కమల్ హాసన్‌తో మణిరత్నం భారీ ప్రాజెక్ట్.. 35 ఏళ్ల తర్వాత..!
పొన్నియిన్ సెల్వన్‌తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మణిరత్నం. కల్కి మ్యాగజైన్లో వచ్చిన నవల ఆధారంగా తెరకెక్కించారు. గతంలోనే ఈ చిత్రాన్ని తీసేందుకు ఆయన యత్నించారు. కానీ అనేక కారణాలతో అది వీలు కాలేదు. మొదట ఈ భారీ చిత్రాన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్లో తీయాలనుకున్నారు. బడ్జెట్ సమస్యతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అయితే లైకా ప్రొడక్షన్స్ పొన్నియిన్ సెల్వన్ నిర్మించేందుకు ముందుకు రావడంతో ఆయన కల నెరవేరింది.
అయితే తాజాగా మణిరత్నం మరో బిగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనిపై రెడ్ జైంట్ మూవీస్ సంస్థ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో 1987లో వచ్చిన 'నాయకన్' తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో చిత్రం రానుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
(చదవండి: మణిరత్నం కల సాకారమవడానికి కారణం బాహుబలినే!)
రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లలోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించనున్నారు. గతంలో ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నం మ్యాజికల్ కాంబినేషన్లో వచ్చిన నాయగన్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. “35 సంవత్సరాల క్రితం మణిరత్నంతో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు అంతే ఉత్సాహంగా ఉన్నా. ఒకేరకమైన మనస్తత్వం గల వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహానికిి రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అని అన్నారు. దర్శకుడు, నిర్మాత మణిరత్నం మాట్లాడుతూ.. "కమల్ సర్‌తో మళ్లీ కలిసి పని చేయడం సంతోషంగా, ఉత్సాహంగా ఉంది." అని అన్నారు.
నిర్మాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. “ఉలగనాయగన్ కమల్ హాసన్ 234వ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడం గొప్ప గౌరవం. ఒక అద్భుతమైన అవకాశం. కమల్ సార్, మణి సార్‌ని అమితంగా ఆరాధిస్తాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.'' తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
THE TWO LEGENDS ARE BACK AGAIN AFTER 35 YEARS! 🥁💥
PRESENTING #KH234 WRITTEN & DIRECTEd by #ManiRatnam @ikamalhaasan #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran @bagapath @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM pic.twitter.com/pJxldVGMqw
— Red Giant Movies (@RedGiantMovies_) November 6, 2022