Shanigaram Village: చరిత్రకెక్కిన శనిగరం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌కు 20 కి.మీ. దూరంలో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో శనిగరం గ్రామం ఉంది. ఇక్కడి పురాతన శిథిల శివాలయంలో అరుదైన ఆధారాలు బయటపడ్డాయి. నిర్మాణశైలి ప్రకారం ఈ గుడి కాకతీయుల శైలికి చెందింది. నాలుగు అడుగుల ఎత్తయిన జగతిపై ఆలయ నిర్మాణం జరిగింది. 16 కాకతీయ శైలి స్తంభాలతో కూడిన అర్ధమంటపం ఉంది. అలాగే, అంతరాలం, గర్భగుడులు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు రమేష్‌శర్మ, ఉజ్జేతుల రాజు వెల్లడించారు.
కొత్త కాకతీయ శాసనం
శనిగరంలో కొత్త కాకతీయ శాసనం ఒకటి లభించింది. ఈ శాసనం ఒక గ్రానైట్ రాతిస్తంభం మీద మూడు వైపుల చెక్కి ఉంది. సూర్యచంద్రులు, శివలింగం, ఆవులు శాసనం పైవైపు చెక్కి ఉన్నాయి. శాసనాన్ని చూసి రాసుకున్న దాని ఆధారంగా ఈ శాసనం రామనాథ దేవాలయానికి ఆ ఊరిప్రజలు.. బ్రాహ్మణుల సమక్షంలో కొంత భూమి దానం చేసినట్లు గుర్తించారు. మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఓరుగల్లులో రాజ్యం చేస్తున్నపుడు మన్మథనామ సంవత్సరం (క్రీ.శ.1295)లో వేసిన శాసనంగా భావిస్తున్నారు. ద్వారస్తంభం మీద కలశాలు చెక్కి ఉన్నాయి. గుడి కప్పుకు ప్రత్యేకమైన కాకతీయశైలి ప్రస్తరం (చూరు) కనిపిస్తుంది.
ఈ గుడిలోని స్తంభాలపై చెక్కిన అర్థశిల్పాలు ప్రత్యేకం. ఇవి రామప్పగుడిలోని స్తంభశిల్పాలకన్నా ముందరి కాలానికి చెందినవి. విశేషమైన శిల్పం ఒక స్తంభం మీద కనిపించింది. ఈ స్తంభశిల్పంలో ఒకవైపు విల్లు ధరించిన చెంచులక్ష్మి కాలికి గుచ్చుకున్న ముల్లు తీస్తున్న దృశ్యం, ఇంకోవైపు ఎద్దులతో రైతు కనిపించడం విశేషం. ఇది ఏరువాకకు చెందిన శిల్పమే. ఇక కొన్ని ఆధారాలను పరిశీలిస్తే కాకతీయుల పాలనలో ప్రధాన కేంద్రం ఇదేనని ప్రాథమికంగా భావిస్తున్నారు.
రామప్పను తలపించేలా..
ఈ స్తంభ శిల్పాల్లో ఒక స్తంభంపై ముగ్గురు నృత్యకారులు నాలుగు కాళ్లతో కనిపించే శిల్పం రామప్పగుడి మాదిరిగానే ఉంది. మరో స్తంభంపై ఏనుగులు తొండాలతో పోట్లాడుతున్నట్టు, ఇంకో స్తంభం మీద హంసలు ఉన్నాయి. వైష్ణవమత ప్రతీకైన గండభేరుండం, శైవమతంలో పేర్కొనబడే శరభేశ్వరుల శిల్పాలను ఎదురుపడినట్లుగా చెక్కిన శిల్పం మరో స్తంభంపై చూడొచ్చు. ఒక స్తంభంపై రెండు గుర్రాలమీద స్వారీ చేస్తూ ఆయుధాలతో ఇద్దరు వీరులు కనిపిస్తున్నారు. దేవాలయ స్తంభాలపై యుద్ధ దృశ్యం చాలా అరుదైంది. రామాయణాన్ని తలపించే లేడివేట దృశ్యం.. విల్లమ్ములతో వీరుడు, అమ్ముదిగిన జింకను తీర్చిదిద్దారు.
ఏనుగును వధిస్తున్న వీరుడితో పాటు ఆలయ ప్రాంగణంలో హనుమంతుని శిల్పం, ఒక శాసనఫలకం ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం కింద ఉన్న శాసనలిపిలో సింమ్వ సింగ్గన అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. అది హనుమాన్ శిల్పాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరై ఉంటుందని భావిస్తున్నారు. ఇలా కాకతీయుల పాలనకు అద్దంపట్టే అనేక శిల్పాలు రామప్ప గుడిని తలపిస్తున్నాయి. కాగా చాళుక్యల శైలి నిర్మాణవాస్తుతో కట్టిన గుడి ఆనవాళ్లు, గుడిస్తంభాలు ఉన్నాయని, వాటిమీద ఇనుమును కరగదీసిన ఆనవాళ్లు, నలుపు ఎరుపు కుండపెంకులు, రాగి నాణేలు లభించాయని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.