, గెడ్డలు బ్లాస్టింగ్ వ్యర్ధాలతో మూసుకుపోయి, మైళ్ళదూరం కొండలు, లోయలు ఎక్కిదిగి నీళ్లు మోసుకు రావలసి వస్తున్నదని ఏ వూళ్లోనైనా ఆడవాళ్లు ఏకకంఠంతో చెప్పినమాట.
చల్లకొండకు 100 మీటర్ల దూరంలోని గ్రామం రొచ్చుపణుకు. అక్కడ ఒకటి నుండి అయిదు తరగతుల వరకు చదివే 35మంది పిల్లలతో వున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 2016లో మూతబడిపోయింది. బ్లాస్టింగ్ ధ్వనులకు, భారీవాహనాల రాకపోకలకు, ఎగసిపడే రాయిపిండికి జడిసి ఆదివాసీలు పిల్లలను బడికి పంపటం మానేశారు. పిల్లలు లేరన్న కారణంగా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం ఆ బడిని రద్దుచేసింది. పచ్చటికొండల మధ్య, పసిపిల్లల లేత నవ్వులను, జిలిబిలి మాటలను ప్రతిధ్వనించిన ఒకనాటి పాఠశాల ఈనాడొక శిథిల శూన్యగృహం. అమాయకపు పిల్లల భవిష్యత్తు, మైనింగ్ వ్యర్థాల కింద అణగిపోయిన సహజ నీటి ఊటగెడ్డల వలే ఆవిరైపోవలసినదేనా?
ఆదివాసీల నీటివాడకం హక్కులకు, విద్యాహక్కులకు, ప్రశాంతంగా జీవించే హక్కులకు భంగం కలిగించటమే కాక వాళ్ళ లౌకిక జీవిత సంస్కృతిని హైందవీకరించే దుర్మార్గానికి దిగుతున్నాయి ఈ కంపెనీలు. కల్యాణలోవ రిజర్వాయర్ రక్షణకు బాధ్యత వహించవలసిన ఇరిగేషన్ విభాగం ప్రమేయమే లేకుండా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, పరీవాహక ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించి ఆదివాసీల సహజ హక్కులను, జాతి సంపద అయిన కల్యాణలోవ రిజర్వాయర్ని కాపాడాలని అక్కడి ప్రజలిప్పుడు నినదిస్తున్నారు.
కాత్యాయనీ విద్మహే
వ్యాసకర్త కార్యదర్శి , ప్రరవే తెలంగాణ
katyayani.vidmahe@gmail.com