కమలామార్కెట్‌కు కళ!
- జూన్ నుంచి డీయూ క్లాసులు
- దుకాణాల్లో భారీ రద్దీ
న్యూఢిల్లీ: కొత్త ఆశలు, ఆశయాలతో ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో అడుగుపెట్టే విద్యార్థులు ఇప్పటి నుంచే పుస్తకాలు, దుస్తుల వంటివన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో క్యాంపస్ సమీపంలో ఉండే కమలానగర్, టిబెటన్ మార్కెట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దుస్తుల దుకాణ దారులకు తీరిక దొరకడం లేదు. పుస్తకాల దుకాణాలు ముందు చేంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెస్టారెంట్లు రుచికరమైన ఆహారానికి పెట్టిందిపేరు. ‘కమలానగర్లో మంచి ఆహారం దొరుకుతుందని మా సీనియర్లు చెప్పారు.
మా స్నేహితులతోపాటు వెళ్లి అక్కడి పదార్థాలను రుచి చూసి రావాలనుకుంటున్నారు’ అని డీయూలో సీటు ఆశిస్తున్న అంబిక అనే విద్యార్థిని చెప్పింది. కమలానగర్ మార్కెట్ క్యాంపస్‌కు దగ్గర కాబట్టి ఇక్కడ పుస్తకాలు, ఆహారం, దుస్తుల వ్యాపారం జోరుగా సాగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలుదారుల్లో దాదాపు 50 శాతం మంది విద్యార్థులేనని తెలిపారు.
కొత్త సిలబస్‌కు అనువైన పుస్తకాలను కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంచామని పుస్తకాల దుకాణ యజమానులు చెప్పారు. సిలబస్‌కు అనుగుణంగా కొన్ని పుస్తకాలను తొలగించి, అవసరమైన వాటినే విక్రయిస్తున్నామని బుక్‌ల్యాండ్ యజమాని సచిన్ అన్నారు. పుస్తకాలే కాదు చౌకధరల దుస్తులకు కమలానగర్ మార్కెట్ పెట్టింది పేరు. ఆధునిక శైలి ఉట్టిపటే నియోన్, బ్లింగ్, ప్రింటెడ్ పలాజోస్ తరహా వస్త్రాలను ఈ తరం యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని
ఇక్కడ దుకాణం నిర్వహిస్తున్న యువకుడు ఒకరు అన్నాడు. బ్యాండ్లు, రింగులు, క్లిప్స్ వంటి చిన్న చిన్న వస్తువులకూ బాగా డిమాండ్ ఉందని ఒక దుకాణంలో పనిచేసే అంబిక చెప్పింది. వినియోగదారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఒకటి కొంటే మరొకటి ఉచితం ఆఫర్ ఇస్తున్నామని వివరించింది. గత కొన్ని కమలానగర్ మార్కెట్లో వ్యాపారం బాగా పెరిగిందని తెలిపింది.
ఐడీ కార్డులతో సిమ్
ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు డీయూలో చదువుతున్న సంగతి తెలిసిందే. అయితే సిమ్ కార్డులు పొందాలంటే స్థానిక చిరునామాను నిర్ధారించే ధ్రువపత్రాలు అవసరం. పరాయి రాష్ట్రాల వారికి ఇలాంటి పత్రాలు ఉండవు కాబట్టి డీయూ విద్యార్థి గుర్తింపుకార్డులు చూపిస్తే సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసి ఇస్తున్నామని అమ్మకందారులు తెలిపారు. అంతేగాక ‘ఫస్ట్ రీచార్జ్’ ఆఫర్‌గా రూ.100 రీచార్జ్ చేసుకుంటే సిమ్‌కార్డుతోపాటు రూ.100 టాక్‌టైమ్ ఇస్తున్నామని చెప్పారు.
ఇక్కడ 16 ఏళ్లుగా కొనసాగుతున్న మొమోస్ పాయింట్‌కు ఇప్పుడు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ‘నేను హన్స్‌రాజ్ కాలేజీలో చదువుకునేటప్పుడు మొమోస్ తినాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అందుకే నేను ఇక్కడ ఈ ఫలహారశాల పెట్టాను. మేం సొంతగా మసాలా మొమోను ప్రవేశపెట్టాం. దానికి ఇప్పుడు చాలా ఆదరణ ఉంది’ అని ఆయన వివరించారు. ఈ మార్కెట్లో కొత్తగా వెలిసిన రెస్టారెంట్లు వినియోగదారులను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నాయి.